———-
(‘RELIGION ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————–
ఒక వృద్ధ పూజారి “మాకు మతం గురించి చెప్పండి!” అని అడిగాడు.
ఆల్ ముస్తఫా చెప్పసాగాడు:
ఈ రోజు వేరే ఏమైనా చెప్పానా?
మతమంటే — చర్యలు, వాటి ఫలితాలు కాదూ?
చర్య, దాని ప్రతిఫలమూ కానిదీ —
కానీ ఒక వింత, ఆశ్చర్యమూ,
ఆత్మ నుండి ఉబికి వచ్చేదీ
( చేతులతో రాళ్లు కొడుతున్నా లేక మగ్గం నేస్తున్నా)
కూడా– మతం కాదా?
ఒకని చర్యల నుండి
అతని విశ్వాసాన్ని ఎలా వేరు చేస్తాం?
అతని వృత్తి నుండి
నమ్మకాన్ని ఎలా వేరు చేయగలం?
“ఇది దైవానికి — ఇది నాకు ;
ఇది నా ఆత్మకు — ఇది నా దేహానికి” ?
అని – ఎవరు తమ పని గంటలను
విభజించ గలరు?
మీ కాలం మీ మధ్యనే ఆకసంలో
రెక్కలార్చుకుంటూ, తిరుగుతూ ఉంటుంది!
నైతికతనే వారి అత్యున్నత వస్త్రాలుగా
ధరించిన వారు
దానికన్నా- వస్త్ర రహితులైతేనే మంచిది!
గాలి, రవి కిరణాలు
అతని చర్మానికి తూట్లు పెట్టవు!
నీతి ద్వారా వారి ప్రవర్తనను
నిర్వచించుకునే వారు
వారి గానకోకిలను పంజరంలో బంధిస్తారు
సంపూర్ణ స్వేచ్ఛా గీతం
అడ్డు కర్రల నుండి, పంజరపు తీగలు నుండి రాలేదు గదా!
పూజ ఒక గవాక్షంలా
మూసి, తెరుచుకుంటూంటే
వారు ఎప్పుడూ వారి ఆత్మ గృహాన్ని
సందర్శించలేదన్నమాట!
ఆత్మ గృహం గవాక్షాలు
వేకువ నుండి వేకువ వరకూ
తెరిచే ఉంటాయి!
మీ దైనందిక జీవితమే
మీ ఆలయమూ, మీ మతం కూడాను!
మీరు దాని లోకి ప్రవేశించినప్పుడు
మీ సమస్తమూ తీసుకొని పోండి!
మీ నాగలి, సుత్తి
మీ సమ్మెట, వేణువు
మీ అవసరానికి , మీ ఆనందానికి
తీర్చిదిద్దుకున్న —
పై వస్తువులన్నీ తీసుకు వెళ్ళండి.
ఎందుకంటే,
మీ ఊహాలోకాల్లో కూడా —
మీరు సాధించిన విజయాల కన్నా
ఎత్తుకు ఎదగలేరు
మీ వైఫల్యాల కన్నా
దిగువకు జార లేరు.
మీతో పాటు మనుషులందరినీ
తీసుకొని వెళ్ళండి :
ఎందుకంటే,
ఆరాధనలో వారి ఆశలకన్నా ఎత్తుకు ఎదగలేరు
వారి నిరాశ కన్నా క్రిందకు పడి పోలేరు!
మీరు దైవాన్ని దర్శించాలంటే
చిక్కు సమస్యల పరిష్కర్త కాకండి!
మీ చుట్టూ చూసుకోండి
మీ పిల్లలతో ఆడుతూ దైవం కనిపిస్తాడు!
ఆకసం వైపు దృష్టి సారించండి —
మెరుపుల్లో — తన చేతులు సాచుతూ,
వర్షంలో — క్రిందకు దిగుతూ,
మేఘాల్లో నడిచే
దైవాన్ని మీరు చూస్తారు!
పుష్పాల్లో నవ్వుతూ ఉన్న
దైవాన్ని చూస్తారు!
వృక్షాల్లో పైకెగురుతూ
చేతులు ఊపే
దైవాన్ని చూస్తారు!
Also read: ఇసుక పైన
Also read: ఇసుక పైన
Also read: మరణం
Also read: ఇద్దరు వేటగాళ్ళు
Also read: నది