Sunday, December 22, 2024

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి శరసంధానం

  • ప్రశ్నల పరంపర, విమర్శల జడివాన
  • కాంగ్రెస్ నేతల విగ్రహాలకు గులాబీ జండాలు  కట్టడంపై ధ్వజం

హైదరాబాద్ : టీఆరెఎస్ పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారనీ, జలదృశ్యం నుండి జనదృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారనీ, ఉద్యమం ముసుగులో శవాల మీద గులాబీ పార్టీని విస్తరించారనీ,  హైదరాబాద్ లో ఎక్కడ చూసిన టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయనీ సోమవారం నాడు  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో మీడియా సమావేశంలో విమర్శించారు. సామాన్య ప్రజలు నగరంలో టు లెట్ బోర్డ్ పెడితే.. 2వేల జరిమానా వేసింది జీహెచ్ ఎంసీ. అటువంటిది  కాంగ్రెస్ నేత విగ్రహాల కు సైతం టీఆరెఎస్ జెండాలు కట్టారనీ,  సిగ్గు లేకుండా కండ్లు మూసుకుపోయి కట్టారనీ,  తెలంగాణ అమర వీరులకు కూడా స్మరించుకోలేదనీ రేవంత్ రెడ్డి నిశితంగా విమర్శించారు.

తెలంగాణ తల్లి స్థానంలో తెలుగుతల్లి

జల దృశ్యంలో మెదలైన టీఆరెఎస్ ప్రస్థానం.. అవినీతి దృశ్యం గా దోపిడీ దృశ్యంగా మారింది.నడి మంత్రపు సిరి వేస్తే.. ఎట్లా వ్యవహరిస్తారో.. అట్లా చేస్తున్నారు టీఆరెఎస్ నేతలు. తెలుగు తల్లి.. ఎవరికి తల్లిరా అన్న కేసీఆర్.. ఇవ్వాళ టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా..తెలుగు తల్లిని పెట్టిండ్రు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే.. వేదికపై తెలుగు తల్లి ని పెట్టారు’’ అంటూ దుయ్యపట్టారు.

‘‘మొదటి నుండి టీఆరెఎస్ లో వున్న వాళ్ళు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకున్నవా..2001 జల దృశ్యంలో మొదలైన టీఆరెఎస్ పార్టీ.. ఇప్పుడు వేల కోట్లకు ఎగపాకింది. కొండా లక్ష్మణ బాపు, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్ సార్, కేశవ రావు, గుడ అంజయ్య, సాంబ శివుడు, రహ్మాన్, ఇలా చాలా మంది.. చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారు. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామ రావు, ఆలే నరేంద్ర, విజయ శాంతి.. ఎవర్ని గుర్తు చేసుకోలే. ఈటెల పార్టీ నుండి బయటకి పంపిండు.. హరీష్ రావును హుజురాబాద్ లో చెట్టుకు కట్టిండు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మ్మలే ప్లీనరీ లో పెట్టుకున్నారు’’         అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఏడున్నర ఏళ్ల పాలన పై చర్చకు సిద్ధమా..?

‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడ్తున్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా.. దానిపై చర్చకు సిద్దమా. ఓయూ కు ఎంత నిధులు కేటాయించారో చర్చించుకుందాం రా.. యువత ను ఉద్యోగాలు ఇవ్వక పోవడం తో.. ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో..లక్ష 7వేల ఖాళీ లున్నయని నువ్వే చెప్పావ్ కేసీఆర్. మొన్న బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ లున్నాయి అని చెప్పింది. సింగరేణి, విద్యుత్, ఆర్టీసి, నిరుద్యోగుల సమస్యలపై చర్చిద్దమా?

ఆస్తుల లెక్కలు చెప్పండి

‘‘కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంత కలిసి పోరాటం చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించడం లేదు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ , కేసీఆర్ పై పెట్టిన కేసులు తొలగించుకున్నారు. అమర వీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు కేసీఆర్. తొలి, మలి దశలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎందుకు న్యాయం చెయడం లేదు. 1500 కుటుంబాలను ఆదుకుంటామని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఎక్కడికి పోయావు. గుర్తించిన 500 కుటుంబాలకు కూడా సరైన న్యాయం చెయ్యలే. కొందరు అడ్రస్ లేదని రసిండ్రు. ఎంత అన్యాయం.. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదు. వరి ఎస్తే.. ఊరే అనడంతో చాలా మంది రైతులు చనిపోయారు. తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యాలు పెరిగిపోతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కేంద్ర, రాష్ట్ర సర్కార్ ల విధానాలతో 40 వేల మంది రైతులు చనిపోయారు. పార్టీ కార్యాలయాల పేరుతో.. కేసీఆర్.. 1000 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 420 కోట్లు వున్నాయి అంటే.. ఇవి ఎట్లా వచ్చాయి. ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండే ఈ డబ్బు వచ్చింది. ఈ 420 కొట్లపై శ్వేత పత్రం విడుదల చేయాలి. అవినీతికి పాల్పడితే.. కొడుకైన బిడ్డైన కటకటాలు లెక్కించాలి అన్నావ్.. మరి ఈ 420 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ట్రాన్స్ కో, జన్ కోపై స్వేతపత్రం  

‘‘నిజాం నవాబులను తలతాన్నెల కేసీఆర్ వారసులు తయారయ్యారు. నిజాం నవాబు కంటే ఎక్కువ ఆస్తులు.. కేసీఅర్ కుటుంబానికి వచ్చాయి. ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించడం తోపాటు.. కేసీఆర్ ధనవంతుని కుటుంబం గా మారింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కోసం.. వేలకోట్లు అప్పులు చేసిండ్రు. దేవుల పల్లి ప్రభాకర్ అప్పులు చేయడంలో ముందుండు. కొన్ని రోజులుగా.. జెన్ కో అండ్  ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కనిపించడం లేదు..ట్రాన్స్ కో, జన్ కో ఆర్ధిక పరిస్థితుల పై శ్వేత పత్రం విడుదల చేయాలి. ప్రభాకర్ రావు సంస్థలను నడపలెం.. అని రిపోర్ట్ ఇస్తే కేసీఆర్ దాన్ని చెత్త బుట్టలో వేశారు.

సింగరేణి శ్రీధర్ కు జెన్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు ఛార్జి ఇచ్చింది సర్కార్. ప్రభాకర్ రావు.. సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఎవరైన ఆఫీస్ కు రాకుండా వుంటారా’’ అంటూ ప్రశ్నించారు.

టీఆరెఎస్ బైలాస్ మార్చారు అంటే కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖ చిత్రం తెలుస్తుందంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles