Sunday, November 24, 2024

రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ?

  • జోరందుకున్న ఊహాగానాలు
  • గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు
  • కలిసిరానున్న రాహుల్ సాన్నిహిత్యం
  • యువతను ఆకట్టుకునే సామర్థ్యం
  • టీడీపీ నేతగా చెరగని ముద్ర

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.   కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కాజ్ గిరి ఎంపీ  రేవంత్ రెడ్డి పీసీసీ కొత్త సారధిగా పగ్గాలు చేపడతారని, ఈ నెల 9వ తేదీన అధికారిక ప్రకటన వెలువడుతుందని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రేవంత్  పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని గతంలో ప్రచారం జరిగింది.  రాజ్య సభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ లో దశాబ్ధాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన నేతలు  ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి కారణంగా కూడా లేకపోలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రావడం ఒక కారణమైతే ఆయనకు మించిన అనుభవం ఉన్న నేతలు కాంగ్రెస్ లో కొదువలేదు. దీంతో బయట నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు అప్పజెపితే చూస్తూ కూర్చోమంటూ వీహెచ్ లాంటి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వీరిలో కోమటి రెడ్డి సోదరులు, కరీంనగర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి హనుమంతరావులతో పాటు తెరవెనుక చాలా మందే ఉన్నట్లు సమాచారం.

కేసీఆర్ ను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి తప్ప మరో దారి కనిపించడంలేదు. రేవంత్ తన యాసతో ప్రజలను ఆకట్టుకోగలిగే సత్తా ఉన్న నేత. తూటాల్లాంటి మాటలతో తెలంగాణ ప్రజలను మెప్పించగలరు. తెలంగాణ యాసలో ఆయన చేసే ప్రసంగాలు సభికులను అలరిస్తాయి. కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా పిట్ట కథలు చెప్పటంలో దిట్ట. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో భారీ జన సమీకరణ చేయగల సత్తా ఉన్న నేతలు ఎవరూ లేరు. తమ చాణక్యంతో ఎన్నికల్లో పార్టీని గెలిపించిన సందర్భాలు లేవు. రేవంత్ ను కాదని వేరెవరికయినా పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీని విజయపథంలో నడిపించగలరా అంటే ఖచ్చితంగా లేదనే చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు.  

అటు కేసీఆర్ ను గానీ బీజేపీ ను గానీ ఢీకొట్టే నేత కాంగ్రెస్ లో దరిదాపుల్లో లేరనే చెప్పొచ్చు. బలమైన ఇమేజ్ ఉన్న నాయకుడు గానీ, అందరిని కలుపుకు పోయి సమిష్టిగా పనిచేసే స్వభావం గానీ ఇపుడున్న కాంగ్రెస్ నేతల్లో లేరనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి అన్నిపార్టీలలోనూ సన్నిహితులు ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం రేవంత్ కు కలిసొచ్చే అంశం. తన దూకుడు మాటలతో టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతకంటే చాణక్యంతో ఎదుర్కొనే వ్యూహంతో రేవంత్ ముందుకెళ్లాలి. రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కాంగ్రెస్ లో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసొచ్చే ప్రధాన అంశం.

అధిష్ఠానం రేవంత్ వైపు చూడటానికి మరోకారణం రాహుల్ కోటరీలో రేవంత్ కున్న సాన్నిహిత్యం ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకు లేకపోవడం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితులను కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. దీనికితోడు రాహుల్ ప్రచారానికి రప్పించడంలో రేవంత్ కృషి ఎనలేనిది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివగంత జైపాల్ రెడ్డి తో బంధుత్వం అయనకు కలిసొచ్చే అంశం. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపడితే టీడీపీ  శ్రేణులు రేవంత్ వైపు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల అనంతరం 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో విలీనమవడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అనేక మంది పార్టీ నేతలూ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులూ పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ లో చేరిపోయారు. వీరిని అడ్డుకునేవారు కాని,  బుజ్జగించేంవారు కాని పార్టీలో లేరు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించినా అధికార పార్టీలోకి ఫిరాయిస్తారన్న ప్రచారం జరిగింది.

గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి కాంగ్రెస్ ను ఏకతాటిపై నడిపించే నాయకుడి కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడితే ఎన్నికల కంటే ముఖ్యంగా గ్రూపు తగాదాల మీదనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రూపు తగాదాల నడుమ రేవంత్ పీసీసీ పగ్గాలు చేపడితే వాటికి త్వరగా చెక్ పెట్టి ఎన్నికల నాటికి సమరోత్సాహంతో కదన రంగంలో అడుగుపెట్టొచ్చని అంచనాగా తెలుస్తోంది.

 ఇక తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యూహ రచన చేస్తున్న టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇందుకోసం సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కాంగ్రెస్‌లోని  నేతల మద్దతును కూడగడుతూనే.. టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపడితే చెల్లా చెదురవుతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి తేవాల్సిఉంటుంది. పార్టీలో కరడుగట్టిన సీనియర్లను మెప్పించాల్సిఉంటుంది. తన సమవయస్కుల్సి కలుపుకుని పోవాల్సి ఉంటుంది.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మరికొందరి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా అధిష్ఠానం రేవంత్‌ రెడ్డి పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గ్రూపు తగాదాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ మొత్తాన్ని నడిపించే సమర్థత, కేసీఆర్‌కు ధీటుగా సమాధానం ఇవ్వగలడని రేవంత్‌రెడ్డి మీద నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ అధికారానికి దూరమైనా, పోటీ చేస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతున్నా  తెలంగాణ కాంగ్రెస్ లో  మాత్రం గ్రూపు రాజకీయాలకు కొదవ లేదు. ముఖ్యంగా గ్రూపు రాజకీయాల కారణంగానే కార్యకర్తలు ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నా కష్టకాలంలో తమకు అండగా నిలబడే నాయకుడు లేడని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

బీజేపీ వైపు  చూస్తున్న రెడ్డి సామాజికవర్గం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ ధోరణి గమనిస్తే రెడ్డి సామాజికవర్గం మొత్తం బీజేపీవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేకపోతుండటం, టీఆర్ఎస్ తో ఉన్నా తమకు మనుగడ ఉండదనే అనుమానంతో   ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మళ్లుతున్నట్లు సమాచారం. రెడ్డి సామాజికవర్గం లేకపోతే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడి పోతుందనడంలో సందేహంలేదు. రాబోయే రోజులలో ఆ సామాజికవర్గం నుంచి బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కాంగ్రెస్ లో పేరెన్నికగన్న సీనియర్ నేతలు తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం బలమైన నాయకత్వం కోసం ఎదురు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.  టీఆర్ఎస్ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది కనుక టీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేయాలనుకొనేవారంతా బీజేపీలో చేరాలని అభిలషించడం సహజం. అప్పుడు కాంగ్రెస్ మరింత బలహీనమైపోతుంది.అటువంటి దుస్థితి సంభవించకుండా కాంగ్రెస్  పార్టీ తీసుకునే నిర్ణయాలపై  ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జాతీయ స్థాయిలో నాయకత్వ లోపం

జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసేవారులేక పార్టీలో సీనియర్ నేతలు, ద్వితీయ స్థాయి నేతలతో పాటు కార్యకర్తలు కూడా తలో దిక్కు పోతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపించడం జాతీయ స్థాయిలో బీజేపీ దూకుడును అడ్డుకునే సమర్ధవంతమైన పార్టీలు గానీ నేతలు గానీ లేకపోవడంతో పార్టీ చిందరవందరగా తయారవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించడం, అంతర్గత విభేదాలతో పార్టీలో నేతలు విచక్షణ కోల్పోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సమర్థ నాయకత్వం లేకపోవడంతోనే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వరుస అపజయాలను మూటగట్టుకుంది. అయినా తీరు మారని అధి నాయకత్వం  ఉదాసీనవైఖరి అవలంబించడంతో పార్టీ నేతలు దిక్కులు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి  మథ్య ప్రదేశ్ లో అధికారం కట్టబెట్టినా అంతర్గత కలహాలతో అధికారం వదులుకోవాల్సి వచ్చింది. యువనేత ను కాదని సీనియర్లకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ దానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. అటు రాజస్థాన్ లో కూడా ఇలాంటి పరిస్తితులే నెలకొన్నాయి.

కాంగ్రెస్ మనుగడ సాధ్యమేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా ప్రమాదకరమైన సంకేతాలు పంపింది. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ కే పట్టం కట్టినా కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరగబోయే ఎన్నికలనాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందో లేక మరింత క్షీణిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. రెండు స్థానాలు మాత్రమే గెలిచినందుకు నైతిక బాధ్యత స్వీకరిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధిష్ఠానం ఆమోదిస్తోందో లేదో, ఆయన  స్థానంలో ఎవరిని నియమిస్తారో వేచి చూడాల్సిందే. టీపీసీసీ పగ్గాలను యువనేత రేవంత్ రెడ్డికి అప్పజెప్పుతారనీ, ఆయన సోనియగాంధీ జన్మదినమైన డిసెంబర్ తొమ్మిదో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారనీ వదంతులు బలంగానే వినిపిస్తున్నాయి.జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్  పార్టీ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ అధ్యక్ష ఎంపికపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయంతోనే   ఆ పార్టీ భవితవ్యం, నేతల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read:జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు

Also Read:ఉత్తమ్ రాజీనామా…కొత్త సారథి రేవంత్?

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles