Tuesday, December 3, 2024

భావోద్యమాలకో బ్రాండ్ అంబాసిడర్

 (రావెల సోమయ్య గారి 88 వ పుట్టినరోజు)

ఒక్క తెలుగులోనే కాదు, మొత్తం దేశంలోనే సోషలిస్టు యోధుడు రామ్ మనోహర్ లోహియాకి అత్యంత సన్నిహితుల్లో ఆయనొకరు. మహామానవవాద తత్వవేత్త, భారతీయ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు యం. యన్. రాయ్ సహచరి ఎలెన్రాయ్ తో ప్రశ్నోత్తరాలు జరిపిన వారాయన. ప్రఖ్యాత మార్క్సిస్టు మానవతావాద మేధావి ఎరిక్ ఫ్రామ్ తో ఉత్తరప్రత్యుత్తరాలు నడిపిన ఏకైక తెలుగు బుద్దిజీవి. తెలుగులో మొదటి మహా మార్క్సిస్టు చరిత్ర కారుడు, కులనిర్మూలన పరిశోధకుడు డా. కె. బి. కృష్ణ ఫొటోని అమెరికా వెళ్ళి మరీ సంపాదించి మనకందించిన క్రియాశీలి. స్వాతంత్ర్యోద్యమం మొదలు సోషలిస్టు ఉద్యమం వరకూ, కమ్యూనిజం నుండి హేతువాదం వరకూ, మహాత్మా గాంధీ నుంచి స్వామి వివేకానంద దాకా సాధికారి కంగా ఆయన స్పందించలేని అంశం లేదు. ఎమర్జెన్సీ దుర్మార్గానికి బలైపోయిన ప్రఖ్యాత తెలుగు కవి పఠాభి సహచరి, మానవ హక్కుల ఉద్యమశీలి, సోషలిస్టు స్నేహలతారెడ్డి స్మరణలో మహిళా సాధికారిక సంచికను తీసుకొచ్చిన మహా వ్యక్తి. వ్యాపార దృక్పధంగల సంస్థలేవీ దాని ప్రచురణకు ముందుకు రాకపోతే సుమారు ఏభై ఏళ్ళ క్రితమే ఏకంగా, “లోహియా విజ్ఞాన సమితి’ స్థాపించి పదుల సంఖ్యలో విలువైన గ్రంథాల్ని ప్రచురించిన వారాయన. రావెల సోమయ్య, అరుణ దంపతుల్ని ప్రేమగా ప్రస్తావిస్తూ రాసిన వాక్యాలు కళాతపస్వి సంజీవ్ దేవ్ ఆత్మకథ ‘తుమ్మపూడి’ ఉద్గ్రంథంలో కూడా చూడొచ్చు. ఆయనతో పరిచయం దానికదే ఒక విజ్ఞాన సంద్రం. ఆయనతో ప్రయాణం ఎడతెరిపి లేని విలువల ప్రవాహం. ఆయనతో స్నేహం ఆర్ద్రతతో కూడిన జీవిత మధురానుభవం!

అరుణ, సోమయ్య

ఆయనే రావెల సోమయ్య!

సుమారు పదేళ్ళ నాటి సంగతి. లోక్నాధూ, నేనూ ఆయనింటికి వెళ్లాం, ఇంటర్వ్యూ కోసం.ఆ మధ్యాహ్నానంతర వేళ, చిరు గాలుల ఆస్వాదనలో డెబ్బైకి పైబడ్డ వయసులో సైతం ఆ పెద్దాయన విజ్ఞాన విస్తృతికి ఆశ్చర్య పోయాను. వెళ్ళిందా యన ఇంటర్వ్యూ కోసమైతే, జరిగింది నా ఇంటర్వ్యూ.  ఆ తర్వాత ఆయనతో చేసిన గొప్ప ప్రయాణం అఖిల భారత సోషలిస్టు సంఘాల సమావేశం ముంబై కి ఇద్దరం మరొక ఇద్దరితో కల్సి వెళ్ళడం. జీవితంలో అదో గొప్ప అనుభవం. (ఆ ఫొటోలేవీ లేవు కానీ ఎన్నడో జై భారత్ మీటింగ్ లో  కీ. శే. జనార్దన రెడ్డి, రామదాసు నేనూ సోమయ్య గారూ ఉన్న ఫొటో దొరికింది) అలా తర్వాత కాలంలో మహారాష్ట్ర నుండి బీహార్ వరకూ ఎన్నో విలువైన సమావేశాలకి నన్ను ఏరి, కోరి, పోరి పంపించేవారు. చంపారన్ శతజయంత్యుత్సవ సందర్భం గా ఆరేళ్ళ క్రితం సోమయ్య గారి సంపాదకత్వం లో , నా అనువాదంగా వెలువడిన రైతు మహోద్యమ ప్రత్యేక వ్యాస సంకలన గ్రంథం  ఎప్పటికీ  విశిష్టమైనదే. దాని ప్రచురణ మొదలు, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయంలో చేసిన ఆ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం వరకూ అంతా ఆయనే దగ్గరుండి జరిపించారు.  అబ్బాయీ.. అంటూ ప్రేమగా పిలిచే ఆయన వాత్సల్యం నా వరకూ నాకో బలం. నాకు తాత వరసయ్యే తిలక్ గారికి మిత్రులై ఉండి నాతో కూడా అంతే సన్నిహితంగా ఉండే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో బహుశా సోమయ్య గారేనేమో !

పుస్తకాల బహుకరణ

ఇంటికి పిలిచి మరీ ఎంతో విలువైన లోహియా సమగ్ర రచనా సంపుటాలు, నార్ల సమగ్ర సాహిత్య సంపుటాలు, ఇంకా ఎన్నో విలువైన గ్రంథాలు ఇచ్చారు. ఇంటికెళ్ళినవారిని ఉత్త చేతులతో పంపకుండా ఏదో మంచి పుస్తకం ఇస్తుండే వారు. ధిక్కార స్వరాల్లో అద్బుతమైన ఆయన ఇంటర్వ్యూ మొదలు ఆయన వాయిస్ రికార్డులు కూడా అప్పట్లో చేసాను కానీ అవెక్క డున్నయో కనబడటం లేదు. ఐనా, మిత్రులు చేసిన ఇతర వీడియోలు, రికార్డు చేసిన ఇంటర్వ్యూలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. వాటి మాటెలా ఉన్నా, పదులసార్లు ఆత్మీయంగా, అన్యోన్యంగా మేం మాట్లాడు కున్న సందర్భాలు ఉన్నాయి. 2002 లో పూనా కేంద్రంగా మధూ దండావతే ఆద్వర్యంలో ఏర్పడిన సోషలిస్టు ఫ్రంట్ కి తెలుగు రాష్టాల కన్వీనర్ గా సోమయ్యగార్ని ఎన్ను కున్నారు. ఆ సందర్భంగా సంస్థ చిహ్నం (ఐకాన్) సోషలిస్టు ప్రముఖు లందరితో తయారు చేసారు. అందులో పట్టుబట్టి డా. బి. ఆర్. అంబేద్కర్  చిత్రాన్ని  కూడా ఇన్క్లూడ్ చేసింది సోమయ్య గారే. ఆయన FB ఫ్రొఫైల్ వెనుక కనిపించే పెయింటింగ్ అదే. అంతేకాదు, గాంధీ, లోహియా, రాయ్, అంబేద్కర్ వంటివారి సమగ్ర రచనలతో పాటు అనేక విశిష్ట గ్రంథాలూ, పత్రికల్ని చదవాలనుకునే వారికి అందుబాటు లో Lohiatoday అనే అద్భుతమైన వెబ్‌సైట్ని కూడా  స్టేట్స్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి సహకారంతో సోమయ్య నిర్వహిస్తున్నారు!

సోమయ్యతో మాట్లాడుతున్న రచయిత గౌరవ్

ఐతే, ఇంత మాత్రంలోనే నేను ఆయన్ని సోషలిస్టు అంబాసిడర్ అనలేదు. వీటన్నిటినీ మించి ఆయన చేసిన ఒక గొప్ప కార్యముంది. అది భారతీయ ప్రత్యామ్నాయ భావోద్యమాల్లో రెండు విశిష్టమైన సైద్ధాంతిక భావజాలాలకి అనుసంధాన కర్తగా వ్యవహరించగలగడం.

సంధానకర్త

తిరుగులేని సోషలిస్టు పార్టీ యోధుడయిన రామ్ మనోహర్ లోహియాకు హ్యూమనిజం గురించీ, అలాగే, ఎదురేలేని  హ్యూమనిస్టూ, మహా మానవవాది రాయ్ సహచరి, ధీరవనిత ఎలెన్ రాయ్ కి సోషలిజం గురించిన యత్నాల్ని స్థూలంగా పరిచయం చేసే ప్రయత్నం చేయడం. ఆ మేరకు ఆయా ప్రచురణల్ని ఇరు పక్షాలకీ పంపించి వారి స్పందన కోరడం. నాటి వ్యవస్థలో వాళ్ళిద్దరూ కేవల వ్యక్తులు కాదు. తమ శక్తిమేర మార్పుకు మాధ్యమంగా మారి పని చేస్తున్న శక్తి శిబిరాలు. అలాంటి రెండు చారిత్రక పక్షాలకి సైద్ధాంతిక సంధాన కర్తగా వ్యవహరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాని, దానిని సాధ్యం చేసిన ఘనత సోమయ్యగారికే చెల్లింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ రాం మనోహర్ లోహియా స్వయంగా సోమయ్య గారిని ఉద్దేశిస్తూ 65 ఏళ్ళ క్రితం రాసిన లేఖ అందు చేతనే చారిత్రక ప్రాధాన్యత కలిగినదని నా అభిప్రాయం. Subaltern దృక్పధంతో ఇలా ఆ రెండు ప్రత్యామ్నాయ వైధానిక పద్ధతుల్ని అనుసంధానం చేయగలి గేంతటి స్థాయీ, సామర్థ్యం ఉన్న వ్యక్తి తెలుగులో సంగతలా ఉంచి, దేశంలో కూడా మరే ప్రాంతంలోనూ మరొకరు ఉన్నట్టు నాకు తెలీదు!

సమాజం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక్క సారైనా కలవాలి. సామాజిక కార్యకర్త గా కొనసాగే ప్రతి వాళ్ళూ తప్పని సరిగా వీలు చూసుకు నయినా ఆయనతో ముచ్చటించి రావాలి. అప్పట్లో హైదరాబాద్ వెళ్ళిన అనేక మంది మిత్రులకి వాళ్ళింటికి వెళ్ళి కలిసి రమ్మనమని చెప్పేవాడ్ని. అలా కల్సిన వారందరూ నాకు కృతజ్ఞత చెప్పినవారే. కోవిడ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఇద్దరి ఆరోగ్యాలు పాడయ్యాయ్. అప్పుడప్పుడు ఫోన్లో పలక రిస్తుంటే ఒకనాడు తీవ్ర స్వరం తో ఈ దేశ భవిష్యత్తుని గూర్చి గర్జించిన ఆ గొంతేనా ఇంతగా బలహీనపడింది అనిపించి ఆపుకోలేని దుఃఖం వచ్చేస్తుంది.  ముంబై నుండి వచ్చాక హైదరాబాదులోతప్పా ఇంకెక్కడికీ పెద్దగా వెళ్ళలేదని చెబుతూ నా ఉనికిని నా కంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఆయన. తన వల్ల అయ్యే ఏ పనైనా సరే వెంటనే స్పందించే ఆయనకి 88వ జన్మదిన శుభా కాంక్షలు ఈ విధంగా పరోక్షంగా చెప్పడం నా  అసమర్థ తకి సంకేతం అనిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన పరిమితులు అవకాశాల్ని కుదించిన సందర్భాల లో అసహాయతకి కారణాలు అన్వేషించడమే సరిపోతోంది!

అదే బాటలో అరుణ

అరుణ గారు కూడా చిన్న వ్యక్తి కాదు. మొదటి సారి నేను వెళ్ళినప్పుడు అరమరికలేవీ లేకుండా ఆయన్ని ‘బావ’ అని పిలుస్తుంటే ముచ్చటేసింది. ‘నన్ను ఆవిడే పోషిస్తోంది, ఆమె వల్లనే నేను కొద్దోగొప్పో మంచి చేయగలిగా’నని చెప్పేంత తెగువ ఆయన సొంతం. వారిరువురిది అన్యోన్య బంధం. నేనూ, ఆంటీ కలిసి లోహియా గారి విషయంలో ఆయన్ని దెప్పి పొడుస్తుంటే ఇద్దర్నీ కలిపి కోప్పడేవారు. లోహియాకి సంబంధించీ, సోషలిస్టు ఉద్యమానికి సంబంధించీ, నాటి రాజకీయ, సాంఘిక పరిణామాలకి సంబంధించీ ఆయన్ని ఒక్కసారి కదిలిస్తే, ఇకది పెను ప్రవాహమే. అనూహ్యమైన మలుపులు, అమితమైన వెలుగులతో మనల్ని తనతో పాటూ తోడుకొనిపోయి ఉరికించి, పరిగెత్తించి, ఆలోచింపజేసి, ఆవేశంతో ఆచరణ లోకి దూకించిగాని వదలదా వ్యక్తిత్వ ఝరి. లోహియా బయోపిక్ “అంబాసిడర్ ఆఫ్ సోషలిజమ్” అని ఒకావిడ తీసారు. సోమయ్య, అరుణల ఇంటర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి.  ఎందుకనో అది నెట్ లో అందుబాటులో లేదు. లోహియా సంగతలా ఉంచి, నా వరకూ నాకు సోమయ్య గారు తెలుగులో భావోద్యమాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్!

దావెల సోమయ్యకు లోహియా రాసిన ఉత్తరం

(స్పూర్తిదాయక ఉద్దేశమేకానీ బ్రాండ్ పదం పట్ల నాకున్న అభిప్రాయం వేరు. ఈ మాత్రం రాసిన దానికే ఆయన్నుంచీ ఎలాగో నాకు చీవాట్లు తప్పవు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఎంతోమంది అభిమానులు, హితులు, స్నేహితుల ఆద్వర్యంలో నేను స్వయంగా వెళ్ళి వాళ్ళింట్లోనే చిన్న కార్యక్రమం నిర్వహిద్దామని ప్లాన్ చేసుకున్నాను. కానీ, ఎప్పట్లాగే అవలేదు. నగరంలో ఉన్న మిత్రులు,ఆయనను ఎరిగున్న శ్రేయోభిలాషులు ఈరోజు ఇబ్బంది కలిగించ కుండా ఆయన నుండి రెండు మంచి మాటలు వినడం, వీలైతే ఓ రెండు మంచి మాటలు ఆయనతో మాట్లాడటం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. పుట్టినరోజు  సందర్భంగా భావోద్యమాల్లో నేను విష్ చేస్తే Same to you అని చెప్పదగ్గ ఏకైక వ్యక్తి గురించి అయినంతలో సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, ఆ దంపతులు అనారోగ్యం నుండి కోలుకుని మా తరాలకి మరింత స్పూర్తిని అందిస్తూ, ఆనందంగా, ఆరోగ్యంగా మరింత కాలం గడపాలని మనస్పూర్తిగా ఆశిస్తూ రావెల సోమయ్య , రావెల అరుణ గారికి ప్రేమతో ఈ చిన్న రైటప్ !)

 – గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles