రామాయణమ్ – 179
‘‘ప్రభూ, అదుగో తోకమీద తెల్లగా రోమములతో మహాకాయుడైన వానరుడున్నాడే అతని పేరు హరుడు. భయంకరమైన కన్నులతో చుట్టూ నల్లని మేఘములున్నట్లుగా జుట్టు కలవాడున్నాడే వాడు ధూమ్రుడు. నర్మదా నది తీరాన కోట్ల సంఖ్యలో ఉన్న వానరులకు అధిపతి.వానిపక్కన పర్వతమంత ఉన్నవాడు వాని తమ్ముడు జాంబవంతుడు. అదుగో అక్కడ ఉత్సాహముగా ఎగురుతున్నాడే అతను దంభుడు. అదుగో ఆ పర్వతాన్ని ఆనుకోని పర్వతమంత ఎత్తు ఉన్నవాడు సంనాదుడు.
Also read: కోలాహలంగా రామసేతు నిర్మాణం
‘‘నీ సోదరుడు కుబేరుని నివాస స్థానమే ఆవాసముగా గల మహాయోధుడొకడు కలడు అతను క్రధనుడు.ఇంకా ప్రమాధి, గవాక్షుడు, కేసరి, శతబలి, గజుడు, గవయుడు, నలుడు, నీలుడు వీరంతా ఒక్కొక్కరే లంకను ముట్టడించగల సమర్థులు. వీరు కోట్లకొద్దీ సైన్యముతో రామ కార్యము నిమిత్తమై తమ ప్రాణములు లెక్కించక సమరోత్సాహముతో కదం తొక్కుతున్నారు’’ అని సారణుడు తన ప్రభువైన రావణుని కి చెప్పిన వెంటనే శుకుడు ఆ సైన్యపు సంఖ్యను చెప్పుచున్నాడు .
మొత్తము అచట చేరిన వానరుల సంఖ్య ఇరవై కోట్ల గోలాంగూలములు, వెయ్యి శంకువుల భల్లూకములు, నూరు వృందముల వానరులూ ఉన్నారు.
Also read: రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం
(భారతీయ గణిత శాస్త్రములో సంఖ్యలను రామాయణ కాలమునాటికే నిర్వచించారు మన ఋషులు అనటానికి ఇదే తార్కాణం.
వంద లక్షలు ఒక కోటి. లక్ష కోట్లు ఒక శంకువు. వెయ్యి శంకువులు ఒక మహా శంకువు. వెయ్యి మహా శంకువులు ఒక వృందము. వెయ్యివృందములు ఒక మహావృందము. వెయ్యి మహా వృందములు ఒక పద్మము. వెయ్యిపద్మములు ఒక మహాపద్మము. వెయ్యి మహాపద్మములు ఒక ఖర్వము. వెయ్యి ఖర్వములు ఒక మహాఖర్వము. వెయ్యి మహాఖర్వములు సముద్రము. వెయ్యి సముద్రములు ఒక ఓఘము. వెయ్యి ఓఘములు మహౌఘము ….
ఇవీ భారతీయ గణితములోని అంకెల పేర్లు …భారతీయగణిత ప్రతిభ అది)
మహాప్రభూ, ‘‘అతడు సింహము. అంతటి వీరుడు ముల్లోకములలో ఎక్కడనూ లేడు.అతడే ఖరాంతకుడు, దూషణుడి తలదునిమిన వాడు. త్రిశిరుడి శిరస్సు త్రెంచినవాడు. కబంధుడిని కడతేర్చినవాడు. విరాధుని చంపినవాడు. ఒంటిచేతితో జనస్థానములో పదునాలుగువేలమంది మనవారి తలలను తెగటార్చి చెండాట ఆడినవాడు. అందుకు ఆయనకు పట్టిన సమయము కేవలము ముప్పది నిముసములు. అతడే దశరథ పుత్రుడు రామచంద్రుడు. అన్నకున్నంత బలపరాక్రమములు గల వీర్యవంతుడు, తేజోనిధి రామానుజుడు లక్ష్మణుడు.
Also read: విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు
‘‘ఇక అక్కడ చేరిన వానరులు ఒక్కొక్కడు ఒక పర్వతమంత, వారు నడుస్తున్నప్పుడు వారి అంగలే యోజనదూరముండును.’’ ఈవిధముగా రావణునికి చెప్పినవాడు శార్దూలుడు అను ఇంకొక గూఢచారి.
శుకసారణులు రాముని బలము ఔదార్యము చెప్పి ఆయనతో సంధి చేసుకో అని సలహా ఇవ్వగా వారిని ఈసడించి పంపివేసి ఇతడిని పంపినాడు రావణుడు.
ఇతడుకూడా వానరులచేతిలో నలిగి నల్లపూసయై చావుదెబ్బలుతిని శ్రీరాముని దయ చేత ప్రాణములు నిలబెట్టుకొని రావణుని ముందు నిలిచి పైవిధముగా చెప్పి రాజా సంధి యొక్కటే మనకు మార్గము అని చెప్పినాడు.
ఇంతలో చారులు ‘‘సువేల పర్వతము వద్ద రాముడు ఉన్నాడు. వానర సేనా సముద్రము పెనుఉప్పెనలా లంకపై విరుచుకు పడబోతున్నది’’ అను వార్త తెచ్చినారు.
Also read: తనను శరణు కోరినవారిని రక్షించి తీరెదనని పలికిన రఘుపతి
అది విని విచలిత మనస్కుడై మాయావి అయిన విద్యుజ్జిహ్వుని రప్పించినాడు.
ఓయీ నీవు “సీతను మాయతో మోహింపచేయవలెను. నీవు రాముని శిరస్సును ధనుర్బాణములను నీ మాయతో సృష్టించుము. తల అప్పుడే నరికినట్లు రక్తమోడుతుండవలెను” అని ఆజ్ఞాపించాడు.
దొరా ఇదుగో నేను సిధ్ధము అని అతడు వెనువెంటనే పలికినాడు.
Also read: విభీషణుడు స్వాగతించదగినవాడేనన్న రామచంద్రుడు
వూటుకూరు జానకిరామారావు