Sunday, December 22, 2024

రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎటైనా కావచ్చు

ఇరవై వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫలితాలు ఎవరికైనా అనుకూలంగా ఉండవచ్చునని కర్ణాటక ఎన్నికల తర్వాత అందరికీ తెలిసివచ్చింది. అధికార పార్టీ మరల ఎన్నిక కావడం అన్నది ఖాయమని చెప్పజాలం. దీన్ని ధ్రువీకరించే పరిణామం ఒకటి సంభవించింది. అదే సీఎస్ డీఎస్ సర్వే. భారత గణతంత్ర విలువలలో విశ్వాసం ఉన్నవారందరికీ ఇది శుభవార్త. అదే సమయంలో ఇది (బీజేపీని ఓడించడం) అంత తేలిక పని మాత్రం కాదు. గణతంత్రాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేసేవాళ్ళు సవ్యంగా, సమష్టిగా, వ్యూహత్మకంగా వ్యవహరిస్తే కానీ ఇది సాధ్యం కాదు.

మౌలికమైన నిర్ణాయకాంశాలు

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మౌలికమైన నిర్ణాయకాంశాలు ఏమిటో చెప్పడం కష్టం కాదు. బీజేపీ స్వాట్ విశ్లేషణ (స్ట్రెంత్, వీక్ నెస్, ఆపర్ట్యునిటీ, త్రెట్)లో ప్రధాని నరేంద్రమోదీనే ప్రధానం. బలం (స్ట్రెంత్): మోదీ జనాకర్షణ శక్తి (కరిష్మా). బలహీనత (వీక్ నెస్): మోదీ ప్రభుత్వం పనితీరు. అవకాశాలు(ఆపర్ట్యునిటీస్): మోదీ చివరి క్షణంలో చేసే మాయాజాలం. ప్రమాదం(త్రెట్): మోదీ ప్రతిష్ఠ అమాంతంగా పడిపోవడం. భారత దేశ నిర్మాణంలో, సామాజిక వ్యవస్థలోనే ప్రతిపక్షాల బలం ఇమిడి ఉంది. చరిత్ర, దుర్బల మానసిక స్థితి ప్రతిపక్షం బలహీనత. దేశ ఆర్థిక స్థితి ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని విమర్శించి పైచేయి సాధించే అవకాశం ఇస్తున్నది. ఏకీభావం లేని ప్రతిపక్ష రాజకీయాల తీరుతెన్నులే వాటికి పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం.

Also read: చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

ఈ విశాల ప్రాతిపదికను అర్థం చేసుకోవడానికి తాజాగా సీఎస్ డీఎస్ లో లోక్ నీతి బృందం జాతీయ స్థాయిలో జరిపిన అభిప్రాయ సేకరణ (సర్వే) ఫలితాలు ఉపయోగపడతాయి. సర్వే ఫలితాలను రెండు విడతలుగా ‘ఎన్ డీటీవీ’ ప్రసారం చేసింది. ‘ది ప్రింట్’ లో ఈ ఫలితాలపైన రెండు వ్యాసాలు ప్రచురించారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే నేను ఆధారపడే కొలమానం ఇప్పటికీ లోక్ నీతి సర్వేనే. ఇందుకు ఆ సంస్థతో గతంలో నాకు అనుబంధం ఉన్నదనే కారణం కానే కాదు. రాష్ట్రాలవారీగా ఎన్నిఓట్లు వస్తాయో, ఎన్నిసీట్లు వస్తాయో చెప్పడానికి సరిపడా శాంపిల్స్ లేవు. కేవలం 7,000 శాంపిల్సే తీసుకున్నారు. ఈ సంస్థ తెలివిగా ఆ పని (రాష్ట్రాలవారీగా ఓట్లు, సీట్లు ఎన్నివస్తాయో లెక్కలు వేయడం) మాత్ర చేయలేదు. ఓటర్ల జాబితా నుంచి లెక్కప్రకారం అక్కడక్కడా పేర్లు ఎంపిక చేసుకొని, వారిని పద్ధతి ప్రకారం  ప్రశ్నించడం ద్వారా సర్వే జరుపుతారు కనుక ఫలితాలు భారత ఓటర్ల వాణిని వినిపిస్తున్నాయని నమ్మకం కలుగుతుంది. పైగా స్థిరీకరించిన ప్రశ్నలు సంధించే ప్రక్రియను లోక్ నీతి అనుసరిస్తుంది కనుక ఫలితాలను గత ఫలితాలతో పోల్చవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా వారి రిపోర్టింగ్ విధానంలో పారదర్శకత ఉంటుంది. వారు సర్వే ఏ పద్ధితిలో చేశారో వివరిస్తారు. గతంలో జరిపిన సర్వే ఫలితాలను కూడా నివేదిస్తారు.

ఈ సర్వే ఫలితాలలో పతాక శీర్షికలో ఉండవలసింది కాంగ్రెస్ ఓట్ల శాతం జాతీయ స్థాయిలో పది పాయింట్లు పెరిగిందన్నది. అందుకే ప్రారంభంలోనే 2024 ఎన్నికలలో ఫలితాలు ఎవరినైనా వరించవచ్చునని అనుకున్నాం. ఈ సర్వే ప్రకారం గత ఏప్రిల్ లో కనుక ఎన్నికలు జరిగి ఉంటే కాంగ్రెస్ కు 29 శాతం ఓట్లు వచ్చేవి. అంటే 2019లో సంపాదించిన 19.5 శాతం కంటే 9.5 శాతం ఎక్కువ. అది చాలా పెద్ద మార్పు (సుమారు ఏడు కోట్ల ఓట్లు అదనంగా వస్తున్నట్టు లెక్క). 2014లో కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉన్నదో ఆ స్థాయిలో నిలబెట్టడానికి ఇవి సరిపోతాయి. కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏమంటే బీజేపీకి ఓట్ల శాతం తగ్గడం లేదు. బీజేపీ ఓట్ల శాతం 2019లో 37.5 అయితే ఈ సర్వే ప్రకారం 2024లో  39 శాతానికి పెరుగవచ్చు.

ప్రాంతీయ పార్టీల గుబులు

ఇతర పార్టీల, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ ఓట్లు లాక్కుంటుందని లోక్ నీతి బృందం వివరిస్తున్నది. ప్రాంతాలవారీగా, సామాజికవర్గాలవారీగా ఓట్లు ఎట్లా చీలుతాయనే వివరాలు లోక్ నీతి సంస్థ వెల్లడించలేదు. కాంగ్రెస్ ఓట్లలో ఈ పెరుగుదలకు కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎన్ సీపీ, జేడీయూ, ఆర్జేడీల నుంచి వచ్చిన ఓట్లు కారణమై ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ కు మిత్రపక్షాలు అవుతాయనుకునే ఎస్ పీ, టీఎంసీల నుంచి రావాలి. అటు బీజేపీ వైపు కాకుండా ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండే బీజేడీ, టీఆర్ఎస్, ఆప్ ల నుంచైనా ఓట్లు రావాలి. దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. మిత్రపక్షంగా ఉండాలనుకునే పక్షాలతో కాంగ్రెస్ కు వైరం వచ్చే ప్రమాదం ఉంది. సామాజికవర్గాలపరంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ కు పెరిగే ఓటు ముస్లింల నుంచీ, ఇతర చిన్నాచితకా సామాజికవర్గాల నుంచీ, పేదవర్గాల నుంచీ రావచ్చు.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

ఓట్లు పెరగడం అంటే సీట్లు కూడా పెరుగుతాయా అన్న విషయం లెక్క వేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఈ సర్వేలో కూటముల ప్రకారం ప్రస్తుత ఎన్ డీఏకీ లేదా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. సంకీర్ణాల విషయంలో ఎన్ డీఏ నీరుగారిన తర్వాత ఎన్ డీఏ పక్షాన కొత్తగా వచ్చి చేరే మిత్రపక్షం లేదు. పాత మిత్రపక్షాల నుంచి వచ్చిన ఓట్ల కారణంగానే బీజేపీ ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చు. ఈ ఓట్ల వల్ల కాంగ్రెస్ కి పెద్దగా మేలు జరగకపోవచ్చును కానీ బీజేపీని మాత్రం ప్రమాదపుటంచులలోకి నెట్టవచ్చు.

బీజేపీ బలం, బలహీనత మోదీ

ఈ దశలో ప్రతి పార్టీకీ గుబులు పుట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్ల వాటా అకస్మాత్తుగా గణనీయంగా పెరగడం వల్ల బీజేపీ కంగారు పడవచ్చు. బీజేపీకి ఓట్లేమీ తగ్గడం లేదు కనుక కాంగ్రెస్ బెంగపడుతుంది. తమ ఓట్లను రెండు జాతీయ పార్టీలూ లాక్కుంటాయని ప్రాంతీయపార్టీలు దిగులు పడవచ్చు. ఈ కంగారులోనుంచి పుట్టిన శక్తి – అది సకారాత్మకం కావచ్చు(పాజిటీవ్ ఎనర్జీ), నకారాత్మకం (నెగెటీవ్ ఎనర్జీ) కావచ్చు- వచ్చే సార్వత్రిక ఎన్నికల వైపునకు మనలను నడిపిస్తాయి.

ఏ అంశం పని చేస్తుందో ఏది చేయదో  ఈ సర్వే సూచిస్తుంది. ధనం, మీడియాపై నియంత్రణ, సంస్థాగత బలం ఉండటం బీజేపీ బలానికి దోహదం చేస్తాయి. ఇవి గాక బీజేపీ అసలైన బలం మోదీ ప్రతిష్ఠ. చాలా జాగ్రత్తగా ప్రచారం చేసుకొని నిర్మించుకున్న ప్రాబల్యం. పోటీదారులకంటే చాలా ఎత్తులో మోదీ ఉన్నట్టు సర్వే తేటతెల్లం చేసింది. భారత్ జోడో యాత్ర ఫలితంగా రాహుల్ ప్రాబల్యం, ఆయన పట్ల సానుకూలత బాగా పెరిగినప్పటికీ ప్రధాన ప్రత్యర్థికీ, తనకూ మధ్య దూరం అంతగా తగ్గలేదు. తాను అంతర్జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకోవడంలో ప్రధానమంత్రి వేస్తున్న ఎత్తుగడలకు తోడు భారత మీడియా సంస్థలు సవిధేయంగా ప్రాచుర్యం ఇవ్వడంతో ఆయన తన ప్రతిష్ఠ పెంచుకోవడానికి వీలయింది. ప్రపంచంలో భాతర స్థాయిని పెంచివేసినబ సర్వోన్నత అంతర్జాతీయ నాయకుడుగా  ప్రచారం చేసుకోవడంలో విజయం సాధించారు. ఇది సగటు భారతీయులకు విపరీతంగా నచ్చే అంశం.

Also read: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ దృష్టి పెట్టాలో కర్ణాటక ఎన్నికలు చెప్పాయి

బీజేపీ బలహీనత కూడా మోదీయే కావడం విశేషం. ప్రధానంగా ఆయన పరిపాలనా శైలి. తీవ్రంగా దిగ్భ్రాంతి కలిగించే అసమర్థత (స్టాగరింగ్ ఇంకాపిటెన్స్) గా ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. ఆయన పరిపాలనలో, ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఆయన వైఫల్యాలను ప్రజల దృష్టికి రాకుండా దాచడం కష్టసాధ్యంగా మారుతోంది. మిత్రపక్షాలను కాజేయడం లేదా విసర్జించడంలో మోదీ-షా ద్వయం ప్రదర్శిస్తున్న నీతి వల్ల మిత్రపక్షాలు లేకుండా బీజేపీ ఒంటరిగా నిలబడవలసి వస్తున్నది. జేడీయూ, అకాలీదళ్ ఎన్ డీఏ ని వీడి వెళ్ళాయి. ఎన్ డీఏలో ఉన్న షిండే వర్గం బలం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన బలంలో సగం కూడా లేదు (ఈ విషయం మరాఠీ పత్రిక సకాల్ జరిపిన సర్వేలో వెల్లడయింది). కనుక లోక్ సభలో మెజారిటీకి అవసరమైన 272స్థానాలు గెలుచుకోవలసిన బాధ్యత కేవలం బీజేపీదే. అది అంత తేలిక కాబోదు.

బీజేపీ భవితవ్యం నరేంద్రమోదీపైన ఆధారపడి ఉన్నది. ఆయన అతిజాగ్రత్తగా నిర్మించుకున్న పేరుప్రతిష్ఠలు అకస్మాత్తుగా కుప్పకూలవచ్చు. మోదీ-అడానీ బంధం ఎన్నికలపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో సర్వే ఏమీ చెప్పలేదు – అది నిషిద్ధం కనుక చెప్పలేదని అనుకోనక్కరలేదు. కానీ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన అరోపణల కన్నా బలమైనవి మోదీ-అదానీ బంధానికి సంబంధించిన ఆరోపణలు. ‘మోదానీ’ ప్రచారాన్ని ప్రతిపక్షం నిరంతరం కొనసాగించే పక్షంలో 2024 ఎన్నికలలో ఇది (ఈ నినాదం) నిర్ణయాత్మకమైన పాత్ర పోషించవచ్చు.

ప్రతిపక్షాల బలం ఏమిటి?

భౌగోళిక భారతంలోనే ప్రతిపక్షాల బలం ఉన్నది. వివిధ రాష్ట్రాలలో బీజేపీని వివిధ రాజకీయ పక్షాలు ఎదిరిస్తాయి. సామాజిక, ఆర్థిక పిరమిడ్ లలో కులాలు, వర్గాలవారీగా జనాలను ప్రాంతీయ పార్టీలు ఆకర్షిస్తాయి. అది వాటి బలం. స్పష్టమైన సందేశం లేకపోవడం, ఆ సందేశం ఇచ్చే బలమైన నాయకుడు లేకపోవడం ప్రతిపక్షాల బలహీనత. ఎన్నికల ముందే కూటమిగా ఏర్పడటంతో పాటు రాజకీయ భావస్వామ్యం, సమైక్య కార్యచరణ ప్రతిపక్షాలకు ముఖ్యం. ఈ బలహీనత బీజేపీ ప్రచారాన్ని కొనసాగించేందుకు తోడ్పడుతుంది. సందేశం వినిపించే విషయంలో నరేంద్రమోదీకి ప్రధాన ప్రత్యర్థిగా రాహుల్ గాంధీని సర్వే నిలబెట్టింది. ప్రధాని పదవి ఆశిస్తున్న ఇతర ప్రతిపక్ష నాయకులకన్నా రాహుల్ చాలా ముందున్నారు. 2014లో ఉన్న పాపులారిటీ రేటింగ్ కంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు రెట్టింపు ఉన్నది. అయినా ఆఖరిపోరాటానికి రంగంలో దిగేందుకు సరిపడే రేటింగ్ లేదు.

Also read: కర్ణాటక ఎన్నికలలో 4 నిర్ణాయక అంశాలు

ఈ సర్వేలో తేలిన అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన అంశం ఏమంటే ప్రతిపక్షం ఆర్థికరంగంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవలసి ఉంటుంది. ప్రజలకు బాధ కలిగించే అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య, దారిద్ర్యం, ఆకాశాన్నంటే ధరలు. గత నాలుగు సంవత్సరాలలో తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఈ సర్వేలో ప్రజలు వాపోయారు. ఆర్థిక రంగంలో మోదీ ప్రభుత్వ నిర్వహణ పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. ఆర్థిక రంగంలో విశ్వసనీయమైన, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో ప్రజల ముందుకు రావడం ఎలా అన్నది ప్రతిపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ ఎదుట ఉన్న సవాలు.

ఒక విధంగా చెప్పాలంటే గత సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది ముందు 2018లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా కానవస్తున్నాయి. అప్పుడు కూడా మోదీ ప్రభుత్వ ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆ క్రమంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది. బీజేపీకి వంద లోక్ సభ స్థానాల నష్టం సంభవించవచ్చునని అప్పుడు అంచనాలు వినిపించాయి. అంతలోనే పుల్వామా-బాలాకోట్ సైనిక చర్యలు సంభవించాయి. ప్రజలలో దేశభక్తి తాలూకు భావోద్వేగం పెరిగింది. దాంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. సీఎస్ డీఎస్ ఇప్పుడు నిర్వహించిన సర్వే ఫలితాలు 2018లో వెల్లడించిన సర్వే ఫలితాలను పోలి ఉన్నాయి. ఈ సారి అదనపు అనుకూలాంశం ప్రతిపక్షాలలో కొత్త జోష్ నింపిన రాహుల్ భారత్ జోడో యాత్ర.

ప్రజలలో ఇప్పుడు కనిపిస్తున్న అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారుతుందా? 2019లో జరిగినట్టు కథ అకస్మాత్తుగా మరో మలుపు తిరుగుతుందా? ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా ఆవేశాన్ని నింపగల ఘటన ఏమై ఉండవచ్చునంటూ వ్యక్తిగత సంభాషణలలో ప్రజలు అడుగుతున్నారు.  ప్రతాప్ భాను మెహతా తన ఇండియన్ ఎక్స్ ప్రెస్ కాలంలో అడిగిన ప్రశ్న కీలకమైనది. ఆ ప్రశ్న: ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోవడం బీజేపీ సహించగలదా?

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు  

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles