Tuesday, January 21, 2025

రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు

రామాయణమ్207

రాముడిని చీకాకు పర్చవలెనని రావణుడు పదిబాణములు ఏకకాలములో ప్రయోగించెను. రాముడు వాటికి ఏ మాత్రమూ చలించక రావణుని అవయవములు కదలునట్లుగా అనేక బాణముల చేత గురిచూసి కొట్టెను.

ఇంతలో లక్ష్మణుడు రావణుని ధనుస్సును ముక్కలుముక్కలుగావించి అతని సారధి శిరస్సును ఒక వాడి బాణముతో ఎగురగొట్టెను. రావణుడు తేరుకొనే అవకాశమివ్వక విభీషణుడు ఉన్నపళముగా గాలిలోకి లేచి రావణుని రధమునకు కట్టబడిన గుర్రముల తలలను తన గదతో మోది పగులగొట్టెను.

Also read: రావణుడు రణరంగ ప్రవేశం

రావణుడు తమ్మునిపై కోపించి శక్తిని ప్రయోగించగా దానిని మార్గమధ్యములోనే మూడుబాణములతో లక్ష్మణుడు తుత్తునియలు చేసెను.

లక్ష్మణుని పరాక్రమమునకు చీకాకుబడిన రావణుడు తమ్ముని వదిలి లక్ష్మణుని పై మహా శక్తివంతము అయిన శక్త్యాయుధమును అభిమంత్రించి విడిచెను.

అది వజ్రాయుధమువలె భయంకరముగా కదులుతూ పిడుగులు వర్షిస్తూ దూసుకుంటూ వచ్చి లక్ష్మణుని వక్షస్థలమున బలముగా తాకెను. ఆ దెబ్బకు లక్ష్మణుడు నేలపైబడెను.

Also read: ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు

క్షణకాలములో జరిగిన ఈ ఘోరమును చూసి చలించిన రాముడు కన్నీటిపర్యంతమై క్రోధావేశమునకు లోనాయెను.

వెంటనే తేరుకొని ఇది దుఃఖించుసమయము కాదని గ్రహించి  లక్ష్మణుని శరీరములో దిగబడ్డ శక్తిని పైకిలాగ సాగెను. ఆ సమయములో నిరాయుధుడైన రాముని మర్మస్థానములకు గురి చూసి రావణుడు శరప్రయోగము చేయసాగెను. ధీరమూర్తి ఆ రాముడు వాటిని లెక్కచేయక తమ్ముని శరీరమునుండి శక్తిని లాగి వైచి వానరవీరులను లక్ష్మణునకు కాపలా ఉంచి వీరావేశముతో ప్రతిజ్ఞచేసెను.

‘‘ఈ జగత్తులో ఇక రాముడో రావణుడో తేలిపోవలెను. నాకు కలిగిన రాజ్యనాశనము, వనవాసము, నా భార్యను అవమానించుట అను ఇన్నివిధములైన దుఃఖములు రావణసంహారముతో సమసిపోవలె!

Also read: ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు

‘‘ఏ పాపాత్ముడి సంహారమునకై ఇంత వానరసేనను సముద్రము దాటించి తెచ్చితినో ఆ పాపాత్ముడికిక భూమిపై నూకలు చెల్లవలెను. గరుత్మంతుని దృష్టిలోపడిన సర్పము ఎటుల జీవించలేదో నా దృష్టిలో పడిన ఈ రావణుడు కూడా ఇక జీవించడు. ఈ భూమి నిలచియున్నంత వరకు మా యుద్ధము గురించి జనులు కధలుకధలుగా చెప్పుకొందురు. వానరులారా రండి. మా యుద్ధమును వీక్షించండి’’ అని పలికి బంగారపు మొలుకులుగల వాడి బాణమును తీసి రావణున్ని కొట్టెను.

రౌద్రమూర్తి రాముడు ఎడతెరిపిలేకుండా కురిపించిన బాణవర్షము రావణుని అతని సైనికులను చీకాకు పరచి భయభ్రాంతులకు గురిచేయగా అప్పటికి జడిసిన రావణుడు తన వారితో కలిసి పారిపోయెను.

అంత రాముడు వ్యాకులచిత్తముతో నేలపై అచేతనముగా పడియున్న తమ్ముని చూపుతూ రాజవైద్యుడైన సుశేషణుని తో ఇట్లు పలికెను.

Also read: మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు

‘‘సుషేణా, అక్కడ అచేతనముగా పడి ఉన్నది   “బయటతిరుగాడే నా ప్రాణము!” అతడే మృతుడైనచో ఇక నాకు నా ప్రాణములు ఎందుకు ,సీత ఎందుకు? నా పరాక్రమమును చూసి నాకే సిగ్గుగా ఉన్నది. నా సోదరుడు యుద్ధభూమిలో బురదరొచ్చులో పడియున్నాడు.

దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవాః

తంతు దేశం న పశ్యామి యత్రభ్రాత్రా సహోదరః.

.

ఏ దేశములోనైనా భార్యలు లభింతురు,

బంధువులు సమకూడుదురు.

కానీ!

తోడబుట్టిన సోదరుడు ఎచ్చటనూ ఉండడు!….ఏదేశములో పడితే ఆ దేశములో సోదరుడు లభించడు. అనుచూ శోకముతో పట్టుదప్పి విలపిస్తూ,నిట్టూరుస్తూ దీనముగా ఒరిగిపోవుచున్న రాఘవుని చూసి ….‘‘మహాబాహూ! లక్ష్మణుడు లక్ష్మీవంతుడు, అతడు మృతిచెందలేదు! ముఖములో ఏవిధమయిన వికారమూలేదు. కాంతి తగ్గలేదు. అరచేతులు రెండూ ఎర్ర తామరల వలే యున్నవి. ప్రాణము పోయినవారి లక్షణములు ఇట్లుండవు. ఈతడు భాగ్యశాలి. కేవలము ఇంద్రియములు శిధిలమైనవి. ఊపిరి ఆడుచున్నది. హృదయస్పందన చక్కగానున్నది. దిగులు పడవలదు’’ అని రామునితో చెప్పి హనుమను పిలిచి నీవు మునుపు జాంబవంతుడు చెప్పిన చోటికి వెళ్ళుము.

Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు

అక్కడికి దక్షిణమునగల శిఖరముపై నాలుగు దివ్యౌషధములు గలవు …

అవి…

విశల్యకరణి …విరిగిన బాణపు ములుకులను వెలికి దీయును……..

సవర్ణకరణి — బాణపుదెబ్బలకు కమిలిన చర్మపు రంగును సరిచేయును

సంధానకరణి — విరిగిన ఎముకలను అతికించును

సంజీవని —  ప్రాణములు పోయినను బ్రతికించును…

కావున నీవు వెంటనే బయలు దేరుము.

ఈ మాటలు వింటూనే ఆకాశములోకి చేయిసాచి రివ్వున లేచినాడు ఆంజనేయుడు.

Also read: మరోసారి లంకాదహనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles