- కార్డు పద్దతిలో రిజిస్ట్రేషన్లకు కేసీఆర్ ఆదేశం
- స్లాట్ బుకింగ్ లు రద్దుచేసిన రెవెన్యూశాఖ
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న సంధిగ్ధతకు సీఎం కేసీఆర్ తెరదించారు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త పద్దతిలో ఉన్న స్లాట్ బుకింగ్ ఇక చేయనవసరంలేదు. సోమవారం నుంచి కార్డ్ విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా భూక్రయవిక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కోర్టు ఆదేశాల మేరకు పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రియల్టర్లు, రియల్ ఎస్టేట్ పై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఊపిరి పీల్చుకున్నారు.
కోర్టు కేసులతో రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు
రిజస్ట్రేషన్ సమయంలో ఆధార్ కాలమ్, ను కులం, కుటుంబ సభ్యుల వివరాలు సామాజిక హోదా, ప్రాపర్టీ టాక్స్ ఇండెక్స్ నెంబరు లాంటి అంశాలను తొలగించే వరకు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లను ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్లపై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేయడమా లేదంటే విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడమా అనే అంశాలపై రెవెన్యూ, న్యాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. కోర్టు కేసులతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ఎట్టకేలకు పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్లాట్ బుకింగ్ లు రద్దు
సీఎం ఆదేశాల మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ అదేశించారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు ఎవరూ అడగొద్దని, కార్డు పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి