Thursday, November 7, 2024

సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన

రామాయణమ్135

ఆంజనేయుని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. నిర్మలమైన చంద్రకాంతిలో పరమపతివ్రత అయిన సీతమ్మను చూస్తూ.

ఆహా!  శీలమే ఈమెకు ఉన్న మహదైశ్వర్యము. భర్తృవియోగమే ఈమెకు పట్టిన దరిద్రము.

చుట్టూ వికృతరూపిణులయిన రాక్షసస్త్రీలు కావలి కాస్తుండగా భూమిమీద కూర్చుండి యున్న సీతాదేవిని గమనిస్తూ ఉన్నాడు హనుమ!

Also read: భీతిల్లే లేడికూన సీత

కావలి వారంతా వికృత రూపిణులే!

ఒకతె ఒంటికన్ను కలది

ఒకతి ఒక చెవి మాత్రమే కలిగినది

ఒకతే గొడుగుల వంటి చెవులు కలిగినది

ఒకతి చెవులు లేనిది

ఒకతే మొనలు దేరిన చెవులున్నది

ఒకతి తలవరకూ వ్యాపించిన ముక్కుకలది

ఒకతె జుట్టులేనిది

ఇంకొకతి కంబళివలే అల్లుకుపోయిన జుట్టుకలది

వికృతాకారము కలిగి, విపరీత ప్రవర్తనతో సీతమ్మను మానసిక క్షోభకు గురిచేయుచున్న వారంతా, వళ్ళంతా మద్యమాంసములు, రక్తమును పూసుకొని చూచుటకు భయంకరముగా నుండిరి.

Also read: ఆమె ఎవరు?

ఇందరు భయంకరరూపము దాల్చిన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చుండి భయపడిన ఆడలేడి పిల్లవలె అటుఇటు  బెదురు చూపులు చూస్తూ దీనంగా నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తున్నది సీతామహాసాధ్వి.

ఆమె అంతరంగము ఒక దుఃఖసంద్రమయి ఆమె నిట్టూర్పులు ఆ సముద్ర తరంగ ఘోషవలె యుండెను.

అది ప్రత్యూషకాలము. బ్రహ్మరాక్షసుల వేదఘోష హనుమ చెవులను తాకింది.

అప్పుడే నిద్రలేచిన రావణునకు అశోకవనములోని సీతాదేవి గుర్తుకువచ్చింది … లేచినవాడు లేచినట్లే అశోకవనమువైపు అడుగులు వేశాడు.

Also read: అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ

నిద్రావశుడై గాఢ సుషుప్తిలో ఉన్న రావణుని అంతకు మునుపు చూశాడు హనుమ.

ఇప్పుడు మోహవశుడై, కామపీడితుడైన రావణుని చెట్టుపైనుండి చూస్తున్నాడు.

ఆతని తేజస్సును చూసి ఒక్కసారిగా చెట్లగుబురులలోకి గబుక్కున జారుకున్నాడు హనుమ.

అక్కడ నుండే అన్నీ గమనిస్తూ ఉన్నాడాయన.

రావణుని వెంట నిద్రమత్తులో జోగుతూ చెదరిన హారకేయూరములను కూడా సవరించుకొనకుండా మదవతులైన ఆతని రాణులు అనుసరించి వచ్చారు.

సకల రాజలాంఛనాలు వెంబడించగా లంకాధిపతి విలాసముగా సీతాదేవి ఉన్న చోటికి నడుస్తూ వచ్చాడు.

రూపయౌవన సంపన్నుడు, ఉత్తమభూషణాలంకృతుడు అయిన ఆ రాక్షసాధిపతి సమీపించగనే పెనుగాలికి ఊగిపోయిన అరటిచెట్టువలె గజగజవణికి పోయింది సీతామహాసాధ్వి!

Also read: చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి

తన శరీరమును ముడుచుకొని సకలావయవములను దగ్గర చేర్చి కూర్చుండి విలపించసాగింది వైదేహి.

మంత్రముచేత బద్ధురాలై గిలగిల కొట్టుకొనుచున్న నాగుపాము వలె, నిజముగా లేని అపవాదుల వల్ల మాసిన కీర్తివలె, మళ్ళీమళ్ళీ వల్లె వేయక పోవడము వలన మరుగున పడి శిధిలమైన విద్యవలే ఆ సమయమున జానకీదేవి యుండెను.

రామునికొరకై ఎదురుచూస్తూ, రామునే మనసులో ధ్యానిస్తూ, దీనురాలై ఆనందమునకు దూరమైన ఆవిడను భయపెడుతూ కామవశుడైన రావణుడు మాట్లాడసాగాడు.

“ఓ సౌందర్యరాశీ! నీ అవయవసౌందర్యమును నాకు క‌పడకుండా ఏల మరగుపరచెదవు! నిన్ను నేను కామించుచున్నాను, ఏల భయపడెదవు? ఇక్కడ ఎవరూ లేరు! ఇచట నీవు భయపడవలసిన పనిలేదు. పరస్త్రీ లను హరించుట, వారితో రమించుట పాపమనుకొందువేమో. ఇది మా జాతినీతి! మా స్వధర్మము! రాక్షసులకు అది తప్పు కాదు. బలాత్కరించి అనుభవించుట మాకు స్వధర్మమే అయినను, నీవు నా పట్ల సుముఖురాలివి కానంతవరకు నేను నిన్ను తాకను.”

ఓ బాలా, బేలవై అలా నేలపై పరుండనేల?  ఒంటి జడదాల్చి మలినవస్త్రముతోనే ఉండనేల. లే! లేచి సర్వాలంకార భూషితవై  నా కైదండపై శయనింపుము! పోతే తిరిగిరానిది యవ్వనము. వృధాచేయకు లలనా  లేచి రా! నాతో రమించు! భోగించు! సుఖించు! నిన్ను చూచినవాడు ఎవడు మోహితుడు గాకుండా యుండును? బ్రహ్మకైన పుట్టును రిమ్మతెగులు!

వైదేహీ, బింకము మాని నా ప్రణయాంకము చేరుకొనుము!……

ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు రావణుడు!

Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles