(రాసిన అక్షరాల తాలూకా ఆచరణలు)
ఒకనాడు నేనెంతో ఆవేశంతో రాసిన అక్షరాలు ఈ రోజు అపురూపంగా అనిపిస్తాయి. వ్యవస్థలో లోపాల్ని, అక్రమాల్ని, అన్యాయాల్ని చూడలేక, చూస్తూ మౌనంగా ఉండలేక సంవత్సరాల క్రితం యువ రక్తంతో, నూతనోత్తేజంతో చేసిన కలం యుద్ధాల కారణంగా ఎదురయిన ఎన్నో చేదు అనుభవాలు, అన్నే మధురానుభూతులు !
కులక్రౌర్యాన్ని, మతమాలిన్యాన్ని, లింగవివక్షని, ఇంకా సమాజంలో నెలకొన్న అన్ని రకాల అసమానతల్ని ఎండగడుతూ, విదిలించిన ఎన్నో కరపత్రాలు ప్రజానీకంలో నదిలా ప్రవహించి వెల్లువెత్తిన కాలాలు, వాటి వల్ల ఇంటా, బయటా చుట్టు ముట్టిన హెచ్చరికలు, బెదిరింపులు, శాపనార్ధాలు!
ప్రత్యామ్నాయ ఉద్యమ స్రవంతుల్ని పని కట్టుకుని అధ్యయనం చేసే పని గురించిన బీజం బహుశా అప్పుడే నా మనసులో పడుండాలి. ప్రజాతంత్ర క్షేత్రాలని అదేపనిగా వెతుక్కుంటూ తిరిగిన అనుభవాలు, అందుకే విశాలమైన ఒక తాత్విక భూమికని సారవంతం చేయడానికి నా అన్వేషణలో ఉపయోగపడుండాలి!
ఒక్కొక్క కరపత్రానిదీ ఒక్కో చరిత్ర. ఒక్కో చరిత్రకీ ఒక్కో కార్యాచరణ, ప్రతీ కార్యాచరణ ఒక సమిష్టి వ్యక్తీకరణ యొక్క అభివ్యక్తి. నాటి రూపం లోక కళ్యాణం. ఒక వికసిత వ్యవస్థ కోసం జరిగిన సంఘర్షణే వాటి సారం. ఎన్నడో పదిహేనేళ్ళ క్రితమే పెట్టిన “ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక – ప్రజ” నుండి, ‘అరాజకత్వ అధ్యయన కేంద్రం’ దాకా, ఎన్నో అడుగులు!
“కరపత్రాల కథా కమామీషు” లో పుస్తకరూపం ధరించినవే కాక ఇంకా లెక్కలేనన్ని తిరుగుళ్ళూ, సమయం, సందర్భం లేని సర్దుళ్ళ వల్ల, అస్థిర జీవితంలోని ఆటుపోట్ల అల్లకల్లోలంలో నేను కోల్పోయిన అక్షరాల జాడలెన్నో. ఎడతెరిపి లేని పోరాటాల సుడిగుండాలు సృష్టించిన సునామీ ఉప్పెనల అమాంతమైన జల్లులకి అమాంతం మాయమైపోయి కాలగర్భంలో కలిసిపోయిన ఆ చిరకాల కన్నీటి కలం కలలెన్నో!
(ఇటు ఆంధ్రా యూనివర్సిటీ నుండి మొదలెడితే అటు ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకూ అదే పనిగా ఆంధ్రా, తెలంగాణలో అక్షర సేద్యం చేస్తూ భావోద్యమాలకి బాసటగా నిలిచిన కలంపై ప్రేమతో, మిగిలిపోయిన కరపత్రాల్ని ఓసారి ఆత్మీయంగా స్పృశిస్తుంటే, దాచుకున్న గత కాలపు ఊసులెన్నో తలంపుకొచ్చాయి. గడిచిన దినాల బాసల్ని జ్ఞప్తికి తెచ్చాయ్. వాటి మధ్య సంచరిస్తూ నాటి సంఘర్షణల నేపథ్యాన్ని సంక్షిప్తంగా ఇలా ….)
గౌరవ్