Sunday, December 22, 2024

సమగ్రంగా ఆలోచించే లాక్ డౌన్ సడలించాలి

కోవిడ్ రెండో వేవ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. మరికొన్ని నెలల్లో మూడో అల ముప్పు కూడా ఉందని భయపెడుతున్నారు. రెండో వేవ్ గురించి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా, ప్రభుత్వాలు, ప్రజలు పెడచెవిన పెట్టారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మూడో వేవ్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం అత్యంత కీలకం. తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, దిద్దుబాటు చర్యలను చేపట్టాము. అందులో భాగంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ / కర్ఫ్యూను అమలుచేశాయి. వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతులలో, వివిధ సమయాల్లో నిబంధనలను విధించాయి.

Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు

దాని వల్ల ఆ యా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడమే కాక, మరణాల ఉధృతి కూడా కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ వేళలను, నిబంధనలను క్రమంగా సడలిస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క తీరులో నిర్ణయం తీసుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న వేళల్లో మార్పులు ఉన్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అన్నారు. పేరు ఏదైనా కఠినమైన నిబంధనలనే అమలు చేస్తున్నారు. తెలంగాణలో సడలింపుల వేళలు తాజాగా పెంచారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లాక్ డౌన్ నుంచి స్వేచ్ఛ ఇవ్వడంతో స్థంభించిన కార్యక్రమాలు మెల్లగా మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం వరకే సడలింపు అమలులో ఉంది. లాక్ డౌన్ విధించడం, కొంతమందికి వ్యాక్సిన్లు అందిన నేపథ్యంలో తెలంగాణలో గతంలో కంటే కాస్త మెరుగైన వాతావరణం ఏర్పడింది. లాక్ డౌన్ సడలింపులు మరింతగా పెంచితే కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఇంకా కట్టడి కావాల్సి వుంది. గడచిన 24 గంటల్లో 4,549 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also read: యూపీలో ఏమి జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే, కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ రెండు కోట్లకు పైగా నమూనాలను పరీక్షించారు. ఇది మంచి ప్రగతి. ఎవరెవరికి, ఎంతమందికి, ఏ ఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకివుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. లాక్ డౌన్ విధింపు, సడలింపులకు, వైద్య సేవల రూపకల్పనకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. అన్ లాక్ పై ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఉంది. వైరస్ అదుపులోకి రాకుండా లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, అది మరింత ప్రమాదకరం. పరీక్షలు కొనసాగిస్తూనే, వ్యాక్సినేషన్ పై దృష్టి పెంచాలి. ఈ నెల 21 నుంచి జాతీయ స్థాయిలో కొత్త వ్యాక్సినేషన్ విధానం అమలులోకి రానుంది. దీని ప్రభావంతో వ్యాక్సిన్లు అందేవారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నవారిలో యాంటీ బాడీస్ పెరుగుతాయి. వ్యాక్సినేషన్ ప్రగతిని, పరీక్షల ద్వారా వస్తున్న ఫలితాలను బేరీజువేసుకుంటూ అన్ లాక్ విధానాన్ని రూపకల్పన చేసుకోవడమే శ్రేయస్కరం. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడం ఆనందకరమైన అంశం. రీకవరీ రేటు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలలోనూ కొత్త కేసులు తగ్గుతున్నాయి.

Also read: మోదీతో దీదీ ఢీ!

కోవిడ్ అలారం సరికొత్త సాధనం

బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన కోవిడ్ అలారంలు కూడా త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, వ్యక్తుల నుంచి వచ్చే వాసనబట్టి ఈ అలారం ద్వారా కోవిడ్ సోకినవారిని పసిగట్టవచ్చు. మిగిలినవారు అప్రమత్తంగా ఉండడానికి, చికిత్స అందించడానికి ఈ అలారం ఉపయోగపడుతుంది.పాకెట్ వెంటిలేటర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తయారీకి పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్ 90 శాతం సామర్ధ్యంతో, కొత్త వేరియంట్లపైన కూడా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు తోడు మరిన్ని సంస్థల నుంచి వ్యాక్సిన్లు రానున్నాయి. వ్యాక్సినేషన్ పెరిగితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానిని ఎంత ఎక్కువ సాధిస్తే, అంత క్షేమం. అప్పటి వరకూ లాక్ డౌన్ సడలింపుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడమే శ్రేయస్కరం.

Also read: సందేహాలను నివృత్తి చేసిన మోదీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles