Thursday, December 26, 2024

వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?

 ‘పూలలో సువాసన, వ్యక్తుల్లో యోగ్యత దాచినా దాగదు’- అని అన్నారు భారత తొలి ప్రధాని పండట్ జవహర్ లాల్ నెహ్రూ. దేశం వైజ్ఞానికంగా ముందుకు పోవాలని కలలు గన్నవాడాయన.

ఏదైనా పని ప్రారంభించేప్పుడు ఒక సారి ఆగు. పరిణామాల గూర్చి ఆలోచించు. అప్పుడు ప్రారంభించు – అని పెద్దలు చెప్పిన మాట కొందరు ఎందుకోగాని అస్సలు పట్టించుకోరు. తోచింది చేస్తారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ‘‘గీతాశ్రవణం మధుమేహానికి మందు’’- అని అన్నాడో ప్రఖ్యాత డాక్టర్ వైద్యుడు. ‘‘శ్రీకృష్ణుడి బోధనలతో ఒత్తిడి దూరం అవుతుందని’’ హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండోక్రైనాలజీ డిపార్టుమెంట్ హెడ్ – అన్నారు. వ్యాయామం, ఆహార నియమావళి పాటిస్తూ భగవద్గీత వింటే ఆ వ్యాధిని మరింత నియంత్రణలో పెట్టవచ్చనీ – ఆయన అన్నారు. ‘‘భగవద్గీత ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు, జీవితంలో 700 అంశాలను వివరించే గ్రంథం’’- అని కూడా అన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం – పరిశోథనా పత్రం’’- ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’-లో ప్రచురితమైనదని చెప్పారు.

Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

ఒత్తిడి తట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంభిస్తారు. కొందరు పచ్చని పంట పైరుల్లో గడుపుతారు. కొందరు అడవుల్లోకి వెళ్ళి ప్రకృతి ఒడిలో గడుపుతారు. కొందరు వెళ్ళి దగ్గర్లోని పార్కులో కూచుంటారు. సంగీతాభిమానులైతే వారికి ఇష్టమైన సంగీతం వింటారు. కొందరు మంచి రచనలు చదువుతూ గడుపుతారు. ఇటీవలి కాలంలో కంప్యూటర్ నిపుణులు ఎక్కువగా స్ట్రెస్ బాల్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎవరి పద్ధతి వారికి ఉంటుంది. తప్పిస్తే, ఆ ప్రఖ్యాత డాక్టరు చెప్పినట్టు భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు అని ప్రకటించగానే ఇతర మతాలవారంతా దాన్ని స్వీకరించిన దాఖలాలు లేవు. ఈ డాక్టర్ లో డాక్టర్ లక్షణాలకన్నా మతపిచ్చి అధికంగా కనిపిస్తోంది. ప్రస్తుత భారత ప్రధాని ప్రపంచానికి ఓ ‘యోగా దినాన్ని’ ప్రకటిస్తే – దిల్లీలో ఎ వందమందిని పోగేసుకుని ఆయన ప్రదర్శించుకోవాలే తప్ప, ప్రపంచ దేశాల్లో ఎవరూ ఎక్కడా దాన్ని ఆచరించడం లేదు. ప్రవాస భారతీయులెవరైనా ఆచరించినా, అదో మొక్కుబడి కిందే లెక్క. అలాగే ఈ డాక్టర్ భగవద్గీతకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం తేవాలని ఉబలాట పడ్డాడు తప్పిస్తే, మరొకటి కాదు. హిందూమతం మీద భగవద్గీత మీద విశ్వాసం లేని ఇతర మతస్తులకు గీతవినిపించి, వారి మానసిక ఒత్తిడి తగ్గించగలిగితే అప్పుడు ఆ డాక్టర్ చెప్పింది నిజమని నమ్మొచ్చు. అదే మధుమేహానికి వాడే మందుబిళ్ళలు మీరు ఏ మతస్థుడికైనా, ఏ కులస్థుడికైనా, భక్తుడికైనా, నిరీశ్వరవాదికైనా ఇచ్చి ఫలితం చూడవచ్చు.

Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

అన్నీ వ్యాధులు కావు, కొన్ని అవకతవకలు

ఇకపోతే పెరిగిన ఆధునిక అవగాహనను బట్టి, అన్నింటినీ వ్యాధులు (Diseases) అని అనకూడదు. కొన్ని శరీరధర్మరీత్య వచ్చే అవకతవకలు (Disorders) మాత్రమే! జనాన్ని భయపెట్టి, లేదా వారికి తమ పైత్యాన్ని అంటగట్టి వ్యాపారం చేసుకోవడం లేదా ప్రాచుర్యంలోకి రావడం కొందరు డాక్టర్లకు అలవాటు. బహుశా ఈ డాక్టరు ఆ బాపతువాడేనేమో. లోగడ ఒక కర్నాటక సంగీత విద్వాంసుడు ‘మ్యూజిక్ తెరపీ’ అన్నాడు. అది ఎవరిపై పని చేస్తుందండా? ఆ సంగీతం తెలిసి, దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి తనను తాను మరిచిపోయి ప్రశాంతత పొందగలిగే స్థాయిలో ఉంటేనే కదా? సరిగమలు తెలియని వాడికి, శాస్త్రీయ సంగీతమనగానే ‘అమ్మనాయనో’ అని పారిపోయేవారికి అది పనిచేయదు కదా? సైన్సు అందించిన మెడికల్ ట్రీట్ మెంట్ తో సమంగా ఏ తెరపీ రాదు. వాటి మీద విశ్వాసం ఉన్న ఏ కొద్దిమందికో అది అదనంగా కొంత ఉపవమనం ఇవ్వొచ్చు. అంతేగాని, మెడికల్ ట్రీట్ మెంట్ మానేసి ఇలాంటి తెరపీలతో జనబాహుళ్యంలో పని జరుగుతుందా? ఆలోచించండి! మరో విషయం ఏమిటంటే ‘గీతాశ్రవణం-మధుమేహం’-సంబంధించిన తమ అధ్యయనం ఇండియన్ జర్నల్ లో ప్రచురింపబడిందని ఆ డాక్టర్ రాజేశ్ చెప్పారు కదా? ఇదిగో ఇలాంటి చాదస్తుడెవెవరో ఆ జర్నల్ ఎడిటోరియల్ బోర్డులో ఉండి ఉంటారు. అందుకే ప్రచురించి ఉంటారు. ఇండియన్ జర్నల్ లో కాకుండా విదేశీ జర్నల్ లో ప్రచురించబడితే, దాని ప్రామాణికత గూర్చి కొంతవరకు ఆలోచించేవాళ్ళం. ఎందుకంటే, ఆ దేశాల శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి, విశ్లేషించిన తర్వాతనే ప్రచురిస్తారు. ఇక్కడి వాళ్ళు ఇక్కడి పైత్యాన్ని ప్రచురించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇండియన్ జర్నల్స్ అన్నీ నాసిరకంవి అని నేను  చెప్పడం లేదు. ప్రపంచస్థాయి పరిశోధనలు ఈ దేశంలో జరుగుతున్నాయి. ఆ స్థాయి సైన్సు పత్రికలు ఇక్కడ అచ్చవుతున్నాయి. అయితే, ఇప్పుడు వైజ్ఞానిక స్పృహను దెబ్బతీసే సైన్సు సంఘాలు, పత్రికలు కొన్ని తయారయ్యాయి. అవి అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నాయి.

Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను  కొందరు రూపొందించుకున్నారు. కేంద్ర ప్రభుత్వపు ఆలోచన్ని యథాతథంగా చర్చించడం దీని ఉద్దేశం. ఇది సైన్స్ కు సంబంధం లేని అనేక విషయాలకు ప్రాముఖ్యమిచ్చి అతిగా చూపించడం జరుగుతూ ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సైన్సు సంఘాలు, సైంటిస్టులు రాజకీయాలకు లొంగి పనిచేయడమే ‘ఆత్మనిర్భర్ భారత్’ అన్న మాట! దేశ ప్రజల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేయాలన్న ధ్యేయంతో కొన్ని సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం మనం మరవకూడదు. సామాన్య పౌరులు, ముఖ్యంగా యువతీయువకులు, జాగరూకతతో మసలుకోవాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న మోసాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ‘‘జ్ఞానమే అన్నింటి కంటే గొప్ప ధనం. ఎవరికి వారు వారెంతటి ధనవంతులున్నది ప్రశ్నించుకోవాలి!’’- అనే మాట నిరంతరం గుర్తు చేసుకోవాల్సి ఉంది.

Also read: పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు

ఆవుపేడ ఆరగించిన చిన్నపిల్లల వైద్యుడు

18 నవంబర్ 2021న ఒక హరియాణా డాక్టరు – చిన్న పిల్లల వైద్య నిపుణుడు ప్రజల సమక్షంలో గోశాల ముందు నిలబడి ఆవుపేడ తిన్నాడు. అంతే కాదు, పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నానన్న పట్టలేని సంతోషంలో ఉపన్యసించాడు. అవుపేడ దేహాన్ని, మనసును పవిత్రం చేస్తుందని సెలవిచ్చాడు. ఎంబిబియస్, యం.డి చదివిన మనోజ్ మిట్టల్ అనే డాక్టరు ఆవుపేడ సందేశాన్ని ప్రజలకు ఇవ్వడమే గాక, వారి ముందే ఆవు పేడ ఊరించుకుంటూ చప్పరించి వారికి ప్రాయోగిక పరిజ్ఞానం కలిగించాడు. అందుకే అన్నారు: మూర్ఖోరక్షితఃరక్షితః-అని! మూర్ఖుల్ని రక్షిస్తే వారే మనల్ని రక్షిస్తారు- అని! ప్రభుత్వాలకు సరైన ఆలోచన ఉంటే గింటే – వెంటనే అతని మెడికల్ డిగ్రీలు రద్దు చేసి వైద్యవృత్తికి అనర్హుడుగా ప్రకటించాలి. ‘నాయనా నువ్వీ  గోశాలలోనే ఉండు. పేడ ఎత్తుతూ ఉండు. ఆకలయినప్పుడు ఇంత తింటూ ఉండు. నీ జన్మ ధన్యమవుతుంది’- అని అతణ్ణి గోవులకే వదిలేయాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుకంటే, అందులో విరాజిల్లుతున్న పెద్దలే ఇలాంటి పేడ పురుగుల్ని మతవ్యాప్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాడుకుంటున్నారయ్యే! రాజకీయాలు మారిపోయాయి. ఒకప్పుడు రైట్ వింగ్-లెఫ్ట్ వింగ్ మధ్యన ఉండేవి. ఇప్పుడు అలా కాదు. నిజానికీ – అబద్ధాల ప్రచారానికీ మధ్య నడుస్తున్నాయి. ‘‘ఆలోచన తక్కువయ్యే కొద్దీ మాటలు ఎక్కువవుతాయి’’-ఫ్రెంచ్ ఫలాసఫర్ మాంటెస్క్యూ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకోగాని, ప్రస్తతం అధికారంలో ఉన్న మన దేశ నాయకులు గుర్తుకొస్తారు.

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

యువతిని చంపిన నాటు వైద్యుడు

సూర్యాపేట రూరల్-దురాజ్ పల్లి గ్రామంలో నాటు వైద్యుడు జక్కిలి భిక్షపతి నాటువైద్యం చేస్తూ, మహిళల్ని లొంగదీసుకుంటున్నాడు. రాజేశ్వరి అనే మహిళ తన 18 ఏళ్ళ కూతురు శ్రావణికి వైద్యం చేయించడానికి తీసుకువచ్చింది. నాటువైద్యుడు ఒక రోజు వారిని తన దర్గాలోనే ఉండమన్నాడు. దేవుడి సన్ని ధిలో నిద్రచేస్తే మంచిదని చెప్పాడు.అతని మాట విని తల్లీకూతుళ్ళు అక్కడే ఉండిపోయారు. రాత్రివేళ నాటు వైద్యుడు తల్లిని బలవంత పెట్టాడు. తన కోరిక తీర్చడమంటే దైవం కోరిక తీర్చినట్టేనని నమ్మబలికాడు. ఆమె వినలేదు. తిరగబడింది. వైద్యం చేయడానికీ కోరిక తీర్చడానికీ సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఉక్రోషంతో నాటు వైద్యుడు పాలల్లో పసరు కలిపి కూతురి చేత తాగించి ఆమెను చంపేశాడు. చివరికి పోలీసులు నాటు వైద్యుణ్ణి అరెస్టు చేసి తీసుకుపోయారు. గాంధీనగర్ సమీపంలో దర్గా ఏర్పాటు చేసుకుని  నాటువైద్యం పేరుతో మహిళల మీద లైంగిక దాడులు చేస్తున్నాడని పోలీసు విచారణలో తేలింది. 2012 నవంబర్ – తండ్రీకొడుకులు రోడ్డు మీద నడుస్తున్నారు. దూరంలో శబ్దం వినిపించింది. తండ్రి కొడుకును అడిగాడు ‘‘ఆ శబ్దం విని అదేమిటో చెప్పరా నాన్నా!’’ అని! కొడుకు జాగ్రత్తగా విని ‘‘అది లారీ చప్పుడు డాడీ’’ అన్నాడు. ‘‘నిజమే! బాగా కనిపెట్టేవ్! కానీ అది ఖాళీగా వస్తోంది తెలుసా?’’- అన్నాడు తండ్రి. కొడుకు ఆలోచనలో పడ్డాడు. ‘‘దాన్ని చూడకుండానే మీరెలా కనిపెట్టారా విషయం?-ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ‘‘అదిగో అంతంత శబ్దాలు వస్తున్నాయంటే అది ఖాళీదే అయి ఉంటుంది’’- అని వివరణ ఇచ్చాడు తండ్రి. కాసేపటికి ఆ ఖాళీ లారీ వారి పక్క నుండి వెళ్ళిపోయింది. మరి కాసేపటికి శబ్దాలు దూరమయ్యాయి. చిన్నోడు తండ్రి కాళ్ళకు చుట్టుకుని ‘‘భలే కనిపెట్టేశావు డాడీ’’ అని తండ్రి ముఖంలోకి అనందాన్ని ప్రసరించాడు.

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

అందుకే చూడండి ఖాళీ బుర్రలెప్పుడూ ఎక్కువ శబ్దాలు చేస్తుంటాయి. టి.వి. యాంకర్లు, రాజకీయనాయకులు, మంత్రులు, ప్రధానులు ఎవరైనా కావొచ్చు. బుర్ర ఖాళీగా ఉన్నప్పుడే దేశవాసులకు అర్థంపర్థం లేని ‘‘సుభాషితాలు’’ చెపుతుంటారు. అక్కడ వారిస్థాయి, హోదా ముఖ్యం కాదు. మెదడ్లు లేక పోవడం, ఉన్నా – వాటికి తమ అహాన్ని అడ్డువేసి, సరిగా పని చేయనివ్వకపోవడం – చూస్తున్నాం! అందుకే మన దేశంలో కొందరు ఉన్నత విద్యావంతులు విద్యావిహీనుల్లా మాట్లాడుతుంటారు.  తమ మూర్ఖత్వ విశ్వరూప ప్రదర్శన నిత్యం చేస్తుంటారు. ఇలాంటివి కేవలం మన భారతదేశానికే ప్రత్యేకం! అదేమిటో…

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles