Thursday, November 21, 2024

రావణుడి సేనాధిపతుల ప్రేలాపన

రామాయణమ్ 167

తమ రాజు మాటలు విన్న మంత్రులు మూకుమ్మడిగా ‘‘రాజా,  అపారమైన సైన్య సంపత్తి, అమిత బలపరాక్రమములు గల నీవు, నీ పుత్రుడు యుండగా మనకు ఏల దిగులు!

పాతాళమునందున్న భోగవతిని నీవు కాదా పట్టుకొన్నది!

మహేశ్వరునితో స్నేహము కలదని విర్రవీగు అంతటి కుబేరుని నీవు కాదా ఓడించినది!!

యక్షులను క్షోభింపచేసినావు.

నాగులను నిర్జించినావు.

Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న

కాలకేయులను జయించినావు.

రణములో వరుణుని పుత్రులను లొంగదీసుకొనలేదా!!

నిన్ను చూసి యముడే భయపడినాడు.

దానవప్రభువైన మయుడు నీకు భయపడి కాదా తన తనయ మండోదరీదేవిని నీకొసంగినది!

బలములో, వీర్యములో, ధైర్యములో నీ ముందు రాముడేపాటి?

Also read: మహేంద్ర పర్వత సానువుల్లో రామలక్ష్మణులు, వానరసైన్యం

అయినా, ఇంద్రుని లొంగదీసుకొని పట్టుకొని వచ్చి ఇంద్రజిత్తు బిరుదాంకితుడైన మేఘనాధుడంతటి వాడు నీ కుమారుడు. అతడుండగా అసలు నీకు యుద్ధము చేయు అవసరమే రాదు.

రామునితోసహా సకల వానర సైన్యమును అతడే సర్వనాశనము చేయగల సమర్ధుడు.’’

అనుచూ రాముని బలమును తెలియని మంత్రులు రావణుని యుద్ధమునకు ప్రేరేపించుచుండిరి.

(రావణుడు గొప్ప పండితుడు. తపోధనుడు. నీతిశాస్త్రాలను అవపోసన పట్టినవాడు ….కానీ పరభార్యా సంగమేచ్ఛ అతని పతనానికి దారితీసింది.

ఆ విషయంలో అతని బుద్ధిని మోహము కప్పివేసింది.

మన స్వభావము రావణ స్వభావము వంటిదే!

తప్పు ఏదో ఒప్పు ఏదో  తెలుసు. అయినా ఇంద్రియలోలత్వము)

Also read: సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన

‘‘రాముడా గీముడా అతడెంత? ఆతడి బలమెంత? మేము నీ చెంత ఉండగా ఏల నీకు చింత? ఇరువురు మానవులకు, కొన్ని కోతులకు మనము ఆలోచించవలసిన అవసరమే లేదు. దేవదానవ, పన్నగోరగ, యక్షగంధర్వకిన్నరకింపురుషులను జయించి ముల్లోకములను గజగజలాడించిన రాక్షస సార్వభౌముడికి వారొక లెక్కా! మనము ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ కోతిగాడు చేసిన పనికి మనమేల చింతించవలే. ప్రభూ నేనొక్కడను చాలును’’ అని ప్రహస్తుడు అను సేనా నాయకుడు గర్వముగా పలికెను.

‘‘హనుమంతుడు చేసిన పరాభవము మరువలేనిది సహింపరానిది! రామలక్ష్మణసుగ్రీవ సహితముగా వానరులందరినీ నేను మట్టుపెట్టెదను ప్రభూ’’ అని దుర్ముఖుడను సేనా నాయకుడు విర్రవీగుచూ మాటలాడెను.

‘‘రాజా నా కొక ఉపాయము తోచుచున్నది’’ అని వజ్రదంష్ట్రుడు అను సేనానాయకుడు ఈ విధముగా మాటలాడెను.

‘‘రాజా, వేలకొలదిగా మన రాక్షస సమూహము మనుష్యరూపములు ధరించి రాముని వద్దకు వెళ్ళి, మేము నీ తమ్ముడు భరతుడు పంపగా వచ్చినాము అని చెప్పి సేనలో కలిసి అందరూ నిద్రించుసమయమున గాఢసుషుప్తిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ మిగులకుండా సంహారము చేసి వచ్చెదము.’’

ఎవరికి తోచిన ఉపాయము వారు చెప్పుచూ వీరాలాపములు సేయుచున్నప్పుడు విభీషణుడు వారెల్లరినీ శాంతింపచేసి అంజలి ఘటించి ఇట్లు పలికెను.

Also read: సముద్రము దాటే ఉపాయం కోసం అన్వేషణ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles