రామాయణమ్ – 169
ప్రాతఃకాలము లో విభీషణుడు గొప్ప తేజస్సుగలసూర్యుడు మేఘమండలములో ప్రవేశించినట్లు అన్నమందిరములోనికి ప్రవేశించెను.
రాక్షససార్వభౌమునికి జయజయధ్వానములతో అభివాదము చేసి నమస్కరించి నిలిచెను. కనుసైగ చేసి అక్కడ ఉన్న ఒక ఉన్నత ఆసనము రావణుడు తమ్మునకు చూపించి కూర్చొమ్మని చెప్పగా రావణ సహోదరుడు సుఖాసీనుడాయెను.
మంచి మాటలతో అన్నగారిని ప్రసన్నుడిని చేసుకొని దేశకాలప్రయోజనమునకు అనువైన మాటలు పలికెను.
Also read: సీతను రామునికి అప్పగించుము, రావణుడికి విభీషణుడి హితవు
‘‘అన్నా, సీతాదేవి లంకలో పాదము మోపినది మొదలు మనకు అశుభ శకునములు గోచరించుచున్నవి.
హోమాగ్ని ప్రజ్వరిల్లుట లేదు.
జ్వాలను పొగ ఆవరించుచున్నది.
సర్పసంచారము సర్వప్రదేశములలో ఎక్కువ అయినది.
Also read: రావణుడి సేనాధిపతుల ప్రేలాపన
ఆవు పాలు విరిగిపోవుచున్నవి.
ఉత్తమోత్తమమయిన గజములు కూడా మదజలములు స్రవించుట లేదు.
గుఱ్ఱపు సకిలింపులు దీనముగాయుండి అవి పచ్చగడ్డి కూడా మేయుటలేదు.
గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు తమ కన్నులనుండి జలజలా నీరుకార్చుచున్నవి. గ్రద్దలు మండలాకారముగా తిరుగుచూ వ్రాలుచున్నవి.
సంధ్యాసమయములో నక్కల ఊళలు అమంగళముగా కూయుచున్నవి.
మహారాజా, నేనీమాటలు అజ్ఞానము వలనను, లోభము వలనను పలుకుచున్నను నీవు మరొక విధముగా భావింపకుము. ఈ దుర్నిమిత్తములు నాకే కాదు సమస్త లంకాపురవాసులకు కూడా కనిపించుచున్నవి. నీకు చెప్పుటకు ఎవరికీ ధైర్యము సరిపోవడం లేదు.’’
Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న
విభీషణుని ఈ మాటలు విని రావణుడు కోపముతో జేవురించిన ముఖము కలవాడై, ‘‘విభీషణా, రాముడు ఇక ఎన్నటికీ సీతను పొందజాలడు. ఇంద్రాది దేవతలతో కలిసి నాపై దండెత్తి వచ్చినా రాముడు యుద్ధములో నా ఎదుట నిలువలేడు. చెప్పినది చాలు ఇకనీవు వెళ్ళవచ్చును’’ అని విభీషణుని పంపివేసెను.
కోరిక. శరీరాన్ని దహించి వేసే కోరిక. బుద్ధికి మసిపూసిన కోరిక. చదివిన వేదాలు,
చేసిన తపస్సులు, నిరర్ధకంచేసే కోరిక. పద్మిని, పద్మగంధి జగదేకసౌందర్యరాశి సీతాదేవి పొందుకోరే కోరిక.
అది కోరిక కాదు. తాను, తన వారు పెట్టే చావుకేకలను సూచిస్తూ తన మనస్సు మ్రోగించే మరణమృదంగం. అది తెలుసుకోలేనంతగా పిచ్చికోరిక. తన విజ్ఞతను కప్పిపుచ్చిన అవివేకం అని కూడా తెలుసు కోలేనంత విపరీతపు కోరిక తన దుస్తుల్లో దూరిన కాలనాగు వలే తనను తనవారిని కాటువేసే తన మనస్సులోని కోరిక.
Also read: మహేంద్ర పర్వత సానువుల్లో రామలక్ష్మణులు, వానరసైన్యం
ఆమె సౌందర్యం రాముడికి ఆహ్లాదకరం. ఆమె సౌందర్యం రాక్షసేశ్వరుడికి వినాశకారకం. కామముచేత కృంగి కృశించిన రావణుడు నశించే సమయమాసన్నమైనదని తెలుసుకోలేక పోతున్నాడు. ఎక్కడెక్కడి రాక్షస యోధులు తన ముంగిటకు తక్షణమే వచ్చి వాలాలని ఆజ్ఞలు జారీ చేసి సభాభవనమందు తన మంత్రులతో సమావేశమయినాడు రావణుడు. చీమల బారులులాగ రాసాగిన రాక్షసయోధుల కోలాహలంతో లంకానగర వీధులు సందడిసందడిగా ఉన్నాయి.
అందరి పరుగూ రావణమందిరము వైపే. అందరి పయనం మృత్యపరిష్వంగంలోకే.
Also read: సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన
వూటుకూరు జానకిరామారావు