రామాయణమ్ – 190
రావణుడు అలా ప్రేరేపించి రెచ్చగొట్టగానే హనుమంతుడు, ‘‘ఓయీ రావణా, మునుపు నీకుమారుడు అక్షునికి పట్టిన గతే నీకూ పట్టగలదు’’ అని అనగానే పట్టరాని కోపముతో పిడికిలి బిగించి ఎత్తి హనుమ వక్షస్థలము పై ఒక గుద్దు గుద్దినాడు రావణుడు .
ఆ దెబ్బకు తూలిపడ్డ హనుమ వెంటనే నిలదొక్కుకొని తన అరచేతిని చాచి రావణుని కొట్టెను. ఒక్కసారిగా భూకంపము వచ్చినప్పుడు పర్వతము కంపించిన విధముగా రావణుడు కంపించెను. ఆ తరువాత తేరుకొని హనుమంతుని బలమును ప్రశంసించెను. అందుకు బదులుగా హనుమ, “ఆ నాదీ ఒక బలమేనా? నా దెబ్బ తిని కూడా నీవు జీవించి ఉన్నావు” అని పలికి ‘‘నీకు చేతనైతే నన్ను మరొక్కమారు కొట్టు. ఆ తరువాత నా అసలు దెబ్బ ఎటులండునో నీవు రుచి చూతువుగాని’’ అని రావణుని రెచ్చగొట్టెను.
Also read: రావణ వీరవిహారం, వానరవీరులపై శరపరంపర
ఆ సవాలుకు రోషముచెంది హనుమ బాగా తూలిపోవునట్లుగా తన ముష్టిఘాతమునిచ్చి మరల ఆయన తేరుకునేలోపులోనే నీలునిమీద యుద్ధానికి వెడలెను.
నీలునికి, రావణునికి ఘోరమైన యుద్ధము జరిగెను. ఆ యుద్ధములో నీలుడు తన రూపమును అవసరానికి తగినట్లుగా వివిధ పరిమాణములలోనికి మార్చుచూ రావణుని చీకాకు పరచెను.
ఎడతెరిపి లేని వర్షంలా కురుస్తున్న ఆ రావణుడి శరములనుండి తప్పించుకొనుటకు నీలుడు అతి సూక్ష్మశరీరముతో రావణుని రధముమీది జండా పై వ్రాలెను. రావణుడిబాణాలకు చిక్కకుండా పలువిధాలుగా ఆ రాక్షసరాజు రధముపై చిత్రవిచిత్రవిన్యాసాలు చేయసాగెను.
Also read: హనుమ, అంగద ప్రతాపం, రాక్షస యోధుల మరణం
అప్పుడు రావణుడు కోపించి ఆగ్నేయాస్త్రప్రయోగము చేయగా ఆ అస్త్రము బలముగా తాకినప్పటికీ ప్రాణాంతకము కాలేదు ….ఏలనన అగ్నిదేవుడి పుత్రుడు నీలుడు….మూర్ఛపోయి నేలపైబడిన నీలుని వదిలివేసి లక్ష్మణుని వైపుకు బయలుదేరినాడు రావణాసురుడు.
…..
అదుగో! అప్పుడే శత్రుభయంకరమైన ధనుష్టంకారము రావణుని చెవులకు తాకింది …అది యుద్ధానికి ఆహ్వానిస్తున్న రామానుజుడు చేసినది.
‘‘వానరులతో యుద్ధమేల నీకు? రా ఇటురా, రావణా. చేతనయితే నాతో యుద్ధముచెయ్యి’’ అని పలికిన లక్ష్మణుని పలుకులు విని తీవ్రమైన క్రోధముతో బంగారు పొన్నులు గల ఏడు బాణములను ఒకే సారి సౌమిత్రిపైకి విడిచిపెట్టాడు రావణుడు. దూసుకుంటూ తనవైపే వస్తున్న ఆ ఏడింటినీ లక్ష్మణుడు ఒక అర్ధచంద్రాకారపు బాణముతో దారిలోనే ఖండించివేసెను.
Also read: గరుత్మంతుడి ఆగమనం, రామలక్ష్మణులకు నాగబంధవిముక్తి
ఒకేసారి వేలకొద్దిగా బాణాలు లక్ష్మణుని లక్ష్యము చేసుకొని రావణుడు ప్రయోగించగా వాటన్నిటినీ వమ్ముచేసి రావణుడిని అంతమొందించవలెనని సంకల్పించి కాలాగ్నిసదృశమైన శరములను సంధించి విడిచినాడు లక్ష్మణుడు. వాటిని నిర్వీర్యము చేసి ఒక పదునైన శరముతో లక్ష్మణుని నుదుటి పై బలముగా తగులునట్లు కొట్టినాడు రావణుడు.
ఆ దెబ్బకు ఒక్కసారిగా కదిలి తూలిపడిపోయినాడు లక్ష్మణుడు. మరల వెను వెంటనే తేరుకుని మూడుబాణములను సంధించి అంతే తీవ్రముగా రావణుని కొట్టెను. ఆ శరములు మూడు రావణుని శరీరమును తూట్లుపొడిచి విపరీతముగా బాధించెను. ఇక లాభములేదు అనుకొని రావణుడు బ్రహ్మ ఒసంగిన శక్తిని ప్రయోగించగా, అది సౌమిత్రిని బలముగా తాకి మూర్ఛనొందించెను.
క్రింద పడిపోయిన లక్ష్మణుని తీసుకొనిపోవుటకు రావణుడు ప్రయత్నించినాడు కానీ లక్ష్మణుని ఎత్తుట వానికి సాధ్యము కాలేదు. ఎత్తలేకపోయినాడు. ఆతని బలము చాలలేదు. అది చూసిన హనుమంతుడు వాయువేగముతో వచ్చి రావణుడి ముఖముపై పిడికిలి బిగించి గుద్దినాడు. ఆ దెబ్బకు వాడు ముక్కువెంట, చెవులవెంట, నోటినుండి రక్తము కక్కి స్పృహ కోల్పోయినాడు. ఆ వెంటనే లక్ష్మణుని తనభుజముపై ఎత్తుకొని రాముని వద్దకు తీసుకువెళ్ళినాడు మారుతి.
Also read: ఇంద్రజిత్తు నాగాస్త్రం వల్ల మూర్ఛిల్లిన రామలక్ష్మణులు
వూటుకూరు జానకిరామారావు