Thursday, December 26, 2024

భగవంతుడుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి – భగత్‌ సింగ్‌

ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఒక సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, భగవంతుడు వున్నాడని మీరు నమ్ముతున్నారు. అలా అయితే దానిని ఆయన ఎందుకు సృష్టించాడో చెప్పగలరా? ఈ ప్రపంచంలో ప్రజలు పేదరికంతో, రకరకాల కష్టాలతో, బాధలతో అనేక అత్యాచారాలకు గురవుతూ జీవించుతున్నారు. ఎవ్వరూ తృప్తిగా జీవించడం లేదు.

దయచేసి ఆయనకున్న శాసనాలకు లోబడి చేస్తున్నాడని అనబోకండి. ఆయనే గనుక కొన్ని శాసనాలకు కట్టుబడి వుండవలసినవాడైతే ఆయన కూడా ఒదిగిఒదిగి వుండవలసిన బానిస మాత్రమే కాగలడు. ఇలా జనాన్ని బాధపెట్టడం ఆయనకు సరదా అని అనబోకండి. నీరోచక్రవర్తి రోమ్‌ నగరాన్ని తగులబెట్టించాడు. నీరో పరిమిత సంఖ్యలోనే ప్రజలను హతమార్చాడు. అనేక విషాదాలను తన చిద్విలాసం కోసమే ఆయన జరిపించాడు. మరి అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్రలో ఏమిటి? చరిత్రకారులు ఆయనను ఏ పేరుతో పిలుస్తారు? నీరో చక్రవర్తిని ఎన్నిరకాల విషభరితమైన, అపభ్రంశమైన పేర్లను పెట్టి పిలవాలో అన్నీ పెట్టి మరీ పిలుస్తారు. నీరో చక్రవర్తి పరమ నిరంకుశుడు, హృదయం లేని పరమ క్రూరుడు అని చరిత్ర పుటలన్నింటా వర్ణించబడ్డాడు.

Also Read : సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ల విస్తరణ

ఇక చెంఘిజ్‌ఖాన్‌ తన క్రూరమైన సంతోషం కోసం వేలమందిని హతమార్చాడు. చెంఘిజ్‌ఖాన్‌ పేరు చెబితేనే మనకు వళ్లు మండుతుంది. అత్యంత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రపంచంలోని అశేష ప్రజల జీవితాలనే దు:ఖభాజనం చేసే దేవుణ్ణి, ప్రతిరోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టాలతో, విషాదాలతో వారి జీవితాలను అధోగతి పాల్జేసే దేవుణ్ని, ఈనాటికీ వారిని కష్ట సముద్రాల్లో నిత్యమూ ముంచుతున్న దేవుణ్ణి మనం ఏమనాలి? చెంఘిజ్‌ఖాన్‌, నీరోచక్రవర్తి ఎప్పుడో ఒకసారి చేసిన దానికంటే దేవుడు ఈ ప్రపంచంలోని ప్రజలను నిత్యమూ కష్టాలకు, బాధలకు అత్యాచారాలకు గురి చేస్తున్నప్పుడు ఆయనను ఎలా పూజించాలి? ఎలా కొలవాలి? మీకు నా సూటి ప్రశ్న ఇది. ఇంచుమించు నరకప్రాయంగా వున్న ఈ ప్రపంచాన్ని ఆయన ఇలా ఎందుకు సృష్టించాలి? ఎల్లప్పుడూ మానవులకు ఆవేదనలనూ, అశాంతినీ కలుగజేసే విధంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలి. దేవుడు సర్వశక్తి సమన్వితుడు కదా? ఏదైనాసరే చేయడానికి లేదా చేయకుండా వుండటానికి ఆయనకు శక్తి వుంది కదా? అటువంటప్పుడు ఇన్ని దు:ఖాలు, బాధలుపడే మానవుల్ని ఆయన ఎందుకు సృష్టించాలి? ఆయన చేసిన పనిని మనం ఎలా సమర్థించగలం?

పూర్వం ఒక రకం మృత్యు క్రీడలు జరిపి ఆనందించేవారు వుండేవారట. (గ్లాడియేటరు సంస్థ నిర్వాహకులు వారు) ఆకలితో ఆరాటపడే సింహాలు, పులుల ముందు మనుషులను నెట్టేవారు. ఆ సింహాలకు, పులులకు ఆహారమై పోకుండా ఎవరైనా ఒక అభాగ్యుడు బయటపడితే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెడతాం. సర్వసౌఖ్యాలు, సంపదలు ఇచ్చి సత్కరిస్తాం అనేవారట. సరిగ్గా అలాగే ఉంది దేవుడి సంగతి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వచైతన్యమూర్తి అయిన భగవంతుడు ఈ దు:ఖమయ ప్రపంచాన్ని, అందులో అష్టకష్టాలు పడే మానవుడ్ని ఎందుకు సృష్టించాలి అని నేను అడుగుతున్నాను. ఇదంతా ఆయన ఆనందానికే అయితే, నీరోచక్రవర్తికి, భగవంతుడికి ఏమిటీ తేడా?

Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు

చెరసాలలో మగ్గేవాళ్లు, ఆకలి మంటలతో అలమటించేవాళ్లు లక్షలాది కోట్లాది ప్రజలు ఈ ప్రపంచంలో వున్నారు. దోపిడీ చేయబడుతున్న కష్టజీవులు, కార్మికులు, అభాగ్యుఉ, దీనులు, హీనులు వున్నారు. వీరంతా తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నారు. ఈ రక్తాన్ని పిండి పెట్టుబడిదారీ వర్గాలు రాబందులవలె, జలగలవలె వీరిని పీలుస్తూ సంపన్నులవుతున్నారు. లక్షలాదిమందిని నిరుద్యోగులుగా, నిరర్థకులుగా చేస్తున్నారు. అంతేకాదు, అవసరమైతే తమ లాభాల రక్షణ కోసం, అధికోత్పత్తి చేసి నిల్వపడి వున్న సరుకులను, ఆహారధాన్యాలను సముద్రం పాలు చేస్తున్నారు. (పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభం ఏర్పడినప్పుడు, ధరల మాంద్యం వచ్చినప్పుడు లక్షల కోట్ల టన్నుల పాల డబ్బాలను ఇతర ఆహార పదార్థాలను పెట్టుబడిదారీ వర్గాలు సముద్రం పాటు చేస్తాయి. అనువాదకుడు) ఆకలితో మలమలమాడే కోటాను కోట్ల ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను, పాలడబ్బాలను, బట్టలను తదితర జీవితావసర వస్తువులను పంచిపెట్టరు. తమ చెమటను, రక్తాన్ని ధారపోసి శ్రామిక ప్రజలు పంటలు పండిస్తారు. తమ ఎముకలను సున్నంగా చేసి మహాభవనాలను కార్మికులు నిర్మిస్తారు.

Also Read : 2035 నాటికి చైనా భూగర్భంలో రహస్య పట్టణాలు

వారందరూ దారిద్య్రంతో కడుపునిండా తిండిలేక, బట్టలేక, ఇల్లులేక ఎందుకు అలమటించాలి? దీనికి భగవంతుడు ఏమి సమాధానం చెపుతాడు? ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇలా ఒకవైపున జరుగుతూ వుంటే నా సృష్టి అంతా సవ్యంగా వున్నదని భగవంతుడు ఎలా అనగలడు? దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలడా? మౌనమే సమాధానమా?

(‘నేనెందుకు నాస్తికుడినయ్యాను’ అన్న భగత్‌సింగ్‌ పుస్తకం నుంచి… ఈనెల 23 న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా)

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles