Tuesday, January 21, 2025

ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!

మానవాళి తెలుసుకోవలసింది బైబిల్లో ‘భక్తి’ తప్ప మరి ఇంకేమీ లేదు, అన్నట్టుగా తయారయింది పరిస్థితి. మతం పేరిట జరిగే బోధనలు వల్ల జనం ‘మైండ్ సెట్’ అలాగయింది. దాంతో బైబిల్లో నాగరికత చరిత్ర ఆధారాలు కూడా కొన్ని వున్నాయనే స్పృహ బొత్తిగా లేకుండా మనం తయారయ్యాము. నిజానికి పది ఆజ్ఞలు (‘టెన్ కమాండ్మెంట్స్’) మినహాయిస్తే, పాత నిబంధన గ్రంధం మొత్తం – రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు, ప్రవక్తల చరిత్ర, సాహిత్యం మాత్రమే. అయితే, అందులో ‘రాజ్యం’ పరిణామక్రమం, సమగ్రమైన ధర్మశాస్త్రం రూపొందడం, ఆసాంతం మనకు కనిపిస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో మూడు అంశాలు కలిస్తేనే అది ‘రాజ్యం’ అవుతుంది. అవి – ప్రజలు, ప్రాంతము, ప్రభుత్వం.

ప్రపంచం అంతా చెల్లా చెదురు అయిన యూదు ‘ప్రజలు’ 1948 లో ఇది తమ పితరుల ‘ప్రాంతము’ అని ప్రస్తుత ఇజ్రాయేల్ లో స్థిరపడిన తర్వాతనే, అది ఒక ‘ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేసుకోగలిగింది, ఆ తర్వాత మాత్రమే అది ఒక ‘రాజ్యంగా’ UNO ద్వారా గుర్తించబడింది. అయితే మనం కనుక గమనించగలిగితే ఈ మూడు అంశాలు ఎలా ఒక కాలక్రమంలో ఏర్పడ్డాయో బైబిల్ గ్రంధం పాత నిబంధనలో చూడవచ్చు. ఉదా: ఆదికాండంలోనే ఒక దశలో భాషలు తారుమారు అయ్యాయి. ఒక భాష మాట్లాడే వారంతా ఒక చోటికి చేరారు.

యూదు జాతి మూల పురుషుడు అబ్రహం గొప్ప దేవుని విశ్వాసి. బైబిల్ బోధకులు ఆ విషయం చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, ఆయన ఒక గొప్ప సంపన్నుడు అనే దృష్టి మనకు తక్కువ. బహుశ అది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘బైబిల్’ కు చేరువైన వర్గాల సామాజిక ఆర్ధిక సమస్య కావచ్చు.

Also Read : ఆ నాలుగు పత్రికల నిష్క్రమణ మిగిల్చిన ప్రశ్నలు!

‘బైబిల్’ ఆదికాండం 23 వ అధ్యాయం నాటికి అబ్రహం భార్య శారా 127 ఏళ్ల వయస్సులో మరణిస్తుంది. ఆ సమయానికి వారు పరదేశంలో వుంటారు. ఈయన కాలాన్ని క్రీ.పూ. ఆరవ శతాబ్దిగా పండితులు చెబుతారు. ‘బైబిల్’ ఆరంభంలో ఆడమ్ తర్వాత మళ్ళీ అబ్రహం కీలక వ్యక్తి.

జెహోవా రాజ్యమైన ఈడెన్ తోటనుంచి నరుడైన ఆడమ్ దంపతులు సృష్టికర్త ఆజ్ఞకు లోబడక, మానవాళిని భౌతిక ప్రపంచంలోకి తీసుకు వచ్చాడు. దానికి కొనసాగింపుగా, అబ్రహం – యూదు, అన్యదేవతారాధన, ఇస్లాం, ఇలా మూడు వేర్వేరు మార్గాలుగా మానవాళి చీలికకు కారకుడు అయ్యాడు. ఈ కారణం చేత అబ్రహంలో ఒక వ్యక్తిని కాకుండా ఒక వ్యవస్థను మనం చూడవచ్చు. నిజానికి అయన భార్య చనిపోయిన సమయానికి ఇంటివద్ద లేడు, కబురు తెలిసి కనాను వచ్చాడు. ఒక పక్క దుఖం, మరో వైపు ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా చేయాలి, అటువంటి సమయంలో అబ్రహం ఒక ‘సిస్టం’ (పద్దతి) అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read : ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

సాధారణంగా ఇటువంటప్పుడు మామూలుగా జరిగేది, పదిమంది సానుభూతి పొందడం, కుదిరితే సహాయం పొందడం. ఇప్పటికీ మనకు తెలిసింది అదే. కానీ అబ్రహం ఒక సంప్రదాయానికి అక్కడ బీజాలు వేస్తున్నాడు. సందర్భం ఏదైనా సమాజంలో వ్యక్తులకు ఉండవలసిన క్రమశిక్షణ చెబుతున్నాడు. అప్పటికే ‘మా స్మశాన భూమిలో మీ భార్య అంత్యక్రియల పని మీరు పూర్తిచేసుకోవచ్చు’, అని స్థానికులు ఇచ్చిన ‘ఆఫర్’ అబ్రహాం మృదువుగా తిరస్కరించాడు. ‘నేను పరదేశిని కనుక నా భార్య సమాధి కొరకు మీరు మీ దేశంలో అనువైన భూమి నాకు ఏర్పాటు చేయండి, రేటు ఎంత అయితే అంత (తగ్గింపు అక్కరలేదు, ‘నిండు వెలకు’) అంటాడు.

అయన అక్కడ ఆగలేదు, స్థానిక ‘కమ్యూనిటి’ ని అందుకోసం కలిసాడు. స్థానికుడైన హేతు అతని కొడుకుల్ని మధ్యవర్తులుగా వుంచి, అనువైన భూమి ఎంపిక మొదలుపెట్టాడు. అబ్రహాం సంపన్నుడు కనుక, తన భార్య సమాధి కోసం, తన ‘ఛాయిస్’ మేరకు తనే వొక అనువైన స్థలాన్ని గుర్తించి, దాని యజమానితో నా తరుపున మీరు మాట్లాడమని హేతు అతని కొడుకుల్ని పంపుతాడు.

Also Read : వి’నాయకులు: విగ్రహాలు – నిగ్రహాలు

దాంతో -‘వూరి గవిని ఎదుట’ ఎవరైతే భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారో, వారికీ మిగతా వూరి వారికీ ఒకేసారి వినిపించేట్టుగా, వొక బహిరంగ వ్యవహరం ఇది అన్నట్టుగా సాగుతున్నది ఈ మొత్తం ప్రహసనం.

‘నీకు నేను భూమి ఇస్తాను’ అని హేఫ్రోన్ అతని కుమారులు మధ్య కూర్చుని అంటున్నాడు. అవును మరి అతని తర్వాత వాళ్ళు ఆ భూమికి వారసులు.

‘నీ భూమికి నేను వెల ఇస్తాను, అది నీవు తీసుకుంటే, నేను నీ భూమి తీసుకుంటాను’ అని అబ్రహం అంటున్నాడు.

‘దాని వెల నాలుగు వందల తులముల వెండి’ అని హేఫ్రోన్ అంటున్నాడు.
వాళ్ళు ఈ లావాదేవీకి వూరివారిని సాక్షులుగా చేసారు.
పొలం ధర ఒప్పందం కురిరింది.
అబ్రహం వెండి తూచి ఇచ్చాడు.
ఇక్కడితో ఈ ఇద్దరి మధ్య సంభాషణ పూర్తి అయింది.

ఇప్పటి ‘డాక్యుమెంట్ రైటర్స్’ దస్తావేజులు రాసే శైలిలో ‘బైబిల్’ ఆదికాండం 23 అధ్యాయం 18 వచనం ఇలా మొదలవుతుంది…

“ఆలాగున మమ్రే ఎదుటవున్న మక్పేలా యందలి హేఫ్రోన్ పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు, దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లు అన్నియు…” దఖలు పరుస్తూ, అతని వూరి గవిని ప్రవేశించు ఎదుటవున్న వారి ముందు, “అబ్రహమునకు స్వాస్త్యముగా స్థిరపర్చబడెను” అని ఈ అధ్యాయం ముగుస్తుంది.

Also Read : ఈ ‘కాన్వాస్’ పై ఏడాది ఆందోళనకు చోటెక్కడ?

భూమి కొనుగోలు లావాదేవీ ఎవరైతే మధ్యవర్తిగా ఉండగా మొదలయిందో, అతని ఎదుటను అతని కుమారుల ఎదుటను ఈ ‘ట్రాన్సాక్షన్’ మొత్తం పూర్తి అయినట్లు, ఈ వచనం ముగింపులో ఉంది.

ఇప్పటికీ మన వద్ద దస్తావేజులు రాసేవారు పాటించే పద్దతి ఇదే!

కాయితం, కలం లేని ఆ రోజుల్లో దీని ఒక మాటగా వాళ్ళు అనుకున్నారు, సాక్షులుగా స్థానిక సమాజాన్ని అందులోకి కలుపుకున్నారు. ఇప్పుడు మనం రాసుకుంటున్నాము కనుక సాక్షులతో సంతకాలు చేయిస్తున్నాము. అయితే అందులో రాసుకునే షరతులు విషయంలో కాలక్రమంలో మరికొంత చేర్పు ఉన్నప్పటికీ, స్థూలంగా మూలవిషయం, మిగతా పద్దతీ కూడా ఇప్పటికీ అవే. అయితే భూమి అమ్మకం కొనడం లావాదేవీల మూలాలు ఆసియా కేంద్రితమైన ‘బైబిల్’ గ్రంధంలో కీ.పూ. ఆరవ శతాబ్ది నాటికే ఉండడం, అది భూమి పట్ల అనాదిగా మనకున్న శ్రద్ధకు నిదర్శనం!

Also Read : మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles