మానవ సంబంధాల పర్య”వీక్షణ” ఫెస్ బుక్ లకే పరిమితమయ్యాయి. దగ్గరి బంధువుల లేదా స్నేహితుల ఇళ్ళలో పెళ్ళిల్లలో కాసేపు మాట్లాడుకొని హయ్ …బాయ్ అనే స్థితి తప్ప ఇంటికి రమ్మని ఆప్యాయంగా పిలిచే బంధువులే కరువయ్యారు. ఈ తరం పిల్లలకు సొంత మేనత్త, మేనమామ తప్ప అమ్మ నాన్న తరఫు బంధువులు అసలే పట్టరు. అంతా కజిన్ వ్యవహారాలు లేదా అంకుల్ ఆంటీ తప్పా అత్తా మామా పిన్ని బాబాయ్ అని పిలిచే అనురాగం ఈనాడు ఏదీ?
పిల్లలు కనిపించరు:
ఒక వేళ మీవాణ్ణి పరిచయం చెయ్యండి అంటే వాడు ఇప్పుడే కాలేజి నుండి వచ్చాడు హోమ్ వర్క్ లో ఉన్నడని చెపుతారు. అమ్మాయి అయితే అసలు బయటకు రానివ్వరు. రూముల్లో బంధించి సెల్ ఫోన్ ఇస్తే ఇక వారి లోకం వారిదే. ఒకప్పుడు ఇంటికి వచ్చిన బంధువులకు పిండి వంటలు అప్పటికప్పుడు పూరీ…లేదా వేడి వేడి బజ్జిలు, పాలకూర పకోడీ, మిరపకాయ బజ్జీలు వేసి వడ్డించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు ట్రే లో నాలుగు గుడ్ డే బిస్కెట్లు, ఇంత టీ పెట్టి చిరునవ్వుతో నాలుగు మాటలు చెప్పి “పని మనిషి మూడు రోజుల నుండి రావడం లేదు వదినా, ఇంటి చాకిరి చేసుకోలేక చస్తున్నా” అన్న మాటలు ప్రతి ఇంటా వినిపిస్తున్నాయ. అదేం రోగమో కానీ ప్రతి ఇంట్లో “పనిమనిషి” గురించి అరగంట ప్రస్తావన.
Also Read: ఆనందం ఆరోగ్యానికి దివ్య ఔషధం
ఇక ఇరుగు పొరుగు తో గెస్ట్ లు రావడం పనిభారం ఎక్కువైందనే బిల్డప్. సొంత అక్కా చెలెళ్లు అన్న దమ్ముళ్ళు వచ్చినా గెస్ట్ లుగా అరగంట మాట్లాడి పంపించే ఈ సంస్కృతి వల్ల ఆప్యాయత లు అనురాగాలు నటన అయ్యాయి. ఉదయం ఎప్పుడో ఆఫీసుకు వెళ్లి సాయంత్రం వచ్చే పిల్లలు భర్త ను పంపాకా, రెండో మూడో బెడ్ రూములు పని మనిషి క్లిన్ చేసి వెళ్ళాకా ఇంత తిని ఎనభై ఇంచుల టీవీలో తెలి సీరియల్స్ లేదా ఆప్త “బంధువులు” అనే వారికి ఫొన్ లతో కాలం వెళ్లబుచ్చుతూ…బంధుప్రేమ నే మరిచిన ఇల్లాళ్ళు తమ పిల్లలకు బంధుత్వాలు ప్రేమలు గురించి వివరించే ఆలోచన ఏనాడో మానుకున్నారు. ఫెస్ బుక్ లో ఈమె మా వదిన ఈమె మా ఆడపడుచు కూతురు అని పిల్లల కు చెప్పే స్థితి వచ్చేసింది.
చెత్త కామెంట్లతో కాలక్షేపం:
ఇక ఒక వేళ ఇంటికి ఉదయం నుండి సాయంత్రం వరకు బంధువులు ఉన్నారనుకోండి…మీ బెడ్ రూంలో ఇవే ఉన్నాయా? హాల్లో సోపాలు ఇంకా పెద్దవి ఉంటే బాగుండు! వాష్ బేసిన్ చిన్నదయింది.. దేవుని గదిలో ఈ విగ్రహం ఉంటే బాగుండు!…మా కారు కొత్తది…కంఫర్ట్ గా ఉంటుంది… కూరలు తరిగే కత్తి దగ్గరి నుండి టీవీ వరకు కంపేరిజన్. బీరువా నిండా చీరలు చూపించడం అంతా బడాయి. అంత వరకు బాగుంది. ఫలానా వారింట్లో టీవీ చిన్నది…కిచెన్ లో కప్ బోర్డులు బాగా లేవు… ఇలా చెత్త కామెంట్స్…
మగవారు తక్కువేమీ కాదు:
అయ్యో ఆడవారిని ఆడి పోసుకుంటున్నారు అనుకోకండి…మగవారు తక్కువేం కాదు! ఇద్దరు బాగా క్లోజు అయితే తమ భార్యలు పెట్టే పొరుగురించి ఒకరికొకరు చెప్పుకుంటూ సేద దీరుతారు… లేదా తాము పర్యటించిన విహార యాత్రల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ సంభాషణల్లో పిల్లల పాత్ర ఉండదు. ఎంత సేపు గొప్పలే తప్పా ఇలా మనం ఆదర్శంగా ఉందాం అనే ప్రస్తావన రాదు. ఒక వేళ పిల్లలు కలిస్తే కూడా వాళ్ల గదుల్లో ఎవరిగొల వారిదే. అయితే విమర్శ లేదా హిపోక్రసీ…ఇక మావాడు అమెరికా లో ఉన్నాడు..లేదా కెనడా లో ఉన్నాడు…ఆస్ట్రేలియాలో ఉన్నాడు వాడు పర్మినెంట్ రెసిడెంట్.. సిటిజన్ షిప్ వచ్చేసింది.
Also Read: స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు
పితూరీలే ఎక్కువ:
వీనికి హెచ్ 1 వీసా వచ్చింది ఇలా ఉంటున్నాయి తప్ప జీవిత చరమాంకంలో జ్ఞాపకం లేదా ఆత్మీయత పంచుకునే మంచి మాటలు ఉండవు. అటు చుట్టాలు వెళ్ళగానే వారి గురించి కామెంట్స్ తప్ప చేయిని ఆప్యాయంగా తీసుకొని వారి పుట్టింటి కబుర్లు.. అక్కా చెల్లెళ్ళ ఆప్యాయత బాల్యం ముచ్చట్లు రావడం లేదు. ఎంతసేపు ఈర్ష్య ద్వేషాలు అక్క గురించి చెల్లెలు.. చెల్లె గురించి అక్కా పీతూరీలు ఉంటున్నాయి..ఇక తోటి కోడళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఒకరి సోద ఒకరికి పట్టదు. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధాలు ఆమడ దూరంలో ఉంటున్నాయి.
మానవ సంబంధాలు హుళక్కి:
ఎక్కడో ఒక దగ్గర రిలేటివ్స్ గ్రూప్, వాట్సప్ గ్రూపులు పెట్టుకొని అందరూ వీకెండ్ కలుసుకొని ఖర్చు భరించే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల మానవ సంబంధాల్లో దూరం తగ్గుతుంది. మానవ సంబంధాల ప్రాముఖ్యత ఈనాటి తరం పూర్తిగా కోల్పోయింది. ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యత పెరిగింది. అమ్మ నాన్నా పునాది మీద బంధాలు అల్లుకున్నాయన్న సత్యాన్ని మరుస్తూ వస్తున్నాం… నాది… నేను అని గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. నీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవ్వడం మరచిపోయినప్పుడు మానవ జీవితంలో ఎక్స్ ప్రెషన్స్ ఉండవు అంతా రొటీన్ లైఫ్! పరస్పర సంబంధం వరకు మాత్రమే బంధాలు గిరిగీసుకుని బ్రతుకుతున్నాయి. సామాజిక అనుబంధాలు ఇప్పుడు లేవు!
Also Read: సరస్వతీ మాత బిడ్డల ఘన విజయం ఇదీ!!
నేనూ, నా పిల్లలు:
పరస్పర సంబంధాలు వారి పరిమితి దాటడానికి ప్రయత్నం చేయడం లేదు..అంతా స్వార్థం…నేనూ, నా పిల్లలూ అనే గీత తప్ప వారసత్వ ఆచారాలు ఆప్యాయతలు పొందలేక పిల్లలు కూడా స్వార్థపోతుల్లా తయారువుతున్నారు. ఒక కుటుంబ మరణం మొత్తం వంద మందిని ఏడిపించేది ఒక నాడు.. ఈనాడు స్మశానం లో కూడా కంటి వెంట నీరు లేని బంధువులు కనబడుతున్నారని ఆవేదన పడుతున్నాం…ఈ రోజుకు ఆయన చాప్టర్ క్లోజు రేపు పనిలో పడాలి అనే ధోరణి వచ్చేసింది! ఉన్నంత వరకే ఆయనతో పని ఒక్క సారి ఆయన/ ఆమె దూరమైతే మరునాడు మరిచి పోయే మానవ సంబంధాల్లో ఆత్మ శుద్ధి అంతర్ధానం అయిపోయింది!
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం
అన్నాడు ఒక సినీ కవి!
ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి!
అన్నాడు మరో కవి. ఈ విధంగా తయారైన మానవ సంబంధాల మాధుర్యాన్ని ఈ నాటి తరానికి అందించాలంటే కుటుంబ సమ్మేళనాలు కావాలి. పోయిన బంధుత్వాలు ఒకచోట చేరి మనసుకు హత్తుకునేలా మౌనంగా ఆత్మీయత పంచుకోవాలి. అలాంటి సాహసోపేతమైన పనిని మన తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం భుజాన వేసుకొని ఎంతో మంది బంధుత్వాలను కలుపుతూ ఆత్మీయత పంచుతోంది.
(రచయిత తెలంగాణ నియోగ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు)