(మా తాత రాసుకున్న పాత డైరీ వాసన)
మా అమ్మ నాన్న చిట్టెళ్ళ నరసింహమూర్తి ఉత్తరాంధ్ర లోని విజయనగరం నుండి మధ్య భారతం, ఈనాటి చత్తీస్‌గఢ్ రాజధాని నగరం అయిన రాయపూర్ కి వలస వెళ్ళారు. ఐదుగురు పిల్లల్లో రెండో కుమార్తె అనూరాధ, మా అమ్మ. ఆ కుటుంబానికి జీవనాధారం పౌరోహిత్యం. ఆయన 80వ దశకంలో ఢిల్లీలో మండా నరసింహమూర్తి ఇచ్చిన డైరీ లో కొన్ని విషయాలు అపురూపంగా రాసుకున్నారు. అది అలహాబాదుకి చెందిన ఒక వ్యాపార సంస్థ డైరీ. కుటుంబ వ్యవహారాలు, కూతుర్లు, కొడుకుల సంగతులు, ఇంటి ఖర్చులు తదితరాంశాలు అందులో ఉన్నాయి. ఐతే, అంతమాత్రంలో అదేదో అద్భుతమైన విషయం కాదు. అందులోనూ నాగరిక సమాజానికి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసినప్పుడు ఒక బీద సంసారి రాసుకున్న కాగితం ముక్కలకి ఏమంత విలువుంటుందీ?
మనిషి జీవితంలో గడిచిన ప్రతిక్షణం గతంలో భాగమే. అందులో కొంతవరకే చరిత్రగా నమోదు అవుతుంది. మిగిలినదంతా కాలగర్భంలో కలిసి పోతుంది. అలా నలభై ఏళ్ళ క్రితం మా తాత రాసిన ముప్పై పేజీల ఈ డైరీ నా కంటబడి దాదాపు ఇరవై ఏళ్ళవుతోంది. ముఖ్యంగా ‘దక్షిణ యాత్ర ఎలాగున చేసితినో రాస్తున్నా’ అంటూ వరుసగా నాలుగు పుటలు రాసారు. దక్షిణాది అంటూ ఆయన పేర్కొన్నది నిజానికి చాలా కొంత భౌగోళిక ప్రాంతం మాత్రమే. అయినప్పటికీ నా ఉత్సుకతకి కారణం లేకపోలేదు!
నేను పుట్టే నాటికి మా తాత అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు. 24.07.1987 ఉదయం చి. సౌ. రాధకు మగపిల్లాడు పుట్టాడని డైరీలో రాసారు. అంతేకాక, యాత్ర వివరాలు రాస్తూ ‘అమర్‌నాథ్ యాత్ర చాలా కష్టమైనది’ అని రాసారు. అందులో ఉన్న మరో విశేషం, 14. 8. 1987 న ‘అమర్’ని ఉయ్యాల లో వేశారు” అని నోట్ చేసారు. నా మొదటి పేరు ‘అమర్’ గా అలా తాత తన యాత్రలోనే పెట్టేసారు. తర్వాత కొద్ది కాలం అనేక పేర్లతో పాటు అమర్ పేరిట కూడా రచనలు చేసాను!
ఓం ప్రథమంగా శ్రీరాములుతో ప్రారంభించిన ఆయన ఉమాశంకర్ శుక్లా బాడా అడ్రసుతో తెలుగు సంవత్సరాల పేర్లు, మనుమలు పుట్టిన తిధివార నక్షత్రాల నుండి ఇంట్లో కుట్టు మిషను కొన్న తారీఖు, ఇల్లు మారిన తేదీ, మృత్యుంజయ మంత్రంతో మొదలెట్టి భుంగ పంచకం, లక్ష్మీ గణపతి మూల మంత్రం, ఇంకా బదరీ కేదర్ యాత్ర గురించి కూడా ఆయన రాసుకున్నారు. మనలో ఎంతోమంది లాగానే డైరీ రాయడాన్ని కొనసాగించలేకపోయారు. ఐనప్పటికీ నా వరకూ నాకిదో విలువైన Documentation గా పనికొచ్చేదే!
ఏయే తేదీల్లో ఏయే ఊర్లకి చేరి అక్కడ ఉండి వెళ్ళారో రాసుకున్నాయన, ఈ నాలుగు పుటల్ని పూర్తి చేసి ఇట్లు ‘చిట్టెళ్ళ నరసింహమూర్తి’ అంటూ సంతకం చేసారు. చాలా క్లుప్తంగా అయినా ఒక వలస కుటుంబ వాసనలతో తిరిగి తెలుగు ప్రాంతాన్ని కొత్త కళ్ళతో పరికించి ఔద్వేగానుబంధంతో తన అనుభూతులు అక్షరాలుగా మలిచిన తాత ఆలోచనలకి ఆ మేరకు గౌరవం కల్పిస్తూ ఆయన స్వహస్తాలతో రాసిన నాలుగు పుటల్ని ఇలా పేర్కోవడమే మార్పులకు లోనవుతున్న పాత కొత్త తరాల స్రవంతులకి నేనిచ్చే నివాళిగా భావిస్తున్నాను!
అప్రస్తుతం కాదు కనుక ఇక్కడే మరొక విషయం చెప్పుకోవాలి. మా అమ్మ వాళ్ళ నాన్న చిట్టెళ్ళ నరసింహమూర్తి, మా అమ్మమ్మ లక్ష్మీ విలాసం. అలాగే మా పితామహులు, నాన్న తల్లిదండ్రులు మేకా కృష్ణమూర్తి, నాన్నమ్మ కృష్ణవేణి, వీరిది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం రాజాం, పార్వతీ పురం. తాత పొట్టపట్టుకుని మద్రాసు వెళ్ళి అక్కడ చాలాకాలం ఉన్నారు. ఫార్మసిస్ట్ గా ఆయనకి కిర్లంపూడి షుగర్ మిల్స్ లో వచ్చిన ఉద్యోగం కోసమే గోదావరి జిల్లాకు రావడం జరిగింది. తర్వాత ఆ ఫ్యాక్టరీని పిఠాపురానికి తరలించడం జరిగింది. పిఠాపురంలో శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత ఫ్యాక్టరీ ఇదే!
అలా ఉత్తరానున్న నాటి మధ్యభారతం నేటి చత్తీస్‌గఢ్ కీ, దక్షిణ ద్రావిడ ప్రాంతమైన మద్రాసు రాష్ట్రానికి ఉత్తరాంధ్ర నుండి వలసపోయిన రెండు కుటుంబాల చిహ్నాలు చిన్నప్పటి నుండి మా కుటుంబంలో ఉన్నాయి. సంస్కారం మన సంస్కృతి లోని సంకర స్వభావం వల్లనే అబ్బుతుంది. బహుళ బతుకుల మేళవింపుతో గుభాళిస్తుంది. అలా, భిన్నత్వానికి తలుపులు తెరిచే ధోరణికి మానవాళి రాగలగడమే అసలైన ఆధునికత అంటాన్నేను!
Also read: కొన్ని తరాలు – కొన్ని స్వరాలు
ఛాందస సాంప్రదాయ వాసనలతో బీదరికపు ఛాయల్ని మోసుకుని వలసపోయిన అలనాటి ఇరు కుటుంబాల నీడల్లోనే నా బాల్యం గడిచింది. ఒకపక్క అక్కరకురాని గొప్ప వార సత్వం, మరోపక్క మార్పుకు మాధ్యమంగా మారిన వ్యవస్థలో ఆధునిక వైనాలు, మొత్తంగా కలగలిసి భయంకరమైన దరిద్రాన్ని ఈ దేశ ప్రజలకు అంటకట్టాయ్. భౌగోళికంగా, భౌతికంగా, బౌద్ధికంగా దశాబ్దాల పాటు కొనసాగిన బీదబ్రతుకులకి మూలం ఇదే!
Social & Culture Privilege ఉన్న ఇలాంటి కుటుంబాలే కాక పాత పద్ధతులను ధిక్కరించి ఉనికి కోసం ఊర్లు దాటిన కోట్లాది మంది కథల వ్యధలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా, ఈ దేశ మూల వాసులు, దళిత బహుజన ఆదివాసీ మైనారిటీలకి ఈ స్పృహ పెరగాల్సి ఉంది. అంటరాని వసంతం అన్నట్లు “తవ్వాల్సిందీ పూడ్చాల్సిందీ చాలా ఉంది.” ఆ క్రమంలో సాంస్కృతిక ఒత్తిళ్ళకి లోనైన ఒక సగటు వ్యక్తి వృద్ధాప్యంలో చేసిన చిన్న యాత్ర తాలూకా ఊసులుగా వీటిని రికార్డు చేయడం అవసరం అనిపించింది!
Also read: గదర్ పార్టీ వీరుడు దర్శి చెంచయ్య, పిరికితనం ఆయన రక్తంలోనే లేదు!
త్వరలోనే కనుమరుగు కానున్న తాత డైరీని గురించి నాలుగు మాటల పరిచయంతో ఈ కొద్దిపాటి పుటల్ని ఇలా ఫొటో తీసిందందుకే. ఒకనాడు మనుషులతో మమేకం కావడం పొట్టకూటి కోసం కొత్త ప్రదేశాలకు ఇద్దరు చేసిన ప్రయాణం, తర్వాత కాలంలో నేను చేస్తున్న అవిశ్రాంత ప్రస్థానానికి, కుటుంబంలో అప్రయత్నంగానే కొనసాగుతూ వచ్చిన దేశ దిమ్మరితనానికి ఒకానొక ప్రేరణ కాగలిగిందనేదే నా భావం, అందుకే ఈ కార్యం!
(అత్యుత్సాహంతో పదిహేనేళ్ళ క్రితం నేను అమర్‌నాథ్ యాత్ర వెళ్ళి తిరుగు ప్రయాణంలో రాయ్ పూర్లో ఆగినప్పుడు చూసిన ఈ డైరీలోని కొన్ని పేజీల్ని అప్పట్లో జిరాక్స్ కూడా తీసుకున్నా. మొన్న ఏదో సందర్భంలో అమ్మమ్మని అడగ్గా అక్కడి నుండి పంపించింది. శిథిలావస్థలోకి చేరిపోనున్న ఒక జ్ఞాపకానికి చిరుస్మృతిగా ఈ చిన్న రైటప్!)
Also read: అద్వితీయ భావోద్యమకారుడు, విజ్ఞానశాస్త్ర ప్రచారోద్యమ ధీరుడు యాళ్ళ సూర్యనారాయణ
– గౌరవ్
గౌరవ్ గారు!
మీ ప్రస్థానాన్ని కొనసాగించండి. మూలాలను తవ్వుకుంటూ పోతూ, సమస్త మానవ జీవన వైవిధ్యభరితమైన సంఘర్షణలను నమోదు చేయడమే నిజమైన చరిత్ర.