- పార్టీకి సోనియా, రాహుల్ ఇద్దరే నాయకులు, తక్కినవారంతా సైనికులు
- రెండేళ్ళ వ్యవధి ఇస్తే తెలంగాణను కేసీఆర్ ‘చెర’ నుంచి విడిపిస్తా
- అందరూ సమైక్యంగా పని చేస్తేనే లక్ష్యం సాధించగలం
‘నాకు రెండేళ్ళ వ్యవధి ఇవ్వండి,తెలంగాణను కేసీఆర్ చేతుల్లో నుంచి విడిపిస్తాను,’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులకూ, కార్యకర్తలకూ చెప్పారు. జుబిలీహిల్స్ లోని పెద్దమ్మగుడిలో ఉదయం పూజ చేసి బంజారాహిల్స్, నాంపల్లి మీదుగా గాంధీభవన్ చేరడానికి ముందు నాంపల్లిలో దర్గా దగ్గర కొద్ది సేపు ఆగి ప్రార్థన చేశారు. పెద్దమగుడి నుంచి పెద్ద ఊరేగింపులో కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్ కు చేరుకున్నారు. అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా పలు సంవత్సరాలుగా పని చేస్తున్న కెప్టెన్ ఉత్తమ కుమార్ రెడ్డి చేతుల్లో నుంచి అధికార పగ్గాలను స్వీకరించారు. పక్కనే సీఎల్ పీ నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. జానారెడ్డి, ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడు మణిక్కం టాగూరు, మరో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి తారిక్ అన్వర్, కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు, శ్రీనివాసన్,సీతక్క, పోడెం వీరయ్య, పీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.
ఉత్సాహభరిత వాతావరణంలో కార్యకర్తలకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వారిని వారిస్తూ, ‘‘ఇప్పుడు కాంగ్రెస్ కు ఇద్దరే నాయకులు ఉన్నారు. వారు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, నాతో సహా మిగిలినవారంతా సైనికులం మాత్రమే. రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ను కాపాడే పనిలో ఉంటామని ఇంటి దగ్గర మీ తల్లులకూ, ఇతర కుటుంబసభ్యులకూ చెప్పండి. రెండు సంవత్సరాలు వేరే పని లేకుండా పార్టీ నిర్మాణంపైన దృష్టిపెట్టి పని చేద్దాం,’’ అంటూ ఉద్భోదించారు.
పార్టీలో తనకంటే సీనియర్లు చాలామంది ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించి తనను పొగడకుండా పార్టీ అధినేతలను పొగడాలని కార్యకర్తలకు సూచించారు. ఇది మంచి నిర్ణయం. ఒదిగి ఉండడం ద్వారా పనులు సాధించవచ్చుననే సూక్ష్మాన్ని రేవంత్ గ్రహించినట్టు కనిపించారు. దూకుడు స్వభావి అయిన రేవంత్ రాజకీయాలలో, వ్యాపార లావాదేవీలలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రతీతి. పాలకపక్షమైన టీఆర్ఎస్ పైనా, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్)పైనా, ఆయన కుమారుడు కే. తారకరామారావుపైన ఒంటికాలిపైన లేస్తారు. కానీ పార్టీ సహచరులతో మృదువుగా మాట్లాడాలనీ, మర్యాదగా వ్యవహరించాలనీ, సామరస్యంగా మెలగాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
కాంగ్రెస్ వంటి మహాసంస్థనూ, అందులోని విభిన్న మనస్తత్వాలు కలిగిన సీనియర్ నాయకులనూ, బహునాయకత్వం అనే జాడ్యాన్నీ ఎదుర్కొని నిలదొక్కుకోవాలంటే ఇటువంటి వైఖరే సరిపోతుంది. అహంకార పూరితంగా, పాత రేవంత్ రెడ్డి శైలిలో వ్యవహరిస్తే పొసగదు. పార్టీ నాయకుల మధ్య సమైక్యత సాధించి పార్టీని ఏకతాటిపైన నడిపించడం అసాధ్యం. పీసీసీ అధ్యక్షుడిగా తన పేరు ప్రకటించిన తర్వాత ఇంతవరకూ రేవంత్ వ్యవహరించిన తీరు సవ్యంగా ఉంది. సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్ళి వారి ఆసీస్సులు కోరారు. తన పేరును తీవ్రంగా వ్యతిరేకించిన హనుమంతరావు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే ఆస్పత్రికి వెళ్ళి ఆయనను పలకరించి సుముఖులను చేసుకొని వచ్చారు. ఎంతోకొంత పలుకబడి కలిగిన నాయకులందరినీ భేషజం లేకుండా కలిసి సుముఖులను చేసుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
కొందరి విషయంలో ప్రయత్నించినా లాభం లేదు. ఉదాహరణకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. భువనగిరి ఎంపి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంతో తో పీసీసీ పదవికోసం దిల్లీలో మకాం పెట్టి పోటీపడ్డారు. చివరికి పదవి రేవంత్ ని వరించిన తర్వాత ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడు మణిక్కం టాగూర్ కి పాతిక కోట్ల రూపాయలు చెల్లించి పదవి సంపాదించుకున్నారంటూ ఆరోపణ చేశారు. అంత దూరం వెళ్ళిన నాయకుడిని సమాధానపరచడం ప్రస్తుతానికి సాధ్యం కాదని వదిలేసి ఉంటారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ నిన్న గాంధీభవన్ లో కనిపించలేదు. గాంధీభవన్ గుమ్మం తొక్కనంటూ వెంకటరెడ్డి చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా ఆయన దూరంగానే ఉన్నారు. మరో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పేరు కూడా పీసీసీ అధ్యక్షపదవికి పరిశీలిస్తున్న పేర్లలో ఉంది. ఆయన కూడా బుధవారంనాడు గాంధీభవన్ కు రాలేదు. అయితే, ఆయన తన శుభాకాంక్షలను రేవంత్ కు పంపినట్టు సమాచారం. జీవన్ రెడ్డి ఎవరి అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించలేదు. దిల్లీ వెళ్ళి పైరవీ చేయలేదు. పదవి పట్ల అంత ఆసక్తి సైతం చూపలేదు.