‘బాపూ, మిమ్మల్ని నిరుపేదగా ఉంచడానికి చాలా ఖర్చు అవుతోంది,’ అంటూ మహాత్మాగాంధీతో చమత్కరించిన మహిళ సరోజినీ నాయుడు. ఆమెకు ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అని పేరు కూడా ఉంది. గాంధీ, నెహ్రూల సరసన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహిళ. ఆంగ్లభాషలో మంచి వక్త, అద్భుతమైన కవి, రచయిత్రి. తన 13వ ఏటనే ‘లేడీ ఆఫ్ లేక్’ అనే శీర్షికతో పదమూడు వందల లైన్ల రచన చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన నాయకురాలు. ఆమె హైదరాబాద్ లో 13 ఫిబ్రవరి 1879లో జన్మించారు.
సరోజినీదేవి తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపల్ గా పని చేశారు. తల్లిపేరు వరదసుందరీదేవి. సరోజినీదేవి చదువులో ప్రథమశ్రేణిలో ఉండేవారు. ఏకసంతాగ్రాహిగా పేరు తెచ్చుకున్నారు. లండన్ లోని కింగ్స్ కాలేజీలో, కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని గిర్టన్ కాలేజీలో విద్యనభ్యసించారు.
Also Read : సరళ స్వభావుడు… సుమధుర గాత్రుడు
హైదరాబాద్ కే చెందిన డాక్టర్ ముత్యాల గోవిందరాజులును బ్రహ్మసమాజం సంప్రదాయం ప్రకారం ప్రముఖ సంఘసంస్కర్త వీరేశలింగం ఆధ్వర్యంలో చెన్నైలో వివాహం చేసుకున్నారు. 1925లో కాన్పూర్ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత భారత దేశపు తొలి మహిళా గవర్నర్ గా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పని చేశారు. 15 ఆగస్టు 1948 నుంచి 02 మార్చి 1949 వరకూ, ఈ లోకాన్ని వీడి వెళ్ళేవరకూ గవర్నర్ గా పని చేశారు.
బర్డ్ ఆఫ్ టైం, ది గోల్డ్ న్ త్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్, ద సీక్రెట్ ప్లూట్, ద ఫెదర్ ఆఫ్ డాన్ అనే కవితా సంపుటాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ లోని నింబోలి అడ్డలో ఆమె నివాసానికి గోల్డ్ న్ త్రెషోల్డ్ అని పేరుపెట్టారు. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఉంది. సరోజినీ నాయుడికీ, గోవిందరాజులు నాయుడికీ ఐదుగురు సంతానం. కుమారుడు జయసూర్య హైదరాబాద్ లో నివసించేవారు. ఆయన రాజకీయాలలో రాణించారు. ఆమె కుమార్తె పద్మజానాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు.
Also Read : అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి