రామాయణమ్ – 205
జ్వలిస్తున్న దీపపు ప్రమిదయొక్క వత్తుల నుండి బొట్లుబొట్లుగా వేడి వేడి తైలబిందువులు జారిపడునట్లుగా రావణుని కనుకొలకులనుండి రక్తాశృకణములు రాలుచుండెను.
పటపట పండ్లు కొరుకుతున్న ధ్వని యంత్రముల మధ్య రాళ్ళు నలిగినట్లుగా యుండెను.
కోపముతో ఏ దిక్కుకు ఆయన ధృక్కులు సారించినాడో ఆ దిక్కున ఉన్న రాక్షసుల గుండెలు గుభిల్లని ఒక్క క్షణము ఆగి కొట్టుకొనుచుండెను.
Also read: ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు
మహా తపశ్శాలి, వేదాధ్యయనపరుడు, నిత్యశివపూజాదురంధరుడయి ఉండి కూడా క్రోధమునకు వశుడయి ఒక , అబలను చంప నిశ్చయించుకొనెను.
‘‘నా కుమారుడు మాయా సీతను చంపినాడు కానీ నేను నిజముగనే సీతను సంహరించెదను’’ అని తన వారితో పలికి ఖడ్గము ఎత్తిపట్టి చరచర అశోకవనము వైపుగా మహానాగమును తలపించు ఫూత్కారములు సేయుచూ వడివడిగా అడుగులు వేసెను.
సీతమ్మ వైపుగా కత్తి ఎత్తి పరుగున వస్తున్న రావణుని చూచి కావలి స్త్రీలు ఉలిక్కిపడి పక్కకు తప్పుకొనిరి.
Also read: ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు
వానిని ఆ రూపములో చూసిన సీతమ్మ, ‘‘వీడు మోహావేశములో ఎన్నోసార్లు నన్ను తనదానవు కమ్మని వేడుకొన్నాడు. బహుశా నా తిరస్కారము వీనిలో క్రోధావేశము రగిలించినట్లున్నది. నన్ను అంతము చేయ నిశ్చయించుకొని వచ్చుచున్నాడు. అయ్యో ఆనాడు ఆంజనేయుడు నన్ను రమ్మని బ్రతిమిలాడినాడు. నా చావు వీని చేతిలో రాసియుండగా నా బుద్ధి ఏల సమ్మతించును? అటుల చేసిన ఈ నాటి ఈ నా శోకము వచ్చియుండెడిది కాదు’’ అని పరిపరివిధములుగా మనోవేదన చెందుతూ విలపించసాగెను.
కత్తి ఎత్తిన రావణునకు, సీతమ్మకు మధ్య హఠాత్తుగా రావణుని మంత్రి సుపార్శ్వుడు అను వాడు వచ్చి నిలబడినాడు. అతను రావణునితో, ‘‘రాజా ఏమి పని ఇది? సాక్షాత్తు కుబేరుని తమ్ముడవు. వేదవిద్యను సాంగోపాంగముగా అధ్యయనము చేసి అవబృథ స్నానమొనర్చినవాడవు. ఏమయ్యా ఒక స్త్రీని చంపవలెనని నీ చేయి లేచుచున్నది. అది ఇంద్రాదులను సైతము గజగజవణకించిన చేయి. నేడు అబలమీదకు ఖడ్గప్రహారము చేయుటకు లేచుచున్నదా? నీ కోపము రామునిపై చూపుము.
Also read: మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు
నేటికి పదమూడురోజులుగా యుద్ధము జరుగుచున్నది. నేడు కృష్ణచతుర్దశి! పాడ్యమినాడు ప్రారంభమైన యుద్ధము అమావాస్య నాటికి నీ విజయముతో అంతముకాగలదు. అప్పుడు సీత నీ స్వంతము కాగలదు. అంతియే కానీ అబలను చంపుట అన్యాయము, అధర్మము’’ అని పలికి శాంతింపచేసెను. రావణుడు తిరిగి తన భవనమునకేగెను.
‘‘ఆయుధాలు పట్డండి. రణరంగమునదూకండి. మీ రాజు కొరకు రాముని చుట్టుముట్టి మట్టు పెట్టండి. రాముడే మీ లక్ష్యము. రాముడే మీ శత్రువు. పదిమంది కలసి ఒక్కటై ఒక్కసారిగా రామునిచుట్టుముట్టండి. అతనికి ఊపిరి సలపనీయకండి. ఆతనితో యుద్ధము చేసి యమపురికి సాగనంపి మీ ప్రభుభక్తి చాటుకోండి. అది మీకు చేతకాకపోతే ఇక నేనే స్వయముగా యుద్ధరంగమున దూకెదను’’ అని తన సేనానులకు, సైన్యమునకు రావణుడు యుద్ధోత్సాహము కల్పించెను.
ప్రభు భక్తి చాటుకొనుటకై వారంతా శరములను, పట్టసములను, పరిఘలను, పరశ్వథములను, ఖడ్గములను చేతనిడి సమరోత్సాహముతో ముందుకు దూకుచూ కనపడిన వానరుడినెల్ల హతమార్చుచూ వానరసైన్యమును పీనుగులపెంటగా మార్చసాగిరి.
Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు
ఆ మారణహోమమునకు జడిసి వానరులంతా రాముని వెనుక చేరిరి. ఇక తానే స్వయముగా కోదండపాణి తన ధనుస్సుకు పని చెప్పగా అది పుష్కలావర్తక మేఘములు వర్షించు విధముగా ఎడతెరిపి లేకుండా బాణవర్షమును కురిపించ సాగెను.
రణసింగము రాముడు ధనుస్సును వంచునో! మరి కవ్వములా గిరగిర త్రిప్పునో! ఖడ్గములా ఝుళిపించునో! ఎవరికీ కనపడదు! కానీ ప్రతి రాక్షసుని శరీరమును అవి అన్నివైపులనుండి తూట్లు పొడిచి ఛిద్రము చేయసాగినవి.
ఆ దెబ్బకు బెంబేలెత్తిన వారు కంటి ఎదురుగా కనపడిన ప్రతివాడినీ నీ నా అన్నభేధములేకుండా రాముడే యనుకొని నరుకుట మొదలిడిరి. రాముడు వదలిన సమ్మోహనాస్త్రము వారి బుద్ధిని పనిచేయనీయక చేసి వారిలోవారే నరుకుకొన సాగిరి. రణకర్కశుడు రాముడు అని అప్పుడు వారికి స్పష్టముగా తెలియసాగెను.
వింటినారిలాగినప్పుడు ఉరుములవలే !
బాణము వదలినప్పుడు మెరుపులవలే !
వచ్చితాకునప్పుడు వేయిమణుగుల పిడుగులవలే !
ఆ బాణవర్షముండెను.
శరసంధానము చేయు రాముడి ఆకారము కనపడక ఒక తేజఃపుంజము గిర్రున తిరుగుచున్నట్లుగా వారికి గోచరమాయెను.
ఏమి లాఘవము !
ఏమి శరసంధాననైపుణి!
అహో రాముడొక్కడే మొనగాడు! మగాడు! మహా ధానుష్కుడు!
అని యుద్ధము చూడవచ్చిన దేవసంఘములు ఆశ్చర్యముతో నోళ్ళు వెళ్ళపెట్టినవి.
అవి బాణములా, కావు!
త్రినేత్రుడి ఫాలానలజ్వాలలు!
క్షణములో ఆ యుద్ధభూమి రుద్రభూమిగా మారి లయకారకుడు ప్రళయ నృత్యము చేయు వేదికగా మారెను. రావణ సైన్యమంతా బూడిదకుప్పగా మారిపోయెను
రుద్రుడొక్కడే! రాముడొక్కడే!
అంత యుద్దము చేసినను ఆయన ముఖమండలమునందు అలసట అన్నదే కానరాలేదు.
రామచంద్రుని ముఖము ఎప్పటి వలే రమణీయ కోమల దరహాస చంద్రికలు వెదజల్లుచునే యున్నది.
Also read: మరోసారి లంకాదహనం
వూటుకూరు జానకిరామారావు