రామాయణమ్ – 212
పండురాలినట్లుగా ఒక శిరస్సు నేలరాలినది. మరల ఇంకొకటి మొలుచుకొచ్చినది. వెంటవెంటనే అలసట లేకుండా రాముడు బాణము విడుచుట అది శిరస్సును ఖండించుట మరలమరల అది మొలకెత్తుట ఈ విధముగా నూరుప్రయత్నములు చేసిన రాఘవుడు ఆలోచనలో పడి అతని శిరస్సును వదలి వక్షస్థలము పై గురిచూసి కొట్టసాగెను. వారిరువురి మధ్య ఘోరయుద్ధము జరుగుచున్నది.
Also read: తెగి మొలచిన రావణు శిరస్సులు
పగళ్ళు గడచిపోయినవి
రాత్రులు వచ్చు స్పృహే లేదు వారిరువురికీ, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నిర్విరామముగా పోరుసాగించిరి.
తెగని ముడిపడని ఆ యుద్ధము చూసి దేవేంద్ర సారధి మాతలి రామునితో ‘‘రామభద్రా, ఏమీ తెలియని విలుకాని వలే ఏమిటీ సాగతీత? అసలు రావణ సంహారమునకు నీకు ఇన్ని రోజులు అవసరమా?
‘‘బ్రహ్మస్త్రమును అభిమంత్రించి వదలవయ్యా!’’ అని సూచించినాడు.
Also read: రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి
వెంటనే రాముడు తన అమ్ముల పొదినుండి తనకు అగస్త్య భగవానుడు ప్రసాదించిన బ్రహ్మస్త్రమును తీసుకొని అబిమంత్రించి రావణుని వక్షస్థలము బ్రద్దలగునట్లగా ఆకర్ణాంతము నారిసారించి వదిలిపెట్టెను. అది సకలలోక భయంకరముగా గాలిని చీల్చుకుంటూ వెళ్ళి రావణుని గుండెలు బ్రద్దలుకొట్టి, అదేవేగముతో భూమిలోకి దూసుకుని వెళ్ళి మరల అంతే వేగముతో పైకిలేచి రాముని అమ్ములపొదిలో చడీచప్పుడు లేకుండా చేరిపోయెను
….
రావణుని హృదయము పగిలిపోయి రక్తము ధారగా పైకి ఎగసినది. చేతిలోని విల్లు నెమ్మదిగా నేలజారినది ,కన్నులు మూతపడినవి. ప్రాణము పోయి రధములో దభిల్లున దేహము కూలబడినది.
తమ రాజు కూలిపోయినాడని తెలిసికొని ఎక్కడికక్కడ కకావికలై రాక్షస సైన్యము పరుగులుపెట్టగా వానరులు వారిని తరిమి తరిమి కొట్టసాగిరి. కంట నీరు పెట్టుకుంటూ రాక్షసులు కోటలోనికి పారిపోయిరి.
Also read: రామ-రావణ భీకర సమరం
రావణ వధతో దేవతల ఆనందమునకు అవధిలేక పోయినది. వాయువు సుగంధ పరీమళములు మోసుకొని వచ్చెను. సూరీడు మురిసి మెరిసి పోయినాడు. అంతరిక్షమందు దేవతలు ఆనందతాండవము చేసి దుందుభులు మ్రోగించిరి.
లోకములలో ఒక ప్రశాంతత నిశ్శబ్దతరంగము వలె వ్యాపించినది.
దశరథనందనుని చుట్టూ దేవ, వానర, ముని గణాలు చేరి జయజయధ్వానములు చేసిరి.
విభీషణుని శోకమునకు అంతులేక పోయినది. అన్నను ఎప్పుడూ విజయుడిగానే చూసినాడతడు. ఆతని వక్షస్థలాన్ని ఢీకొని దేవేంద్రుని వజ్రాయుధము కూడా మొక్కవోయిన వైనము చూసినాడు. అతడి వీరత్వానికి సకలలోకములు దాసోహమనుట చూసినాడు …
కానీ
నేడు ఒక మానవుడైన రాముని చేతిలో పరాజితుడైనాడు అతడు. తాను చెప్పిన హితవులు తలకెక్కించుకొనక తన అంతమునకు తానే పథక రచన చేసికొన్నాడు.
Also read: మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ
శోకము పెల్లుబికిన విభీషణుడు అన్నమృతదేహాన్ని చూసి …
‘‘వీరుడా, మొక్కవోని పరాక్రమము కలవాడవే! సకలశాస్త్రపారంగతుడవే! నీతికోవిదుడవే! సకల ఐశ్వర్యాలు స్వంతము చేసుకొని అనుభవించినవాడవే. నేడిలా ఏలనయ్యా భూమిపై శయనించినావు?
‘‘ఒక్క తప్పు నీకు ముప్పు తెచ్చునని చెప్పిన నా హెచ్చరికలు నీకు రుచించలేదే!
వందిమాగధులవలె నీ అంతేవాసులు పొగిడిన పొగడ్తలు నీ బుద్ధిని కప్పివేసి నిన్ను కడతేర్చువరకు తీసుకొనివచ్చినవే! అవునులే మృత్యువు తోసుకొని వస్తే అంతేలే!
‘‘సమర్ధుడవు ,రాజనీతి ఎరింగినవాడవు, ధర్మము తెలిసినవాడవు, మూర్తీభవించిన బలమే నీవు, శ్రేష్ఠమయిన ధనుర్ధారివి! నేడు రక్తమాంసములతో బురదబురద అయిన యుద్ధభూమిలో కూరుకొని పోయినావా? అన్నా, నా మాట ఏల వినలేదు నీవు …’’ అనుచూ కంటికి మంటికి ఏకధారగా విలపించినాడు విభీషణుడు.
Also read: రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు
వూటుకూరు జానకిరామారావు