రామాయణమ్ – 81
తనను ఎదిరించవచ్చి మాటలాడుచున్న జటాయువును చూసి రావణుని ఇరవై కళ్ళూ చింతనిప్పులలాగ అయిపోయినవి. భయదోగ్రముఖము కలిగిన రావణుడు అతి వేగముగా జటాయువు మీదకు యుద్ధానికి వెళ్ళాడు.
రెక్కలున్న రెండు మహాపర్వతములు ఢీకొట్టుకుంటున్నవా అనునట్లుగా ఆ ఇరువురూ కలియబడినారు.
రావణుడు భయంకరమైన వంకరములుకులున్న బాణములు, సన్నని ములుకులు గల బాణాలతో ఆ పక్షిరాజును కప్పివేశాడు.
Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు
ఆ బాణములన్నింటినీ తన బలమైన రెక్కలను అల్లలలాడించి ఎగురకొట్టి వేసిన జటాయువు వాడివాడిగోళ్ళు కలిగిన తన పాదాలతో వాడిముఖాన్ని శరీరాన్నీ తీవ్రగాయాలుకలుగునట్లుగా చీరివేశాడు.
వెంటనే కోపించిన రావణుడు మృత్యుదండములవంటి పదిబాణాలను ఒకేసారి ప్రయోగించి జటాయువు శరీరము బ్రద్దలయ్యేటట్లుగా తీవ్ర వేగంతో కొట్టాడు.
సీతను రక్షించుట అనే విషయము మీదనే దృష్టినిలిపిన జటాయువు ఆ బాణాలను లెక్కసేయక ఒక్కసారిగా రావణుని మీదకు దూకి వాని చేతనున్న మణిమయ ధనుస్సును బాణములను రెప్పపాటులో పాదములతో విరిచివేసి తన రెక్కలతో వానిని కప్పివేసి ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు.
Also read: సీతను రథములో బలవంతంగా ఎక్కించుకున్న రావణుడు
రావణుడికి కోపము మరింత హెచ్చి మరొక ధనుస్సు చేతబూని వందలు వేలుగా పుంఖానుపుంఖాలుగా శరములను జటాయువు మీదకు వర్షించసాగాడు.
ఆ బాణములచే కప్పబడ్డ జటాయువు గూడులో ఉన్న పక్షిలాగ ప్రకాశించసాగాడు.
ఆ ధనుస్సును కూడా కడు లాఘవంగా విరిచివేసి తన రెక్కలచేత రావణుడు ధరించిన కవచమును వలిచివేశాడు జటాయువు.
అంతటితో ఊరుకోకుండా రావణ రధమునకు కట్టబడిన గాడిదలను చంపివేసి రధమునుకూడా విరుగగొట్డాడు. సారధి శిరస్సును తనముట్టెతో పొడిచి ఎగురగొట్టి రాజలాంఛనములను పట్టుకొన్న రాక్షసులను మహా వేగంతో క్రిందపడవేశాడు.
ఒక్కసారిగా తన ఒడిలో కూర్చుండబెట్టుకున్న సీతతో సహా భూపతనమయిపోయాడు రాక్షసరాజు.
Also read: రావణుడికి సీతమ్మ హెచ్చరిక
ఇంత పోరాటము చేస్తున్న జటాయువుకు ఒక్కసారిగా వార్ధక్యమువలన కలిగిన అలసటను గమనించి సీతాదేవిని పట్టుకొని ఒక్క ఉదుటున గాలిలోకిఎగిరి తప్పించుకొనిపో ప్రయత్నించాడు రావణుడు.
తనను తప్పించుకొని ఎగిరిపోబోతున్న రావణుని చూసిన జటాయువు శరీరములోకి ఒక్కసారిగా ఓపికను, శక్తిని కూడగట్టుకొని రయ్యిన లేచి ఎగిరి వెళ్ళి రావణుని మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు..
‘‘ఓరి రావణా, సీతాపహరణము వజ్రాయుధప్రహారము వంటిది నాశనమై పోతావు జాగ్రత్త. ఓయీ సీతాపహరణము తెలిసితెలిసి విషము కలిపిన పానీయము తాగటము వంటిది. సీతాపహరణము వల్ల మాంసపుముక్కను కట్టిన గేలమును మింగిన చేపలాగ అయిపోతావు నీవు. రావణా ! నీవు చేసిన అవమానము రామలక్ష్మణులు సహిస్తారనుకొంటున్నావా? దొంగలు వెళ్ళే దారిలో వెళ్ళావు.
Also read: రావణుడికి అమాకురాలైన సీత అతిథి మర్యాదలు
వీరులు వెళ్ళవలసిన దారా ఇది?’’ హెచ్చరిస్తూ ఈ విధంగా ఎన్ని చెప్పినప్పటికీ రావణుడు వినలేదు,
అతని పాపపు పని సహించలేక అత్యంత వేగంగా వెళ్ళి రావణుని వీపుమీద వాలాడు జటాయువు.
వాలటము వాలటమే వజ్రసమానము మరియు వాడి యైన తన గోళ్ళతో వీపు అంతా రక్కిపెట్టి పొడుస్తూ, చీరుస్తూ వాడి జుట్టు పీకుతూ పీడించసాగాడు. మహాభయంకరమైన యుద్ధం జరింది ఇరువురి మధ్య!
సీతాదేవిని ఎడమచంకలో జారిపోకుండా ఇరికించుకొని కుడి అరచేతితో చరిచాడు రావణుడు. అందుకు కోపించిన గృధ్రరాజు తన వాడిగోళ్ళతో వాడి పది భుజాలను గీరసాగాడు. రావణుడి వంటినుండి రక్తం ధారలు కట్టింది.
ఇకలాభంలేదు అనుకొని తన ఒర నుండి ఒడుపుగా ఖడ్గముతీసి జటాయువు రెక్కలు రెండూ, పాదములురెండూ, పార్శ్వములను నరికివేశాడు రావణుడు.
రెక్కలు కొట్టబడినవాడై నిస్సహాయంగా నేలమీద రక్తమోడుతూ పడిపోయాడు జటాయువు.
సీతాదేవి రావణుని తప్పించుకొని పరుగుపరుగున నేలమీదపడిపోయిన జటాయువును కౌగలించుకొని ఏడ్వసాగింది.
Also read: ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత
వూటుకూరు జానకిరామారావు