- అనకాపల్లి జిల్లాలోని PVTG ఆదివాసీలకు PM PVTG డెవలప్మెంట్ మిషన్ ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి
- నెలలో ఒకరోజు ఆదివాసీలకు సమస్యలపై ప్రత్యేక స్పందన నిర్వహించాలి
- అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, జాతీయ కార్యదర్శి, P.S. అజయ్ కుమార్ డిమాండ్
ఈ రోజు, 28 సెప్టెంబర్ 2023, లక్ష్మీవారం, అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, పాత మల్లంపేట పంచాయితీ, ఎన్. గదబపాలం గ్రామంలో జరిగిన సభలో అజయ్ కుమార్, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాత మల్లంపేట గ్రామపంచాయతీ పరిధిలో 833 ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్లు ఉండగా, 484 జాబ్ కార్డులు డిలీట్ అయినాయని, అందులో అత్యధిక శాతం ఆదివాసి కుటుంబాలకు చెందిన జాబు కార్డులు ఉన్నాయని ఆయన అన్నారు. తొలగించబడిన కార్డుల వివరాలను పరిశీలిస్తే, “ఉపాధి పనిలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు” (not willing to work) అని నమోదు చేశారనీ, ఇది చట్ట విరుద్దమనీ ఆయన అన్నారు.
అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 7 మండలాలలో జీవిస్తున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి జిల్లాలో భూ మాఫియా రెవిన్యూ అధికారుల సహాయంతో అనేక కుట్రలు పన్నుతుoన్నదని ఆయన అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టాని(ROR)కి విరుద్ధంగా మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది భూ మాఫియా తో చేతులు కలిపి క్షణాలలో రికార్డులు మార్చేస్తున్నారనీ, రికార్డులు తమ పేరును మార్చుకున్న తర్వాత భూ మాఫియా ఆదివాసీలపై దాడులకు దిగుతుందనీ అజయ్ కుమార్ అన్నారు.
రోలుగుంట మండలం, చటర్జీ పురం గ్రామంలో ఆదివాసీల పేర్లు రికార్డులో నమోదై ఉండగా గత ఏడాది నవంబర్ 22వ తేదీన అప్పటి తాసిల్దార్ కే. వెంకటేశ్వర్రావు ఏకపక్షంగా వారి పేర్లను రికార్డు నుంచి తొలగించాడని అప్పటినుండి ఆదివాసీలపై దాడులు మొదలయ్యాయని ఆయన అన్నారు.
చీడికాడ మండలం కొనాo రెవిన్యూలో, గత ఏడాది జూన్ 13వ తేదీన ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న 70 ఎకరాల భూమినీ నిబంధనలకు విరుద్ధంగా రికార్డు మార్చేసారని అజయ్ కుమార్ అన్నారు. గొలుగొండ మండలం, పాత మల్లంపేట గ్రామం సర్వేనెంబర్ 850 లోని 37 ఎకరాల భూమిని 5 దశాబ్దాలుగా గదబపాలెo ఆదివాసీలు సాగు చేస్తుండగా, అప్పడు గోలుగొండకు తాసిల్దార్ గా పని చేసిన కే. వెంకటేశ్వర్రావు, అమెరికాకి చెందిన NRI వక్కలంక సుధాకర్ పేరున రికార్డు మార్చడానికి ప్రయత్నం చేశాడని జిల్లాలో జరుగుతున్న భూ మాఫియా ఆగడాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని అజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ, చట్టాలు ఇచ్చిన భరోసా అందుబాటులో లేవని, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విభజన జరిగి అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఈ జిల్లాలో ఉన్న ఆదివాసీలు పాడేరు ఐటిడిఏ సేవలకు బయట వదిలివేయబడ్డారని అన్నారు. దీనిపై ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం లేదని అన్నారు.
పాతమల్లంపేట శివారు గ్రామాలైన N. గదబపాలెం, M. గదబపాలెం గ్రామాల ఆదిమ తెగల ఆదివాసీలందరికీ చట్టం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు (AAY ) ఇవ్వాలని, నిమ్మగడ్డ గ్రామంలో సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు డిఫారం పట్టాలు ఇవ్వాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో అఖిల భారతి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం గొలుగొండ మండలం శాఖ నాయకులు గొర సూరిబాబు, దుంప ప్రసాద్, కవల చెంచయ్య పాల్గోన్నారు.