Thursday, November 21, 2024

బాపు స్మరణీయం బహు రమణీయం

  • రమణలేని పురస్కారం ఎందుకు?
  • చిరంజీవికి ఫోన్ చేసి థాంక్స్

మా ఇద్దరి ఈ ఫోటో 2003 నాటిది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలుకుతున్ననాటి ముచ్చట ఇది. ‘శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము’ స్థాపించిన తొలినాళ్లలో, పీఠము లోగోను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పడం కోసం బాపు గారిని కలిశాను. కొంచెంసేపు కొప్పరపు కవులు,తిరుపతి వేంకటకవుల గురించి ముచ్చటించుకున్నాము. ఎవరి రూపురేఖలు ఎలా ఉన్నా బాపుగారి చేతిలో బొమ్మగా మారేసరికి కొత్త అందాలు సంతరించుకుంటాయి. కొప్పరపు కవులు సహజసిద్ధంగానే చాలా అందగాళ్ళు. బాపు గీతలలో వారు ఇంకా ప్రకాశమానం అయ్యారు. ఎల్లలోకమూ ఎలుగెత్తి చాటే  బాపుగారు  కళాపీఠము లోగో అందించేసరికి, నా సంకల్పానికి ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. లోగోను అందుకున్న తొలి క్షణాల్లో వారి చేతిలో రూపు దిద్దుకున్న కొప్పరపు కవుల బొమ్మలను పదే పదే చూసుకొని  పరవశించి పోయాను. ఇదే పీఠం  తొలి ప్రస్థానంలో ఎదురైన మలి మంచి శకునం. ఇది జరిగిన కొన్నాళ్ళకే, (అ)పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావుగారి చేతుల మీదుగా పీఠం ప్రచురించిన తొలి పుస్తకం ” శ్రీ కొప్పరపు కవుల కవిత్వము” ఆవిష్కరణ జరిగింది.ఇది పీఠం ప్రసారంలో మరో మేలురాయి, తొడుగు దాల్చుకున్న ఆశాకిరణం. 

బాపు, రమణ

బాపుగారు – పద్మశ్రీ

మళ్ళీ బాపుగారు, నేను 2014లో ఢిల్లీలో  కలిశాము. పద్మశ్రీ వచ్చిన సందర్బంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్ళాను. బాపుగారిని ఎయిర్ పోర్ట్ లో ఎదురేగి స్వాగతించి  తిరిగి చెన్నై వెళ్లేంతవరకూ వారితోనే ఉండమని  బాలుగారు ఆజ్ఞ వేశారు. నేను, కొప్పరపు కవుల పౌత్రుడు ప్రకాష్ (ప్రకాశం) మూడురోజులు బాపుగారితోనే గడిపాము. ‘‘నాకెందుకు ఈ పద్మశ్రీ పురస్కారాలు? ఆనందించడానికి రమణగారు లేరు కదా? ఎవరి కోసం?‘‘ అంటూ బాపుగారు మా దగ్గర మదనపడ్డారు. ఆ దృశ్యం చూసి మా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అవసరం ఉంటేనే   మనుషులు గుర్తుకు వచ్చి పనిఅయిపోగానే, వెంటనే వారిని మరచిపోయే కాలమిది… ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న స్నేహితుని తలచుకొని, తలచుకొని కుమిలిపోయిన బాపులాంటి వాళ్ళు ఎందరుంటారు? బాపు,రమణల స్నేహబంధానికి ఖరీదుగట్టే షరాబులేడోయ్… అనిపించింది. కొప్పరపు కవుల సోదరబంధం ఎంత గొప్పదో? వీరి ప్రేమ బంధం అంతే  గొప్పది. ఢిల్లీలో బాపుగారితో గడిపిన ఆ మూన్నాళ్ళు, చాన్నాళ్లు నన్ను వదలవు. కొంటె బొమ్మల బాపు, అంతకంటే  కొంటెగా ఎలా మాట్లాడుతారో అప్పుడు చూశాను.   ముభావంగా సీరియస్ గా కనిపించే బాపుగారిలో పొంగి పొరలిన సెటైర్లు నేరుగా చూసి, ఆశ్చర్యపోయాను. ఢిల్లీలో  హోటల్ రూమ్ లోకి చేరిన వెనువెంటనే,ఈ పద్మ  పురస్కారం రావడంలో ఎంతో కృషిచేసిన చిరంజీవిగారికి స్వయంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు బాపు. పద్మభూషణ్ పురస్కారం ఇవ్వాలని చిరంజీవిగారు నాలుగేళ్లపాటు కృషి చేసినట్లుగా బాపుగారు మాకు చెప్పారు. పద్మభూషణ్ కోసం చేస్తే చివరకు పద్మశ్రీ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీ,  తమిళనాడు కోటాలో… వారిలోని కృతజ్ఞతాభావం ఎంత గొప్పదో ఆనాడు తెలుసుకున్నాను. నిజంగా బాపు గారికి సత్కారాలు అంటే, పొగడ్తలంటే, జనమంటే యమభయం!! కోట్లాదిమంది హృదయపద్మశ్రీలు గెలుచుకున్న బాపు గారికి  ఈ పద్మములు ఏపాటి?  పాత నటుడు ముక్కామల గారి గురించి,ముసలోడు రసికుడే… అనే డైలాగులు గుర్తు చేశాను. బాపు పడి పడి ముసిముసిగా నవ్వుకున్నారు.

నాటి రాష్ట్రపతి ప్రణబ్ కుమర్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మపురస్కారం అందుకుంటున్న బాపు

అదిగో శ్రీదేవి!

మొదట్లో భయం భయంగా జోకులు  పంచుకున్నాను. వారి ప్రతిస్పందనలతో  పెంచుకుంటూ వెళ్ళాను. హాయిగా గడిపాము. డి.రామానాయుడుగారు మొదలైన ప్రముఖులు మేమున్న అశోకా హోటల్ కు వచ్చి,బాపుగారిని పలుకరించి వెళ్లారు.అప్పుడే రామానాయిడుగారికి కూడా ‘పద్మ’ పురస్కారం వచ్చింది.పద్మశ్రీ పురస్కారం పుచ్చుకొని,హోటల్ కు వస్తున్న బాపుగారిని మీడియావాళ్లు…ఏదైనా మాట్లాడండి అంటూ అడ్డుకున్నారు.అదుగో!!శ్రీదేవి… అని బాపుగారు అనేసరికి, మీడియామొత్తం శ్రీదేవి దగ్గరకు పరిగెత్తింది. ఠక్కున లిఫ్ట్ లోకి వచ్చాము. బాబూ! బతికిపోయాము ఈ మీడియావాళ్ళ నుండి అంటూ…. చిలిపిగా నగుమోముతో  నావైపు చూశారు బాపు గారు. ‘‘ఎంతటి గడసరివో తెలిసెరా’’ అనుకున్నాను..

Also read: గంధర్వులను మించిన ఘంటసాల

ఎయిర్ పోర్ట్ కు వెళ్లి, చెన్నైకి సాగనంపాము. మళ్ళీ మనం కలుస్తామో? లేదో సార్? అంటూ బాపు మాకు వీడ్కోలు పలికారు …  తరువాత నిజంగా కలవలేకపోయాము. ఈ పర్యటన జరిగిన కొన్నాళ్లకే బాపు మనందరినీ వదిలి, జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయారు. తెలుగు ఉన్నంతకాలం, బొమ్మలు ఉన్నంతకాలం,సినిమాలు ఉన్నంతకాలం,మనుషులు ఉన్నంతకాలం,మనసులు ఉన్నంతకాలం బాపు ఉంటారు,రమణ ఉంటారు.. మన హృదయాల సాక్షిగా,మన ఆనందాలు సాక్షిగా, మన ప్రేమలు సాక్షిగా,మన స్నేహాలు సాక్షిగా, మన కృతజ్ఞతలు సాక్షిగా….. శ్రీ బాపుపై భక్తితో, ప్రేమతో, కృతజ్ఞతతో-మాశర్మ( కోట్లమంది అభిమానులలో ఒకడిగా)

Also read: రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం

( డిసెంబర్ 15 బాపుగారి పుట్టినరోజు సందర్బంగా)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles