Tuesday, January 21, 2025

మహాభారతంలో శునకాల ప్రసక్తి

అక్షరార్చన

మహాభారతం – ప్రథమాశ్వాసము

తగునిది తగదని యెదలో

వగవక, సాధువులకు, పేదవారల కెగ్గుల్

మొగి జేయు దుర్వినీతుల

కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్

నన్నయ భట్టారకుడు

మనం మహాభారత కథా ప్రారంభంలో వున్నాము.

ప్రతిహత శత్రు విక్రముడు, పాండవ వంశ వివర్ధనుడు, వ్రతదీక్షాపరుడు, పాపవిదూరుడు, అనేక యాగాలు చేసి కీర్తి సంపాదించిన వాడు, అపరాజితుడు, బుద్ధికుశలుడు, పరీక్షిన్మహారాజు కుమారుడు, రాజ్యపాలుడైన జనమేజయుడు, ప్రజాసంక్షేమం కోరి దీర్ఘకాలిక యజ్ఞం చేసిన రోజులవి.

Also read: మహాభారత శోభ

ఆ యజ్ఞప్రదేశానికి సారమేయుడనే మగ కుక్కపిల్ల వచ్చి క్రీడిస్తుంటుంది. సారమేయుడు సరమ అనే దేవతల కుక్కకు కొడుకు. ఆ కుక్కను, జనమేజయుని తమ్ముళ్ళైన శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు, కోపంతో చావగొడతారు. ఆ కుక్కపిల్ల ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి జరిగిన సంగతి వివరిస్తుంది. తల్లి సరమ కోపంతో రాజు జనమేజయుని వద్దకు వెళ్ళి ఇట్లా అంటుంది:

“రాజా! జ్ఞానశూన్యులైన నీ తమ్ములు దయావిహీనులై, చిన్నవాడనే ఆలోచన లేకుండా ఎట్టి నేరము చెయ్యని నా కుమారుణ్ఢి పట్టుకొని కోపంతో హింసించినారు.”

“ఎవరైతే ఇది యుక్తము, ఇది యుక్తము కాదు అనే భావన లేకుండా బీదవారికి, నిస్సహాయులకు, మంచివారికీ అపకారం తలబెడతారో, అట్టి నీతిరహితులకు అకారణంగా ఆపదలు సంభవిస్తూనే వుంటాయి.”

సరమ చెప్పిన పై సూక్తియే నేటి పద్యం యొక్క తాత్పర్యం.

ఈ మాట చెప్పి సరమ అదృశ్యమై పోతుంది. ఆ పలుకులు, అట్లా పలికి  కుక్క అకస్మాత్తుగా అదృశ్యం కావడము, జనమేజయునికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్నాళ్ళకు తన  యాగాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళతాడు. అక్కడ కొంతకాలం సుఖంగా గడుపుతాడు. “అకారణంగా ఆపదలు కలుగుతాయి” అంటూ సరమ చెప్పిన మాటలే అతని మనస్సులో సుళ్ళు తిరుగుతాయి. ఆ పలుకులకు ఉపశాంతి చేసే నిమిత్తం తగిన పురోహితుని కోసం గాలిస్తూ, అనేక ముని ఆశ్రమాల చుట్టూ తిరిగి, చివరకు ఒక మునిపల్లెను దర్శించి దానిలో శ్రుతశ్రవసుడనే ఒక గొప్ప మునిని కలుసుకొంటాడు.

“మునివర్యా!  నాకు మీ కుమారుడైన సోమశ్రవుణ్ణి పురోహితునిగా ప్రసాదించండి” అని అభ్యర్థిస్తాడు. ముని అంగీకారంతో సోమశ్రవుణ్ణి తన పురోహితునిగా నియమించుకొని అతనిచే పలువిధాల యాగాలను ఆచరించి “ఉపశాంతిని” పొంది రాజ్యం పాలిస్తాడు.

ఒక కుక్కపిల్లను, రాజు జనమేజయునికి, ఆ కుక్కకు తల్లి యైన సరమ  చేసే ప్రబోధాన్ని, భారత కథా ప్రారంభంలోనే ప్రవేశపెట్టిన ఉదంతమిది.

భారత కథాంతంలో సైతం ఒక శునకం మనకు సాక్షాత్కరిస్తుంది, మహాప్రస్థాన ఘట్టంలో.

పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరుతారు. వెంబడి వస్తామని బయలుదేరిన బంధుమిత్రులను, పురోహితులను,సామాన్య ప్రజానీకాన్ని ధర్మరాజు చెప్పవలసిన మాటలు చెప్పి ఆగిపోవలసిందిగా కోరుకుంటాడు.

ధర్మరాజు, అతని సోదరులు, ద్రౌపదితో బాటు ఒక కుక్క కూడా వారి వెంట నడుస్తుంది.

పాండవులు హిమాలయాలను అధిరోహించి, యోగశక్తితో, ఎట్టి అలసట లేకుండా మేరు పర్వతం చేరుకుంటారు. ఆ పర్వత ప్రాంతాల్లో ద్రౌపది, తన యోగ శక్తి నశించి, తూలి పడిపోతుంది. అర్జునుని పట్ల ఆమెకు గల పక్షపాతమే ఆమె దేహం చాలించడానికి కారణమని ధర్మరాజు తన సోదరులకు వివరిస్తాడు. తక్కిన వారు మరికొంత దూరం సాగగానే సహదేవుడు పడిపోతాడు. విజ్ఞాన గర్వమే సహదేవుని మరణానికి కారణమని ధర్మజుడు పేర్కొంటాడు. మరికొంత దూరం సాగేసరికి నకులుడు కూడా పడిపోతాడు. తాను అపురూప సుందరుడననే అహంకారమే నకులుని నిర్యాణానికి కారణమని ధర్మరాజు భీమార్జునులకు తెలియజేస్తాడు. మరికొంత దూరం తర్వాత అర్జునుడు సైతం పడిపోతాడు. తాను లోకోత్తర వీరుడనని నమ్మే అర్జునుని ఆత్మస్తుతి, ఇతరులను చులకన చేసే బలహీనతలే పార్థుని పతన హేతువులని ధర్మరాజు భీమసేనునికి తెలుపుతాడు. ఇంతలో వృకోదరుడు కూడా తూలి పడబోతూ, తన బలహీనతలెట్టివని అన్నను అడుగుతాడు. “భీమసేనా! అతిగా భుజించడం, భుజబల గర్వమే నీ బలహీనతలు” అంటూ, తనవెంట సారమేయం మాత్రమే రాగా, ధర్మరాజొక్కడే, ముందుకు సాగుతాడు.

Also read: గంగిరెద్దు

ధర్మరాజు మహాప్రస్థానం స్వర్గద్వారం చేరుకుంటుంది. ఇంద్రుడు అక్కడకు వచ్చి తనతో పాటు రథమెక్కి స్వర్గం లోపలికి రమ్మని ధర్మరాజును ఆహ్వానిస్తాడు. ధర్మరాజు తనతో బాటు వచ్చిన సారమేయానికి (కుక్కకు) కూడా ప్రవేశం కల్పించమని ఇంద్రుణ్ణి అభ్యర్థిస్తాడు. కుక్కలకు స్వర్గంలో ప్రవేశం లేదని ఇంద్రుడు నిరాకరిస్తాడు. దానితో ధర్మరాజు ఇట్లా అంటాడు: “భక్తితో కొలిచిన సేవకుణ్ణి వదలిరావడం బ్రహ్మ హత్యాపాతకం. స్వర్గసుఖం కోసం పాపకార్యం చెయ్యలేను. నేనిక్కడే ఒకచోట కూర్చొని తపస్సు చేసుకుంటాను.”

కుక్క రూపంలో ఇదంతా గమనిస్తున్న యమధర్మరాజు ప్రత్యక్షమై, ధర్మరాజు ధర్మనిష్ఠకు, ప్రభుధర్మానికి సంతసించి ఆయనను ప్రశంసిస్తాడు.

యమధర్మరాజు సారమేయం  రూపాన్ని ధరించడం కేవలం ప్రతీకాత్మకం. సింబాలిజమ్.

ద్రౌపదికి, తక్కిన పాండు సోదరులకు గల మానసిక బలహీనతలు ధర్మరాజుకు లేవు. ఆయన ఒక సంపూర్ణ మానవుడు. పర్ఫెక్ట్ హూమన్ బీయింగ్. అట్లే ఆయన వెంట స్వర్గద్వారం చేరుకోగలిగిన కుక్క కూడా సంపూర్ణ జంతువు. అరిషడ్వర్గాలను జయించి, సంయమనంతో జీవన్ముక్తిని సాధించగల ఆత్మశక్తి ధర్మరాజుకు, అతనితో బాటు ఒక కుక్కకు కూడా ఉన్నది. ప్రపంచ సాహిత్యంలో కేవలం ఒక భారతేతిహాసం మాత్రమే, ఇటువంటి అగ్రపీఠాన్ని,  మానవునితో సరిసమానంగా  ఒక జంతువుకు కూడా కల్పించింది.

మహాభారత ప్రారంభంలో కుక్కపిల్ల తల్లి జనమేజయునికి చేసే బోధను మరొక్కమారు స్మరించుకుందాము.

“ఎవరైతే ఇది యుక్తము, ఇది యుక్తము కాదు అనే భావన లేకుండా బీదవారికి, నిస్సహాయులకు, మంచివారికీ అపకారం తలబెడతారో, అట్టివారికి అకారణంగా ఆపదలు సంభవిస్తూనే ఉంటాయి.”

తరతరాలుగా లోకంలో బీదవారికి అన్యాయం,  మంచివారికి, నిస్సహాయులకు, అపకారం జరుగుతూనే వున్నాయి. సరమ అనబడే తల్లి కుక్క జనమేజయునికి చేసే హెచ్చరిక జరగబోయే భారతకథలో పాండవులకు జరిగే అన్యాయం గురించే. ఇది మహాకవులు తమ కావ్యేతిహాసాల్లో వాడుకొనే ఒక రచనావిధానం. రైటింగ్ టెక్నిక్. అంతకన్న ఎక్కువగా,  యుగయుగాల భావి పరిణామాల మానవేతిహాసానికి ఇదొక భవిష్యవాణి.

ఈ మాటలు కుక్క నోటి నుండి చెప్పించడంలో కూడా ఒక సందేశం దాగి వుంది. అది ఏమిటంటే, పరాత్పరుని హృదయంలో, మానవునికి ఏ స్థానం ఉన్నదో, జంతువుకు కూడా అదే స్థానం ఉన్నది. స్వర్గమనే ముక్తి ద్వారంలో ప్రవేశించడానికి  మానవుల నడుమ తేడాలు లేవు. మానవునికీ, జంతువుకు మధ్య కూడా తేడాలు లేవు.

Also read: మహాభారతం అవతారిక

జనమేజయుని తమ్ములు యజ్ఞం జరుపుతున్న ప్రదేశంలో సారమేయాన్ని కరుణావిహీనులై హింసించినట్లే, ఇప్పటికీ అనేకులు కుక్కలను అనాలోచితంగా హింసిస్తూనే ఉంటారు. దాన్ని సృష్టికర్త ఏ ఉదాత్తమైన తలంపుతో సృష్టించినాడో వారికి బోధపడదు. ఇటువంటి అనాలోచిత హింస ఎంత మాత్రం తగదని భారతసంహిత బోధిస్తున్నది.

తోడేలు జాతికి చెందిన కుక్క పదహైదు వేల యేండ్ల క్రిందటే మానవునిచే మచ్చిక కాబడి, అతని ఆత్మబంధువుగా రూపాంతరం చెందింది.

యూరోప్ ఖండంలో పద్ధెనిమిదవ శతాబ్దం చివరా, పంతొమ్మిదవ శతాబ్దం తొలి రెండు దశకాలలోనూ జగద్విజేతగా పేరుగాంచిన నెపోలియన్ జీవితంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం వున్నది. ఎమిల్ లుడ్ విగ్ రచించిన “నెపోలియన్” అనే గ్రంథం ఈ ఉదంతాన్ని రసవత్తరంగా చిత్రించింది.

ఒకానొక యుద్ధంలో నెపోలియన్ శత్రువులు పరాభవం చెందుతారు. యుద్ధం ముగిసిన పిమ్మట రణరంగంలో పేరుకున్న ఉభయ సైన్యాల పీనుగలను  నెపోలియన్ పర్యవేక్షిస్తూ తిరుగుతుంటాడు. అక్కడొక  శత్రుసైనికుని విగత దేహం వద్ద కూర్చుని అతని పెంపుడు కుక్క  దీనంగా, బిగ్గరగా ఏడుస్తుండడం నెపోలియన్ దృష్టిని ఆకర్షిస్తుంది.

సూర్యాస్తమయం దాటి చీకటి పడినాక కూడా నిద్రాహారాలు మాని ఆ కుక్క రోదిస్తుండడం చూసి నెపోలియన్ జాలిపడతాడు.

అతడంటాడు:

“నా జీవితమంతా యుద్ధాల్లోనే గడిచింది. వందలాదిమంది యోధానుయోధులు నా కట్టెదుటనే రాలిపోవడాన్ని, నిర్లిప్త స్వాంతంతో, ఉదాసీనభావంతో చూడడానికి అలవాటు పడినవాణ్ణి”.

“కానీ నేడీ మూగజంతువు తన యజమాని కోసం విసుగు విరామంలేక రోదించడం నన్ను కదిలించింది. దాని దుర్భర రోదనాగళం తన యజమానిని చంపిన దుర్మార్ఖునిపై పగ తీర్చుకుంటానని శపథం చేస్తున్నట్లుగా వున్నది. నేనే ఆ హంతకుణ్ణని ఆ కుక్కకు తెలియదు. తెలిస్తే బహుశా నన్నది చీల్చి చెండాడేది. ఒక్కసారిగా దాని ఆక్రందన నా గుండెలను తడిమి, మొట్టమొదటి సారి యుద్ధభూమిలో నా కన్నులు చెమర్చినవి.”

ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో జాక్ లండన్ అనే అమెరికన్ రచయిత రచించిన “కాల్ ఆఫ్ ది వైల్డ్” అనే ప్రసిద్ధ నవల వెలువడింది. జాక్ లండన్ తన వ్యక్తిగత అనుభవాలు ఆధారంగా చేసుకొని రచించిన నవలల్లో యిది ఒకటి. నా బాల్యంలో దీని తెలుగు అనువాదం మా వూరి బ్రాంచి లైబ్రరీలో చదివినాను. కొన్నేళ్ల పిమ్మట ఈ నవల ఆంగ్ల మూలం కూడా లభించి పదేపదే చదివినాను.

ఇరవయ్యవ శతాబ్దం ఉదయించడానికి ముందు అలాస్కా దీవిలో లభ్యమయ్యే బంగారు నిధులకోసం అనేకమంది అమెరికన్ సాహసికులు పోటీ పడేవారు. మంచుతో నిండిన అలాస్కాలో ప్రయాణం కోసం స్లెడ్జ్ బండ్లు వాడతారు. ఈ బండ్లను కేవలం కుక్కలు మాత్రమే నడపగలవు.

ఒక్కసారిగా అమెరికాలో కుక్కలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. మంచి పెంపుడు జాతి కుక్కలను దొంగిలించి అమ్ముతుంటారు.

Also read: ఎవరి కోసం?

మిల్లర్ అనే సంపన్నుడైన న్యాయమూర్తి వద్ద బక్ అనే జాతి కుక్క వుంటుంది. అతని  రాచసౌధంలో భోగభాగ్యాలతో, ముద్దు మురిపాలతో పెరుగుతుంటుంది. ఆ కుక్కను, జడ్జీ సేవకునికి లంచమిచ్చి, ముష్కరులు కొందరు దొంగిలిస్తారు. ఎంతో గారాబంతో పెరిగిన శునకాన్ని దుడ్డు కఱ్ఱలతో విపరీతంగా హింసించి లొంగ దీసుకుంటారు. ఒకరి నుండి ఒకరికి అది అమ్ముడు పోతూనే వుంటుంది. ఏ యజమానీ దాన్ని సరిగ్గా చూడడు. కండలరిగేటట్లు దాన్ని వాడుకోనే వారే అందరూ.  ఇట్టి కఠిన వాతావరణంలో బక్ ఆపాదమస్తకం మొద్దుబారుతుంది. వైరి కుక్కలతో నిరంతరంగా పోరు సలుపుతూనే వుంటుంది. బలవంతునిదే రాజ్యం అనే సూత్రాన్ని ఒంటికి పట్టించుకుంటుంది.

పలువురు యజమానులచే దారుణంగా హింసింపబడి మృత్యుముఖంలో వదలివేయబడ్డ ఆ కుక్కను థార్ట్టన్ అనే దయామయుడు రక్షించి దగ్గిరికి తీస్తాడు. అతని ఆలనాపాలనలో బక్ ఆరోగ్యవంతురాలౌతుంది. అప్పటి నుండి థార్న్టన్ నే నమ్ముకొని బక్ సేవ చేస్తుంది. చివరకు అలాస్కా భూగర్భంలో ఆ యజమానికి కావలసినన్ని స్వర్ణ నిధులు దొరుకుతాయి.

ఒకసారి బక్ ఆ గనుల వద్ద లేని వేళ, దాని యజమాని థార్న్టన్ను అతని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేస్తారు. తిరిగి వచ్చిన బక్ వారిపై ఎగబడి  వారందరినీ చీల్చి చంపి పగ తీర్చుకుంటుంది.

అప్పటికే ఆ కుక్కకు ఒకానొక్కప్పుటి శునక జాతికి మూలమైన తోడేలు లక్షణాలు   పొడసూపడం మొదలౌతుంది. యజమాని చనిపోయినాక  అలాస్కాయే దాని ఆవాసమౌతుంది. ఆక్కడి తోడేళ్ళే దాని బంధువులౌతారు. ఆ తోడేళ్ళతో బాటు సంచరిస్తూ, కనపడిన ప్రతి శాత్రవుణ్ణీ దారుణంగా బక్ చంపుతూనే వుంటుంది.

కానీ, తన జీవితాంతం, ప్రతి సూర్యాస్తమయవేళ, తనను దయతో చేరదీసిన థార్న్టన్ అనే యజమానిని దుండగులు ఒకప్పుడు హత్య చేసిన స్థలానికి వచ్చి, తృప్తి తీరా ఆ యజమానిని స్మరిస్తూ దిక్కులు నినదించే  లాగు రోదిస్తూనే వుంటుంది.

అద్భుతమైన శైలితో, కాల్పనిక వైభవంతో, ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత ప్రసిద్ది పొందిన నవల ఇది. తన రచనల ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా లెక్కలేనంత సంపద గడించిన రచయిత జాక్ లండన్.

ప్రతిదినం ఉదయం అరగంట పాటు నా నివాసప్రాంతంలో వాహ్యాళికి పోవడం  అనేక ఏళ్ళ నుండి అలవాటు నాకు. వాహ్యాళి వెళ్ళే త్రోవలో అనేక వీధి కుక్కలు తారసపడతాయి. ప్రతి కుక్కను కళ్ళతో పలకరిస్తాను. పలు కుక్కలు గుర్తింపుగా చూస్తాయి.  వాటి కదలికలు, అలవాట్లు, శ్రద్ధగా గమనిస్తుంటాను.

కుక్కలు ఆహారం కోసం వెదకడం, బద్ధకించడం, ఆవులించడం, ధూళిలో శరీరాన్ని దొర్లించడం, వళ్ళు విదిలించుకోవడం. కుడిపాదంతో నేలను పదేపదే రాయడం, ఒక కుక్క, మరొక కుక్కతో ఆడుకోవడం, దేహం రాసుకుంటూ తిరగడం, ఒక ఆడకుక్క కోసం అనేక మగకుక్కలు భీకరంగా పోరాడుకోవడం, ఎంగిలాకుల కోసం పెండ్లి పందిళ్ళ వద్ద ఘర్షించడం, ముద్దుగొలిపే ఐదారు చిన్నచిన్న కుక్కపిల్ల లోకేసారి ఆతురతతో తల్లి  పొదుగుల నుండి పాలు జుఱ్ఱుకోవడం, దయతలచి ఎవరైనా తల్లి అన్నం పెడితే కృతజ్ఞతాసూచకంగా తోకలూపుతూ, గబగబా ఆ తిండిని మెక్కడం, బహిరంగ కాపురాలు,  వీధి మైథునాలు,  ఇవన్నీ మనమందరమూ చూసే తరతరాల ఊర కుక్కల దైనందిన చర్యలే.

అప్పుడప్పుడూ కార్పొరేషన్ అధికారులు వచ్చి వాన్లలో ఈ వీధి కుక్కలను పట్టుకొని పోతుంటారు. బంధింపబడిన వాన్లలో అర్ధం గాని గమ్యానికి పోతున్నంతసేపు తాము వీడిపోతున్న వీధి వైపే ఆ కుక్కలు జాలిగా చూస్తూ వుంటాయి. మరునాడు కుక్కలులేని వీధులన్నీ శూన్యంగా గోచరించి మనసు తల్లడిల్లుతుంది. ఇట్లా తీసుకొని పోయిన కుక్కలను ఇటీవలిదాకా సామూహికంగా వధించేవారు.

చలికాలం వెచ్చని ఎండలో వీధి కొసన ఈ కుక్కలు నిర్బయంగా నిద్రపోతుంటాయి.   వేగంగా పోయే వాహనాలచే ప్రమాదం జరుగుతుందేమో నన్న ఆందోళన వాటికి కలగదు.  మృత్యుశకటం క్రింద పడి వీధి కుక్కలు దారుణంగా చచ్చిపోవడం పరిపాటియే. అట్టివేళల మృత జీవుల నెత్తురుతో తడిసి ఎఱ్ఱగా మారిన రహదారి అస్తమయ సంధ్యవలె  మెరవడమూ తరుచూ కనపడే దృశ్యమే.

ఉదయం వాహ్యాళికి వెళుతున్నప్పుడు పలు పెంపుడు కుక్కలు కూడా  దర్శనమిస్తాయి. గొలుసులతో బంధించి యజమానులు వాహ్యాళికై  తీసుకొని వచ్చే ఈ సీమకుక్కలు, తిండి పుష్టి గలిగి, మందగమనంతో, భీకరస్వరూపంతో వీధి గుండా వెళుతున్నప్పుడు, వీధి కుక్కలు అసూయతో, భయంతో, దూరదూరంగా వుండి వాటివైపు చూస్తాయి. ఒక్కసారిగా ఆ వీధి కుక్కలన్నీ కలిసి  మొరగడం ప్రారంభిస్తాయి. ఆ సీమకుక్కలు  తమవైపు  ఒక్కసారి ఓరగా చూడగానే మొరగడం మానివేసి చెల్లాచెదురై పోతాయి.

ఈ వీధికుక్కలన్నీ నిరుద్యోగులు. నిరుపేదలు. స్వేచ్ఛ అనే సంపద కూడబెట్టుకున్న అనాథలు. ఇందుకు భిన్నంగా పెంపుడు కుక్కలన్నీ, తమతమ రూపాన్ని, జాతినీ, పూర్వీకుల ఖ్యాతిని బట్టి తమ స్థాయికి తగ్గ ఉన్నతమైన స్థానం సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డ అదృష్ట జీవులు. వీటికి స్వేచ్ఛ వుండదు. ఇష్టమొచ్చినట్లు తినడానికీ, తిరగడానికీ, వీలులేదు. అవెప్పుడూ గంభీరంగా, తదేకంగా తమ పరిసరాలను చూస్తుంటాయి.

ఇవిగాక పోలీసు సర్వీసులోనో, సైన్యంలోనో ఉన్న జాగిలాలు. అగ్రజాతి కుక్కలివి. చక్కని  శిక్షణ గడించి సమాజం కోసం ఏ సాహసానికైనా సిద్ధం చేయబడిన జాగిలాలు. ఇవి ప్రాణత్యాగం చేసినపుడు సైనికులతో బాటు ఈ కుక్కలను కూడా స్మరించి, దేశం బిరుదులు ప్రసాదిస్తుంది.

ఊరకుక్కలైనా,సీమకుక్కలైనా; కుక్కలన్నీ, ఒకే గర్భాన తొలిసారి జన్మించినవే.  ఇవన్నీ లక్షలాది యేండ్లు కారడవుల్లో జీవించినవే. తిండికోసం ప్రత్యర్థులతో పోరాడినవే. వేటాడడానికి, చంపడానికి, తిండి సంపాదించడానికి, ఈ మూగజీవులకొక అద్బుతమైన దేహనిర్మాణం, దంత నిర్మాణం, సృష్టి ప్రారంభమైన పుణ్యక్షణాల్లో ప్రకృతి వరంగా ప్రసాదించింది.  కాలానుగుణ్యమైన కొన్ని  మార్పులతో అలనాటి  సృష్టి నిర్మాణం ఇప్పటికీ పరిపాటిగా కొనసాగుతూనే వున్నది.

కర్ణునికి కవచకుండలాల వంటి  అనన్యమైన దేహ నిర్మాణంతో, తమ అవసరాన్నీ, తమ సాహసాన్నీ ప్రదర్శించగల అవకాశం కోసం ఈ జీవులు ఎదురు చూస్తూనే వుంటాయి.

“మృత్యువంటే భయాన్ని జయించిన వాడే నిజమైన మానవుడు” అంటాడు ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత, మేధావి, రాజనీతి కోవిదుడు, ఆండ్రీ మాల్రో. చావు అంటే  భయపడేవారే మానవలోకంలో మనకు తరుచూ కనబడతారు. కుక్కలీ ప్రాణ భీతిని అతి సులువుగా జయిస్తాయి.

ఆకలి అన్ని జీవులకు సాధారణం. అరణ్యాల్లో జీవించే కుక్కలు తమ శక్తి యుక్తులు ఆహారం గడించడం కోసం ధారపోస్తాయి. మానవుడు మచ్చిక చేసుకోవడం మొదలైనప్పటి నుండి, కుక్కలకు ఆహారం కోసం పోరాడవలసిన అగత్యం తొలగిపోయింది. దానితో తమ సర్వశక్తులు, తనకు ఆహారం, వసతి, కల్పించిన మానవునికై వెచ్చించడం మొదలైనది. పెంపుడు కుక్కలకున్న ఈ భరోసా వీధి కుక్కలకుండదు. మానవ జీవన కాలమానంతో పోలిస్తే, కుక్కలు అతి స్వల్పకాలం బ్రతుకుతాయి. వాటి జీవన కాలం పది పన్నెండు సంవత్సరాలు మించి వుండదు. ఆ స్వల్పజీవన కాలంలో అవి చేసే ప్రతి సాహసకృత్యము అపురూపంగా కనిపిస్తుంది. సాంఘికంగా ఎంతో కలివిడిగా ఉండడం, మానవజాతిని గుడ్డిగా విశ్వసించడం, నిర్బయత్వాన్ని కలిగి వుండడం ఇట్టి లక్షణాలు విలియమ్స్ సిండ్రోమ్ వల్ల లభ్యమౌతాయని చదివినాను.

ఒక నటుడు నటనలో లీనం కావడం, ఒక చిత్రకారుడు తాను చిత్రించే చిత్రంతో మమేకం కావడం, ఒక కవి కావ్యానుభూతిలో ఐక్యం కావడం, ఒక గాయకుడు తన గానలహరిలో తేలిపోవడం ఎటువంటిదో, యుద్ధరంగంలో ఒక సైనికుడు ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో ఆనందం పొందడం, ఒక జాగిలం సైతం అవసరం పడినప్పుడు సాహసంతో ప్రాణత్యాగం చెయ్యడంలో ఆనందం పొందడం కూడా అటువంటిదే. ఇట్లా చెయ్యడంలో సైనికుని పాత్రను పోషిస్తుంది జాగిలం కూడా.

తన్ను తాను విస్మరించే పరవశస్వభావం, వెనుదీయని సాహస గుణం కుక్కలకు స్వాభావికం.  ఇట్లా చెయ్యడంలో ఆ మూగజీవులొక ఆనందాతిశయాన్ని పొందుతాయి. ఈ మనస్తత్వాన్ని జాక్ లండన్ తన “కాల్ ఆఫ్ ది వైల్డ్” నవలలో ఇట్లా వర్ణిస్తాడు:

“There is an ecstacy that marks the summit of life and beyond which life cannot rise. And such is the paradox of living, this ecstacy comes when one is most alive, and comes as a complete forgetfulness that one is alive”.

“This ecstacy, this forgetfulness of living comes to the artist, caught up and out of himself in a sheet of flame; it comes to the soldier, war-mad in a stricken field and refusing quarter; and it came back to Buck, leading the pack, sounding the old wolf-like cry, straining after the food that was alive and that fled swiftly before him through midnight”.

మహాభారతంలో ధర్మజుడు, సారమేయము, ఒకే వేదికపై దర్శనమిచ్చినట్లే, అల్లసాని పెద్దన మనుచరిత్రంలో సైతం రాజు స్వరోచి, ఒక చిన్న ఉడుపకుక్క, ఒకే సందర్బంలో కలగలిసి కనబడతారు. మను చరిత్ర చతుర్థాశ్వాసంలో స్వరోచి వేటకు వెళ్ళే ఘట్టం లోనిదిది. ఆ వెళ్ళేది ఒక భీకర దుర్గమారణ్యం. దాదాపు నలభై ఐదు పద్యాలు, రెండు సుదీర్ఘ వచనాలతో, మృగయా వినోదానికి, రాజుతో బాటు,  గుఱ్ఱాలు, కుక్కలు, డేగలు, సైనికులు, బోయలు కలిసి వెళతారు. కవితా పితామహునిచే కళ్ళకు గట్టినట్టు, ఉత్కంఠభరితంగా, ఈ ఘట్టం వర్ణింపబడింది.

వేటకు వెళ్ళడానికై రాజ సన్నిధికి తీసుకొని వచ్చిన కుక్కల వర్ణన చూడండి:

ఇవి కంఠపాశమ్ము లింత డుస్సిన మీద

బడి దిశాకరినైన గెడపజాలు

నివి మింట పఱచు పక్షీంద్రు జూపిన నీడ

బడి వాలునం దాక పఱవజాలు

నివి గాలి గనిన మూక వరాహ దనుజేంద్రు

నైన జుట్టెంటిలో నాగ జాలు

నివి కాటు గొల్పిన వృద్ధ కూర్మము వీపు

చిప్పైన నెరచి కై చింపజాలు”

ననగ ఘర్గర గళ గర్త జనిత భూరి

భూ భృదురుబిల భరిత భౌభౌ భయంక

రార్బటీ దీర్ణ దిగ్భిత్తులగుచు చెలగె

సరివెణల పట్టి తెచ్చిన జాగిలములు”

స్థూలంగా పై పద్యం అర్థమిది: “ఈ కుక్కలు తమ కంఠానికి వేసిన గొలుసులను కొంచెం సడలించితే చాలు, సాక్షాత్తూ దిగ్గజాలనే మీదబడి చంపుతాయి. ఈ కుక్కలు ఆకాశంలో వేగంగా పోయే గరుడ పక్షులను కొంచెం చూపుతే చాలు, వాటి నీడల వెంబడే అవిపోయినంత దూరం అదే వేగంతో పరుగెత్త గలవు. ఈ కుక్కలు కొంచెం వాసన చూపితే చాలు పంది రూపం ధరించిన మూక వరాహ రాక్షసేంద్రుణ్ణి అడ్డగింపగలవు. ఆది కూర్మం వీపు చిప్పనైనా ఈ కుక్కలు చీల్చి చెండాడి దాని మాంసం భుజింప గలవు”.

“ఇంతటి సామర్థ్యం మాకున్నది అని భౌభౌ అనే భయంకరమైన తమ శబ్దాలతో చాటిచెబుతూ, బలమైన గొలుసులు మెడలకు బిగించిన భీకర జాగిలములు సేవకుల వెంట రాజ సన్నిధికి వచ్చినవి”

సైన్యం, బోయీలు, జాగిలాలు కలిసి అడవిపందులు,  ఖడ్గమృగాల వంటి జంతువులను వేటాడితే, చక్రవర్తి స్వరోచి జింకలు మొదలుకొని పెద్దపులి దాకా వేటాడతాడు.

ఇవన్నీ ఒక యెత్తయితే,  ఒక  ఉడుపకుక్క చేసిన సాహసం రాజునే ఆశ్చర్యపరుస్తుంది.

ఉడుపకుక్కలు పరిమాణంలో చిన్నవి. చిన్న ఉడుములనే పట్టుకోగలవు. అట్టిది, ఒక చిన్న ఉడుపకుక్క గుహలోకి దూరి, చీకటిలో ఉడుముగా భ్రమించి, పొట్ట పెంజర అనే పెద్ద విషసర్పాన్ని పట్టుకుంటుంది. గుహనుండి బయిటకు దాన్ని తెచ్చి పగటి వెలుగులో పెద్ద విషసర్పమని తెలుసుకుంటుంది. కానీ వెనుదీయక, రాజు సమక్షంలోనే,  ఆ సర్పాన్ని ముక్కలుగా చీల్చి చంపుతుంది. ఆ సాహసం చూసి రాజు సైతం అవాక్కయి పోతాడు. ఒక చిన్న కుక్క  పెద్ద విషసర్పమని తెలిసి సాహసం చేయడం, దాని నుండి పారిపోయేబదులు, దాన్నే  నరికి ముక్కలు చేయడం రాజు స్వరోచికి ఒకవైపు ప్రమోదము, మరొకవైపు విషాదము కలిగిస్తాయి. ఆ పద్యాన్ని క్రింద పఠించగలరు:

పరవస మొప్ప గాలి తడబాటు మెయిం గవి దూరి యొక్క కు

ర్కురము తమంబులో వెరజి కోఱలచే కబళించి పొట్ట పెం

జెరను ఉడుమంచు తెచ్చి కని, చేవ దొరంగక త్రుంచి వైచె,

ద్గురు బిరుద ప్రమాదములకున్   పతి మోద విషాదశాలి గాన్!

భారతసంహిత అర్జునుణ్ణి లోకోత్తర వీరునిగా చిత్రీకరిస్తే, ధర్మరాజును ఉత్తమోత్తమ మానవునిగా చిత్రీకరించింది. భూతలసృష్టిని నిర్వికార చిత్తంతో, సమ్యక్ దృక్పథంతో వీక్షింపగలవాడు ధర్మజుడొక్కడే. మహాప్రస్థానానికి పాండవులతో బాటు రావడానికి సిద్ధమైన బంధుమిత్రులను, పౌరులను, ధర్మరాజు నివారిస్తాడు.  స్వర్గారోహణ చేయగల అర్హత, యోగశక్తిన వారికి లేక పోవడమే ఇందుకు కారణం. ఇదే ధర్మరాజు తమను మౌనంగా అనుసరించిన ఒక సారమేయాన్ని మాత్రం అనుమతిస్తాడు. స్వర్గ ద్వారాన్ని చేరగల అర్హత, యోగశక్తి కుక్కకు సహజంగా ఉండటమే ఇందుకు కారణం. తమతమ వ్యక్తిగత బలహీనతలచే యోగశక్తి నశించి ద్రౌపది, నలుగురు సోదరులు, మార్గమధ్యంలో పడిపోతారు. ఒక్క కుక్క మాత్రం ధర్మజునితో బాటు స్వర్గద్వారం చేరుకోగలుగుతుంది. ధర్మజుడు, యమధర్మరాజు అంశచే జన్మించిన వాడైతే, సారమేయం సాక్షాత్తు యమధర్మరాజుకే ప్రతిరూపం. ఇద్దరూ ధర్మానికి ప్రతినిధులు.

మహాభారత సంహిత ధర్మరాజును ఒక ఆదర్శ మానవునిగా నిరూపింప దలచినట్లే, సారమేయాన్ని కూడా ఆదర్శ జంతువుగా ఋజువు చేయదలచిందని, మహాప్రస్థాన ఘట్టం ద్వారా మనకు విశదమౌతున్నది.

పాండవుల తరం గతించి జనమేజయుని తరం వచ్చే సరికి, ధర్మస్వరూపమైన ఇదే సారమేయాన్ని జనమేజయుని సోదరులు అకారణంగా హింసిస్తారు. అనగా కలియుగంలో ధర్మం హింసింపబడుతుందని పఠితలు అర్థం చేసుకోవలసి వుంది.

జనమేజయుని సోదరుల నామధేయాలను చూడండి! ఒకడు ఉగ్రసేనుడు, ఆగ్రహానికి అతడు ప్రతీక. మరొకడు భీమసేనుడు. భుజబల గర్వానికి, తిండిపోతు తనానికి అతడు ప్రతీక. ఇంకొకడు శ్రుతసేనుడు. కేవలం వినికిడి విద్య (శ్రుత) తప్ప ఇంకేమీ లేని  అవిద్యాపరుడు. అబోధోపహతులు వీరు ముగ్గురూ. క్షీణ మానవ యుగ ప్రతీకలు.

“ఆకలి” ప్రతి జీవికీ ప్రాధమిక అవసరం. ఇది తప్ప మరే ఇతర బలహీనత  శునకజాతిలో గోచరించదు. తమ ఆకలి తీర్చే మానవజాతిపై శునకజాతి చూపించే విశ్వాసం సాటి మానవుడు సైతం ప్రదర్శింపలేనిది. విశ్వాసానికి కుక్కయే కొలబద్ద.  అట్లే ధర్మాధర్మ విచక్షణకు, నిర్బయానికి, అపూర్వ సాహసానికి, కర్తవ్యపాలనకు సైతం శునకమే ఉత్తమోత్తమమైన ఆదర్శం.

మానవాళికి కుక్కకన్న గొప్ప ఆప్తబంధువు ప్రాణికోటిలో మరెవరూ కానరారు. సారమేయం  నిష్కామ కర్మయోగి. ఈ సత్యాన్ని ప్రాచీన భారతీయ నాగరకతతో బాటు ప్రాచీన ఇరానియన్ నాగరకత కూడా గ్రహించింది. ఈ శునకజాతిలో  దాదాపు ఎనభై శాతం దాకా  అలనాపాలనా లేని ఊరకుక్కలు. ఇవి సరియైన తిండి లేక, రోగాలు, రుజనాల బారిన పడడం, అనాథలుగా బ్రతుకును వెళ్ళబుచ్చడం దురదృష్టకరం.

దిక్కులేని మూగజీవులపై జాలిదలచి వాటిని కన్నబిడ్డల వలె చేరదీసే దయామయులెందరో మనలో వున్నారు.  ఆ అనాధ రక్షకులకు మనమంతా ఋణపడి వున్నాము.

Also read: మహాభారతం అవతారిక

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles