తెలుగులో భావోద్యమాలకి దాదాపు 80 ఏళ్ళపాటు వెన్నుదన్నుగా నిలిచిన హేతువాద, మానవవాద యోధులు, చిరకాల మిత్రులు, పెద్దలు రావిపూడి వెంకటాద్రి ఈ రోజు (శనివారం) మరణించారు. తెలుగులో నాకు తెలిసీ రేషనలిజాన్ని, హ్యూమనిజాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన అరుదైన వ్యక్తాయన.
నెలక్రితం అనుకుంటాను, ఒకరోజు మధ్యాహ్నం ఆయన ఫోన్ చేయడమే కాక మేడూరి సత్యనారాయణ చేత కూడా ఫోన్ చేయించి మరీ నేను రాయ్ మీద రాసిన పుస్తకం అడిగారు. తెలుగులో ఆయన పరిశోధించి రాసిన ఎం. ఎన్. రాయ్. భారత కమ్యూనిజం ఒక సమగ్ర చారిత్రక గ్రంథం. నాకు తెలిసీ రాయ్ ని జీవితాంతం ప్రేమించిన విశిష్ట వ్యక్తి రావిపూడి.
కరోనా వేవ్ లన్నింటినీ, ఇంకా అనారోగ్య సమస్యలు ఎన్నింటినో అవలీలగా దాటేసిన ఆయన తెలుగునాట అనితరసాధ్యమైన ఆలోచనాపరుడు. ఎవరికి ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు కానీ, తెలుగులో మానవవాద మార్గదర్శిగా ఆయన క్రియాశీలక పాత్రనూ, వైజ్ఞానిక దృక్పధాన్ని కాదనలేం. అన్నీ తానై సైన్సు ఉద్యమాన్ని నిర్వహించిన వాడాయిన!
మతాలన్నింటినీ ఎండగట్టాడు, మార్క్సిజం లోని కొన్ని అంశాలతో తీవ్రంగా విభేదించారు. సైన్సు ప్రచారం, హేతువాద సంఘాలు ఎలా ఉండాలో నిర్దేశిస్తూ ఏకంగా ‘మనం ఏమి చేయాలి?’ తో సహా పదుల సంఖ్యలో విలువైన పుస్తకాలు రాసారు. తిరుగులేని అధ్యయనశీలి. హేతువాద మానవవాద సాహిత్యాన్ని అంతగా చదివినవారు ఈనాటికీ లేరు!
జీవించినన్నాళ్ళూ భావోద్యమాల్ని ఓన్ చేస్కొని ప్రేమించారు. భావోద్యమాల్ని ఆదరించారు. నలుదిశలా చైతన్య కిరణాల్ని వెలువరించారు. విస్తృతమైన ఉద్యమ సంబంధాల్ని నిర్మించారు. రావిపూడి వెంకటాద్రి, హేతువాది, చీరాల పేరిట పోస్టల్ శాఖ బట్వాడా చేసే ఏకైక చిరునామా ఆయనదే కావచ్చు. హఠాత్తుగా ఫోన్ చేసి ఆత్మీయంగా పలకరించడం ఆయన నైజం.
అంతటి గొప్ప వ్యక్తి నూటొక్క ఏళ్ళు పరిపూర్ణంగా జీవించి ఈరోజు నిష్క్రమించారు.
ఆయన చూపిన మహోన్నత మైన మానవీయ వార సత్వాన్ని రాబోయే తరాలకు స్పూర్తిగా అందిస్తూ, ఆయన అందించిన హేతువాద, మానవవాద దివిటీతో ముసిరిన చీకట్లను ఎప్పటి కప్పుడు చీల్చుకుంటూ ముందుకు సాగడమే ఒక సత్యాన్వేషకునిగా ఆయనకి మనమిచ్చే సారవంతమైన నివాళి!
(అనేక లేఖలు, పుస్తకాలు పోయినా ఐదేళ్ళ క్రితం ఆయన అభిమానంగా రాసిన లేఖ బహుశా గతేడాదే దొరికితే అది పెడుతూ FB లో 100 వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాను. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చూపిన వాత్సల్యం ఎప్పటికీ మర్చిపోలేను. జ్ఞాపకాలన్నీ జారిపోయే లోపే దాదాపు ఇరవై ఏళ్ళకు పైబడిన మా మిత్రత్వం సాక్షిగా ఆయన అసాధారణమైన కృషికి జోహార్లు అర్పిస్తూ, అవిశ్రాంతంగా భావోద్యమాల్ని బలోపేతం చేసిన ఆ మహనీయుడి గురించిన ఈ చిన్న నివాళి వ్యాసం ఇలా)
– గౌరవ్