Thursday, November 21, 2024

మనిషన్నది మరిచాక మతమేదైతే నేమిటి?

మీరు పిల్లలకి దేవుడి గూర్చి, పురాణాల గూర్చి తప్పక బోధించండి. లేకపోతే దయ్యాలు వారికి విజ్ఞాన శాస్త్రం గురించి, జీవపరిణామం గురించి, స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛాలోచన గురించి, ప్రశ్నించడం గురించి, సంయమనం గురించి, సహనం గురించి, లింగ, వర్ణ, వర్గ సమానత్వం గురించి, విశాల దృక్పథం గురించి – అబ్బో ఇంకా అలాంటి ఎన్నో విషయాల గూర్చి బోధిస్తాయి…జాగ్రత్త!! అని ఒక వ్యంగ్య రచయిత సమాజాన్ని హెచ్చరించాడు. ఇక్కడ మనం నవ్వుకోవాల్సిన విషయమేమంటే ఈ దేశంలో ఎవరూ ఏ మతాన్ని భూస్థాపితం చేయలేరు. అట్లని ఎవరూ ఏ మతాన్నీ పనిగట్టుకొని ఉద్ధరించనూ లేరు. ఎవడి పొట్ట తిప్పలు వాడిది. అంతే! పళ్ళూడ గొట్టుకోవడానికి ఏ రాయైతేనేమితి? అన్నట్టు మనిషి, తను మనిషినన్నది మరిచాక ఇక అతను ఏ పని చేసినా వృధాయేకదా? ఎవరి నేపథ్యం ఏమైనా కావొచ్చు. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా కావొచ్చు. అవన్నీసమాజానికి అవసరం లేదు. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక్కటే కావాలి!

Also read: గాంధీజీ స్థానంలో సావర్కరా? హవ్వ-సిగ్గుచేటు!

డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన ప్రకారం అంటరానితనం భారత దేశంలో క్రీ.శ.400 నుంచి ప్రారంభమైంది. బౌద్ద మతానికి – బ్రాహ్మణ హిందూ మతానికి జరిగిన ఘర్షణల ఫలితంగా అంటరానితనం వచ్చింది. తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి దీన్ని బ్రహ్మణ సమాజం పెంచి పోషించింది. అధిక ప్రాచుర్యం కలిగించింది. బానిసలుగా ఉపయెగించుకోవడానికి ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా దళితుల వంటి గ్రూపులు తయారు చేశారు. అందుకే జపాన్ లో బురాకుమిన్ (BURAKUMIN). యూరోప్ లో కగోట్స్ (CAGOTS), యమన్ లో అల్ అఖ్ దమ్ (AL-AKHDAM) వంటి గ్రూపులు ఏర్పడ్డాయని చెపుతారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరానితనం చట్టవ్యతిరేకమని గుర్తించబడింది. కేరళలోని మలబార్ లో సారా పింటో (SARAH PINTO) అనే నరశాస్త్ర నిపుణుడు (ANTHROPOLOGIST) అంటరానితనం గూర్చి అధ్యయనం చేసి, కొన్ని విషయాలు వివరించాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చావుకు సంబంధించిన పనులు చేసేవారిని, మాంసానికి, శరీరద్రవాలకు సంబంధించిన పనులు చేసేవారిని అంటరానివారుగా నిర్వచించారు. అగ్రవర్ణాలవారితో అణగదొక్కబడి, ప్రతిచోట, ప్రతివిషయంలో దూరంగా నెట్టివేయబడ్డారు. ఇతరులతోకలిసి భోజనం చేయడం నిషిద్ధం. వారికోసం టీకప్పులు, ఇతర పాత్రలు వేరుగా వాడాలి. ఉత్సవాలలో, పండుగలలో కూడా వారికి వేరే భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఆలయప్రవేశం నిషిద్ధం. చెప్పులు, గొడుగూ వేసుకుని పోవడం నిషిద్ధం. ఇతర కులాలలోని ఇళ్ళలోనికి వెళ్ళడం నిషిద్ధం. ఇతర కులాలు తిరిగే రాచవీధుల్లో తిరుగకూడదు. అందరూ వాడే బావులు, చెరువులు, కుంటలకు దూరంగా ఉండాలి. వెట్టిచాకిరి చేసుకుంటూ వారివారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి. పాఠశాలల్లో కూడా అంటరానివాళ్ళ పిల్లలకు కూర్చునే స్థలం వేరుగా ఉండాలి. వారి చద్దిమూటలు వేరుగాఉండాలి. ఏ రకంగానూ వారు ఇతర కులాలవారితో కలవకూడదు. ఇన్ని చేసిన మనుషుల్ని మనుషులనే అందామా? మనిషిని మనిషిగా గర్తించకపోవడం, మనిషి దుర్నీతికి నిదర్శనం. గత కాలం చేసిన పొరపాటు. బానిసలా బతికే మనిషికి ఏ మతమైతే నేమిటి? అనేది ఆలోచించాలి.

సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేది బూడిద- అన్నట్టు ఏ మతంలోంచి ఏ మతంలోకి మారితే ఏమొస్తుంది? మనిషిని మనిషిగా చూడని మతం ఏదైతే ఏమిటీ? కొన్ని ప్రయోజనాలు కల్పించి, కొన్ని వసతులు చూయించి అణగారిన వర్గాలవారిని విపరీతంగా క్రైస్తవంలోకి మార్చుకున్న సంఘటనలు మనకు తెలుసు. హిందూ సమాజంలో సరైన స్థాయి, గుర్తింపు లేక నిర్లక్ష్యానికి గురికావడం ఒక కారణమైతే ఎదుటివారు అందించే డబ్బు, మెరుగైన జీవన ప్రమాణాలు మరొక కారణం అయింది. అసలు మతాలు వదిలేసి మనిషిగా నిలబడడం గొప్ప. అతికొద్దిమంది మాత్రమే అలా చేయగలుగుతున్నారు. మతాల మధ్య కలహాలు, పోటీతత్వం. అసమానతలు పెరిగి సమాజం అతలాకుతలం అయిపోతున్నప్పుడు కొందరు పెద్దలు సర్వమత సహనాన్ని వెలుగులోకి తెచ్చారు. అన్ని మతాలవారికి సమానమైన గుర్తింపు ఉండాలని, హక్కులుండాలని సంఘిర్షించారు. ఈ రోజు ఇంత ప్రగతి సాధించి, ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా మతాల గూర్చి, వర్ణాల గూర్చి చర్చ అవసరం లేదు. ప్రపంచంలో మనిషి ఏ ప్రాంతంలో ఉన్నా అతని నేపథ్యం ఎలాంటిదైనా అందరి డిఎన్ఏ ఒకటే! అందరూ హోమో సేపియన్సే!! వైజ్ఞానికంగా ఇక ఇప్పుడు ఆ విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. కాలక్రమంలో ఒక్కోమతం ఒక్కోప్రాంతంలో ప్రాభవం, ప్రభావం చూపుతుంది. ఎవరికి వారు మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని జబ్బలు చరుచుకోవడం మాని, ఒకరి మతాన్ని మరొకరు విమర్శించుకోవడం మాని ఏకగ్రీవంగా అందరూ మతాల్ని, కులాల్ని వదిలేయడం మంచిది. ‘మానవులంతా ఒక్కటే’- అనే భావన పెదాలమీద కాకుండా, మనసుల్లో గాఢంగా నిలుపుకోవాల్సిన తరుణం ఇది.

Also read: హేతుబద్ధత కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

మతాలపరంగా మానవరక్తం విభజింపబడిలేదు. వైజ్ఞానికులు పరిశోధించి ఏర్పరిచిన ఎ, బీ, ఎబీ, ఓ- అనే గ్రూపులు తప్ప – రక్తం – హిందూ రక్తం, ముస్లిం రక్తం, క్రైస్తవ రక్తం అని మతాల పరంగా రక్తం విభజింపబడిలేదు. అసలు జీవకణాలే విభజింపబడిలేవు. డిఎన్ఏనే  ఒకటైనప్పుడు మతపరంగా విభజనలెక్కడివీ? ఏదైనా ప్రమాదం జరిగి ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వస్తే మతాలపరంగా రక్తం కావాలని అడుగుతున్నామా? ఎంతటి కరుడుగట్టిన మతవాదైనా తన మతస్థుల రక్తమే కవాలని అడగలేడు. ప్రాణం నిలబడటానికి ఎవరి రక్తమైనా సరేననుకుంటాడు. బ్లడ్ బ్యాంక్ ల్లో దొరికే రక్తం ఎవరిదో అదెవరికి ఎక్కిస్తున్నారో ఎవరైనా పట్టించుకుంటున్నారా? అక్కడ మతాల పరంగా రక్తం, పంపకం జరగడం లేదు కదా? ఇకపోతే మరో విషయం. నటుడు కమల్ హాసన్ ఎయిడ్స్ నివారణకు 16 కోట్ల రూపాయల విరాళమిచ్చారు. అన్ని మతాలవారిలో ఉన్న ఎయిడ్స్ రోగులకు ఆ ‘నిధి’ ఉపయోగపడుతుంది. హిందూ ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడితే, ఉగ్రవాద హిందూ రాజకీయనాయకులు ఆయనను చంపేయాలన్నారు. ఏ మాత్రం బుద్ధీజ్ఞానం ఉన్నవారైనా, ఆయన కంటే ఎక్కువగా విరాళమిచ్చి ఆయన కంటే మించి మంచి పనేదైనా చేసి, మాట్లాడితే, జనంవిని ఆలోచిస్తారు. అంతేగాని, జనానికి మేలు చేయనివాడినిగూర్చి జనం ఎందుకు పట్టించుకుంటారూ?

ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు. కానీ, అబద్ధాన్ని నమ్మించడానికే అబద్ధాలు అవసరమౌతాయి. దేవుణ్ణి, మతాల్ని నమ్మించడానికి ఎన్నో అబద్ధాలు, మరెన్నో అభూతకల్పనలు అవసరమయ్యాయి. సైన్సును నమ్మించే పని లేదు. దానికి ఎలాగూ రుజువులుంటాయి. మరి రుజువులు లేనివన్నీ అబద్ధాల ఆసరాతోనే కదా బతకాలీ? ఇక్కడ జరుగుతున్న ద్రోహం గమనించండి. దేవుడు, మతమూ అబద్ధమై ఉండి వాస్తవంగా సజీవుడై ఉన్నమనిషిని అబద్ధమంటాయి. ‘‘నువ్వో అబద్ధం. నీ జన్మ అబద్ధం. నువ్వు నువ్వు కాదు. నువ్వు పాపాత్ముడివి. ఆపైనున్న శక్తిని నమ్ముకో. పరలోకంలోని ఆ తండ్రిని నమ్ముకో అని…’’ అట్లా అబద్ధాల పరంపర ప్రచారం చేస్తారు. ఏదో లోకంలో దేవుడున్నాడని భ్రమించజేసి- ఆ భ్రమని నిజమనుకోమంటుంది మతం. పైగా ‘‘అంతా మాయ’’ అని కూడా తేల్చేస్తుంది. దైవదూతలు, పూజారులు, ముల్లాలు, ఫాదర్ లువగైరాలందరూ జనాన్ని మభ్యపెడుతూ అబద్ధాల మీద వ్యాపారం చేసుకుంటున్నారు. సైన్సు, సైంటిస్టులు, సాంకేతిక నిపుణు వగైరాలంతా అబద్ధాల మీద బతకడం లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం లేదు. ఏదీ మాయ కాదు. జరుగుతున్న వాటన్నిటికీ శాస్త్రనిరూపణలున్నాయని ఘంటాపథంగా చెపుతున్నారు. అందువల్ల సామాన్యజనం ఆలోచించుకోవాలి. – ‘‘అబద్ధాల వైపుందామా? నిజాల్ని నిలబెడదామా?’’- అని.

Also read: నిత్యజీవితంలో వైజ్ఞానిక స్పృహ

భావి తరాలకు దేవుళ్ళ గురించి మతం గురించి చెప్పేముందు వారికి దేవుడి పేరుతో జరిగిన మారణహోమాల గూర్చి చెప్పాలి.  మనుషుల్ని విభజించిన దుష్ట సంప్రదాయం గూర్చి చెప్పాలి. అంటరానితనం గూర్చి, బానిసత్వం గూర్చీ చెప్పాలి. వ్యాపారం గూర్చి చెప్పాలి. నజాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నమ్మేవాళ్ళుటే – అది వారి ఇష్టం! విషయం తెలుసుకోకుండా ఆచారంగా వస్తూ ఉందనో, అదో కుటుంబ సంప్రదాయమనో గుడ్డిగా నమ్మితే వారు మానిసిక అంధులవుతారు. ఇలాంటివారిని చూసే డా. బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు: ‘‘ఒకవేళ హిందువులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళితే భారతదేశంలోని కులవ్యవస్థ ప్రపంచానికో సమస్య అవుతుందీ’’-అని! అంబేడ్కర్ అరవైయేళ్ళ క్రితం ఊహించింది నిజమే అయ్యింది. బారతీయులు తమ కులాల్ని, వర్గాల్ని, మతాల్ని, దేవుళ్ళనీ, పవిత్ర గ్రంథాల్ని తమతో పాటు అన్ని దేశాలకూ తీసుకుపోయారు. తమ తమ ప్రార్థనా స్థలాల్నికట్టుకున్నారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ బారతీయులు సంస్కృతి పేరుతో తమ మూఢాచారాల్ని, చాదస్తాల్ని భద్రంగా ఉంచుకున్నారు. కుల అభిమానాన్ని మరింత పెంచుకున్నారు. కావాలంటే ఉదాహరణకు జస్టిస్ మార్కండేయ కాట్జూ చెప్పిన అనుభవాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. జాగ్రత్తగా విషయం గ్రహించండి.

‘‘ప్రీ మౌంట్ కాలిఫోర్నియాలో భారతీయులు తెలుగువారు సరదాగా క్రికెట్ ఆడదామనుకున్నారు. రెండు టీంలు తాయారయ్యాయి. అందులో ఒకటి కమ్మకులస్థుల  టీం. మరొకటి రెడ్డి కులస్థుల టీంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆట మధ్యలో ఏదో గొడవ జరిగింది. రెండు టీంల వాళ్ళు ఘోరంగా తన్నుకున్నారు. అసలు ప్రధాన విషయం అది కాదు. ఇండియా నుండి 13,500 మైళ్ళు వలస వెళ్ళిన తెలుగువారు కాలిఫోర్నియాలో కులప్రాతిపదికన టీంలు తయారు చేసుకోవడం విస్మయం కలిగించే విషయం. అక్కడ కులయుద్ధాలు జరిగాయంటే ఇక ఏమనుకోవాలి? వీళ్ళు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశం వెళ్ళినా, వాళ్ళబుద్ధులు మారవన్న మాట!’’- ఇదంతా చెప్పిన మార్కండేయ కట్జూ నిర్భయంగా, సంకోచించకుండా మరో మాటకూడా చెప్పారు. ‘‘తొంబయి శాతం భారతీయులు మూర్ఖులు- అని లోగడ నేనన్న మాట వాస్తవమేనని తేలింది’’- అని! అంత పెద్ద జస్టిస్ గారన్నమాట గూర్చి మనమంతా సీరియస్ గా ఆలోచించాలి కదా? కులస్థులుగా, మతస్థులుగా మనల్ని మనం విడగొట్టుకుని, నిజంగానే మనం మనుషులమన్నది మరిచిపోతున్నామా? మేధావులకు మతమొక వినోద కార్యక్రమంగా ఉంటుంది. అదే అమాయకులకు, అవివేకులకు అదొక యదార్థ కార్యక్రమం!

Also read: విజ్ఞానమా? మతవిశ్వాసమా? ఏది కావాలి?

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles