- బ్యాటుతోనూ, బంతితోనూ రాణించిన ఆల్ రౌండర్
- 4 టెస్టుల్లో 32 వికెట్లతో అశ్విన్ జోరు
ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ 3-1 తో గెలుచుకోడమే కాదు. ఐసీసీ టెస్టు లీగ్ చాంపియన్షిప్ ఫైనల్స్ చేరడంలో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధానపాత్ర వహించాడు. చెన్నై వేదికగా జరిగిన మొదటి రెండుటెస్టులు, అహ్మదాబాద్ ఆతిథ్యంలో జరిగిన ఆఖరిరెండు టెస్టుల్లోనూ అశ్వినే స్టార్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.
టెస్టులో 30వసారి 5 వికెట్ల ఘనత
ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుపొందిన అశ్విన్ ఆస్ట్ర్రేలియాతో కంగారూ గడ్డ మీద ముగిసిన మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 12 వికెట్లు పడగొట్టడంతో పాటు…సిడ్నీ టెస్టును డ్రాగా ముగించడంలో బ్యాటుతోనూ కీలకపాత్ర పోషించాడు.
Also Read : ఫైనల్ కు కోహ్లీసేన : 3-1 తేడాతో సిరీస్ కైవసం
అంతేకాదు ఇంగ్లండ్ తో స్వదేశంలో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అశ్విన్ ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయాడు. మొత్తం నాలుగుటెస్టులు, ఎనిమిది ఇన్నింగ్స్ లో 32 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. హోంగ్రౌండ్ చెన్నై వేదికగా ముగిసిన రెండోటెస్టులో అశ్విన్ ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.
Also Read : ఆఖరి టెస్టుపై భారత్ పట్టు
అహ్మదాబాద్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా…30వసారి ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల రికార్డును సాధించాడు. తన కెరియర్ లో ప్రస్తుత సిరీస్ వరకూ 78 టెస్టులు ఆడిన అశ్విన్ 409 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 30సార్లు 5 వికెట్లు , ఏడుసార్లు 10 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం అశ్విన్ కు మాత్రమే సొంతం.
బ్యాటింగ్ లో సైతం అశ్విన్ ఐదు శతకాలు సాధించిన ఘనత ఉంది. 11 హాఫ్ సెంచరీలతో 2 వేల 656 పరుగులు సాధించిన మొనగాడు అశ్విన్.
Also Read : రిషభ్ పంత్ ఫటాఫట్ సెంచరీ
ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన టెస్టు లీగ్ ఫైనల్స్ కు భారతజట్టు చేరుకోడంలో కెప్టెన్ కొహ్లీని మించి అశ్విన్ ప్రధానపాత్ర పోషించాడన్నా అతిశయోక్తికాదు.