Sunday, December 22, 2024

సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు

రామాయణమ్ 84

హృదయంలో కామజ్వాలలు ఎగసి ఎగసి పడుతున్నాయి రావణునికి అవి అతనిని ఉన్నచోట ఉండనీయటంలేదు. కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతున్నాడు.

శరీరాన్నిఅలంకరించుకున్నాడు. సుగంధపరీమళాలు వెదజల్లే ద్రవ్యాలు వంటికి పూసుకున్నాడు. “సీత ఇక నాదే” అనే భావన వాడి నరనరానా వ్యాపించగా ఇక ఉండబట్టలేక ఆవిడను ఉంచిన అంతఃపురప్రదేశానికి మనోవేగంతో విచ్చేశాడు.

కన్నులు కన్నీటి చెలమలయై హృదయంలో బడబాగ్ని చెలరేగుతూ బుసలు కొడుతూ బంధింపబడిన ఆడనాగులాగా నిస్సహాయంగా రాక్షసస్త్రీల మధ్య ఉన్న సీతాదేవి ని చూశాడు.

Also read:నగల మూటను వానరులకు అందేవిధంగా కిందికి జారవిడిచిన సీత

అమాంతం ఆవిడను ఎత్తుకొని తన రాజసౌధాన్ని అంతా తిప్పిచూపుతూ సంధిప్రేలాపనలు పేలుతున్నాడు. ఆ రాజసౌధాలన్నీ బంగారము, వెండితో నిర్మింపబడిఉన్నాయి. స్తంభాలకు మణులు పొదగబడి ఉన్నాయి. ఉద్యానవనాలు,దిగుడుబావులు , పద్మసరస్సులతో కూడి నయనమనోహరంగా వైభవము ఉట్టిపడుతున్న ప్రాసాదాలన్నీ చూసింది సీతాదేవి.

‘‘సీతా! నా అవసరము చెప్పనవసరములేకుండా నా మనసులో ఉండగనే అది గ్రహించి పని పూర్తిచేయుటకు ఎల్లప్పుడూ వేయిమంది ముందుకు వస్తూ ఉంటారు. సీతా! ఎందరో మేలైన, ఉత్తమురాండ్రైన నాచే కొనితేబడిన అనేకమయిన స్త్రీలకు నీవు ప్రభువుగా ఉండుము. నీకు మరొక ఆలోచన వద్దు. నీ యందే మనస్సు నిలుపుకొన్న నన్ను అనుగ్రహించు.

Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత

రాముడు. వాడొక దరిద్రుడు. ఇంటినుండి వెడలగొట్టబడిన నిస్సహాయుడు. వాడు ఇక్కడకు వచ్చి నిన్ను రక్షించడం కల్ల. లంక   నలుమూలలా సముద్రము చేత ఆవరింపబడి ఎత్తైన శిఖరము మీద ఉన్న శత్రుదుర్భేద్యమైన నగరము! ఒకే ఒక తమ్ముడు తోడుగా ఉన్న వాడు ఇంత దూరము వచ్చి నిను తీసుకొని వెళ్ళటము అసంభవము .

ఆ రాజ్యభ్రష్టుడిమీద ఆలోచనలు వదులుకో. నీ సుందరమైన పాదాలకు నమస్కరిస్తున్నాను. రా! నాతో రమించు! నీతో కలిసి రసరమ్యలోకాలను చుట్టివస్తాను.’’

నిస్సిగ్గుగా రావణుడు ప్రేలుతున్న మాటలు వింటూ చీరకొంగుతో ముఖమును కప్పుకొని కన్నీరు కారుస్తూ  ఏ మాత్రమూ భయపడక తనకూ రావణునకు మధ్య గడ్డిపరకను అడ్డము వుంచి, రావణా, సత్యసంధుడూ, మహాబాహువూ అయిన రాముడే నా భర్త! నా దైవము! ఓరీ నీవూ నీబలము ఆయనకు గడ్డిపోచతో సమానము. మహాభయంకరులు, యమకింకరులూ అంటూ నీ రాక్షసవీరుల గురించి ఏవేవో వదరుతున్నావు. రాముడనే గరుత్మంతుని ముందు నీ రాక్షససర్పాలు విషహీనమై చీల్చి చెండాడబడతాయి. రాముడి సమక్షంలో నన్ను నీవు అవమానించగలిగినట్లయితే ఆ క్షణమే నీ ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయి ఉండేవి. రాముడితో వైరము పెట్టుకొని బ్రతికి బట్టకట్టాలనే అనుకుంటున్నావా?  రాముడే నన్ను విడిపిస్తాడు. నీవు చేసినపనికి నీ లంక, నీ లంకానగర స్త్రీలు సమస్తము వైధవ్యము పొందుతారు జాగ్రత్త!’’

Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు

సీతమ్మ ఇంకా హెచ్చరిస్తున్నది రావణాసురుడిని.

‘‘అధముడా,  ధర్మమునందే స్థిరమైన రాముని పత్నిని నీవిక తాకనుకూడా తాకలేవు! ఓరీ రాక్షసాధమా, ఈ శరీరాన్ని బంధిస్తే బంధించావు. చంపివేయదలచుకుంటే చంపివేయి.  నా శరీరాన్నికానీ ప్రాణాన్ని కానీ రక్షించుకోవాలన్న కోరిక, ఆసక్తి నాకు ఏమాత్రమూ లేదు.

భూలోకములో అపకీర్తి కలిగేపని మాత్రము చేయనుగాక చేయను.’’

సీతామాత చాలా కోపంగా పరుషంగా మాట్లాడి కాసేపు ఊరకున్నది.

ఆవిడను భయపెట్టి అయినా సరే లొంగదీసుకోవాలనుకున్నాడు రావణుడు. ఆవిడతో ఇలా అన్నాడు. ‘‘ఓ సీతా,  విను. నీకు పన్నెండు మాసాలు మాత్రమే గడువిస్తున్నాను. ఈ లోపు నా దారికి వచ్చి

నా దరిచేరినావా సరే!  లేని పక్షమున ఉదయపు అల్పాహారములో నీ మాంసము వండించుకొని తినగలను’’ అని తీవ్రముగా బెదిరించి ,అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో ‘‘ఏ విధముగానైనా సరే దీని గర్వాన్నిపోగొట్టండి. సామ, దాన, దండోపాయాలు ప్రయోగించండి’’ అని పలికాడు .

వాడు అలా అనటమే ఆలస్యం భయంకరాకారముగల స్త్రీలు సీతాదేవిని చుట్టుముట్టి నిలిచారు.

సీతాదేవిని అశోకవనమునకు తరలించి రహస్యప్రదేశములో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు రావణుడు.

జనకునికొమరిత. దశరధుని కోడలు. రామపత్ని. అతిలోకవీరుడైన లక్ష్మణుని వొదినగారు. అలా నిస్సహాయంగా సుఖమును కోల్పోయి దుఃఖిస్తూ స్పృహకోల్పోయి అశోకవనమందు పడియున్నది.

Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు

……

అక్కడ రాముడు …..

NB.

((అదీ సీతమ్మ అంటే.

అంతేగానీ మన సినిమాలలో చూపించినట్లు నిస్సహాయంగా పడి ఉండే అబల కాదు! అనంతశక్తిరూపిణి. అద్భుత చైతన్యదీప్తి మన తల్లి సీతమ్మ!

ప్రాణముపోతే పోయింది వెధవప్రాణము.

కానీ విలువలు ఎంత గొప్పవి!

ఇదీ సీతమ్మ అంటే!

ఇదీ భారతీయ సంస్కృతి!

Height of a Woman’s imagination in this country is SITHA AND SAVITHRI ..

అని అంటారు స్వామి వివేకానంద !

వ్యక్తి సౌఖ్యమా? సమాజ హితమా? ఏది ముందు?

అంటే సమాజ హితానికే ప్రాముఖ్యత భారతీయ ధర్మశాస్త్రాలలో !

No room for INDIVIDUAL COMFORT.

SOCIETY IS ABOVE INDIVIDUAL.

ఇదీ భారతీయమ్!

Also read: సీతను రథములో బలవంతంగా ఎక్కించుకున్న రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles