రామానంద్ సాగర్ నిర్మించిన మహత్తరమైన టీవీ సీరియన్ రామాయణ్ లో రావణాసురుడుగా అద్భుతంగా నటించిన నటుడు అరవింద్ త్రివేదీ ఈ లోకం వీడి వెళ్ళిపోయారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. అదే సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ సహనటుడు త్రివేదీ మరణాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ పెట్టారు. త్రివేదీ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహ్రీ సైతం సంతాప సందేశం పెట్టారు. అరవింద్ త్రివేదీ తనకు ఆప్తమిత్రుడని గోవిల్ అభివర్ణించారు. ‘‘బహుత్ దుఖద్ సమాచార్ హై కీ హమారే సబ్కే ప్యారే అరవింద్ భాయ్ అబ్ హమారే బీచ్ నహీ రహే(మన మధ్య మన అందరి ప్రియతమ సోదరుడు అరవింద్ భాయ్ లేరు. ఇది చాలా దుఃఖం కలిగించే సమాచారం)’’ అని లాహ్రీ ట్వీట్ పెట్టారు. ‘‘చాలా మంచి మానవీయమైన వ్యక్తి,’’ అంటూ రామాయణ్ లో సీతగా నటించిన నటీమణి దీపికా చిఖ్లియా వ్యాఖ్యానించారు.
రామాయణ్ సీరియల్ లో ముఖ్యభూమికను పోషించిన అరవింద్ త్రివేదీ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘‘అరుదైన గొప్ప నటుడే కాకుండా ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే అరవింద్ త్రివేదీని మనం కోల్పోయాం. రామాయణ్ టీవీ సీరియల్ లో అతను ప్రదర్శించిన నటనాకౌశలాన్ని తరతరాల భారతీయులు మరచిపోరు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం. ఓం శాంతి,’’అని ప్రధాని సందేశంలో అన్నారు.
అరవింద్ వృద్ధాప్యంలో సహజంగా ఉండే ఆనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారనీ, గుండెపోటు కారణంగా మంగళవారం రాత్రి మరణించారనీ అరవింద్ సమీప బంధువు కౌస్తుభ్ ట్రివేదీ ‘ఈటైమ్స్’ కి తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అరవింద్ త్రివేదీ మరణించినట్టు పుకార్లు షికార్లు చేశాయి. సునీల్ లాహ్రీ వాటిని ఖండించి దేవుడి దయవల్ల అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని వివరణ ఇచ్చారు.
నిరుడు కోవిద్ కారణంగా లాక్ డౌన్ విధించినప్పుడు దూరదర్శన్ రామాయణ్ సీరియల్ ను తిరిగి ప్రసారం చేసింది. మళ్ళీ మంచి జనాదరణ పొందింది. 1987లో తొలిసారి రామానంద్ సాగర్ రామాయణ్ ప్రసారమైనప్పుడు ఘనకీర్తి సాధించింది. బాలీవుడ్, గుజరాతీ సినిమారంగాలలో సుమారు 300 సినిమాలలో అరవింద్ త్రివేదీ నటించారు. ‘విక్రమ్ అవుర్ బేతాల్’ పేరుతో వచ్చిన సీరియల్ లో కూడా ఆయన నటించారు.
good analysis of Dr.Bhaskarao