రామాయణమ్ – 79
సీతాదేవి హెచ్చరికలను ఏ మాత్రము లక్ష్యపెట్టలేదు రావణుడు.
కుపితుడైనాడు. కనుబొమలు విరిచి, ‘‘ఓ సీతా, నీకు మంగళమగుగాక. నేనెవరనుకున్నావు? కుబేరుడి సవతి తమ్ముడను. “రావణుడు “అని లోకములో ప్రసిద్ధికెక్కినవాడను. మృత్యువుకు భయపడి పారిపోవునట్లు జనులందరూ నన్ను చూసి పారిపోవుదురు. దేవ, గంధర్వ, పతగ, పన్నగ, పిశాచులలో ఎవడునూ నా సమీపములోకి రావటానికి సాహసించడు. కుబేరుడిని ఓడించి అతని నగరమును స్వాధీనము చేసుకున్నవాడను “నేను.” “నేను” ఉన్నచోట వాయువు భయపడుతూ వీస్తాడు. “నేను” ఉన్నచోట సూర్యుడు తన కిరణతీవ్రత తగ్గించుకుంటాడు. “నేను” ఉన్నచోట నదులు మందముగా ప్రవహిస్తాయి. “నేను” ఉన్నచోట చెట్లు ఆకులు కదల్చటానికి కూడా భయపడతాయి “నేను” నేనే. లేడు నాకెవ్వడునూ సరిసాటి!
Also read: రావణుడికి సీతమ్మ హెచ్చరిక
‘‘నా లంక అందాల నెలవంక. అది ఇంద్రుడి అమరావతి. సముద్రమునకు ఆవలి ఒడ్డున ఒక పర్వతాగ్రము మీద ఉన్న సుందరమైన పట్టణమది.
అష్టైశ్వర్యాలతో సకల భోగభాగ్యాలతో తులతూగుతూ వున్న పట్టణమది.
అది భయంకరమైన రాక్షసుల నివాస స్థానము. నీవు నాతో కలిసి అక్కడ నివసిస్తే అప్పుడు ఈ మానవులనెవరినీ నీవు ఇక స్మరించలేవు!
రాముడసలే నీకు గుర్తురాడు. రాముడు, అతని పరాక్రమము!
అల్పపరాక్రమవంతుడు కాబట్టే తండ్రి వెళ్ళగొట్టాడు. దరిద్రుడై, రాజ్యభ్రష్టుడై కొండలు, కోనలు, అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు.
Also read: రావణుడికి అమాకురాలైన సీత అతిథి మర్యాదలు
వాడు దీనుడు. బుద్ధిహీనుడు. వాడితో నీవేమి సుఖపడతావు?
సకలరాక్షసలోకానికి ప్రభువును నేను. మహదైశ్వర్యవంతుడిని నేను.
అమిత పరాక్రమశాలిని నేను. ఆ మన్మధ సాయకాలు నా మనస్సును కాల్చివేస్తున్నాయి. నీవు నన్ను అనుగ్రహించు. రాముడు నా వ్రేలికి కూడా యుద్ధములో సరిపోడు’’ అంటూ రామ నింద చేస్తూ, కామాతూరుడై వదరుతున్న రావణుని చూసి సీతాదేవి కన్నులు కోపంతో మరింత ఎర్రబారాయి.
Also read: ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత
రావణుని ఉద్దేశించి “కుబేరుడి తమ్ముడను అని చెప్పుకునే నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు వచ్చింది? నీవు చేసే ఈ పని వల్ల సమస్త రాక్షసలోకమునకు పోగాలము దాపురించినట్లే, ఇంద్రుడి భార్యను అపహరించి జీవించగలవేమో కానీ రామపత్నిని అపహరించినచో ఇక నీ ప్రాణములపై ఆశ వదులుకో వలసిందే” అని హెచ్చరించింది సీతాదేవి!
సీతాదేవి మాటలు విన్న రావణుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. ఒక చేతిలో మరొక చేయివేసి చరిచి శరీరాన్ని పెద్దగా చేశాడు.
సీతాదేవి నుద్దేశించి పలుకుతూ ” నీవొక పిచ్చిదానివి. నా వీర్యము, బలపరాక్రమాలు ఎంత చెప్పినా నీ తలకు ఎక్కడం లేదు.
Also read: మారీచుడిని మట్టుపెట్టిన రాముడు
ఆకాశంలో నిలుచుని భూమిని ఎత్తివేయగలను. సముద్రము మొత్తాన్ని త్రాగివేయగలను. సాక్షాత్తూ మృత్యువే యుద్ధంలో నాకు ఎదురుగా నిలబడిపోరాడితే మృత్యువునే చంపివేయగల సమర్ధుడను.
ఇచ్ఛానుసారము రూపము ధరించగలను. ఓ ఉన్మత్తురాలా, చూడు నీ కోరికలు తీర్చగల నీ భర్తనైన నా రూపము చూడు.
కోపముతో మాట్లాడుతున్న రావణుని కన్నుల ఎరుపుజీరలు ప్రస్పుటంగా కనపడుతున్నాయి. సన్యాసిరూపాన్ని విడిచి యముడిలాంటి తన రూపానికి మారిపోయాడు. నల్లటి మేఘము లాగా ఉన్నాడు. పదితలల ఉగ్రరూపం ధరించాడు. ఇరువది నేత్రములు ఎర్రగా ఉన్నాయి. ఎర్రటి వస్త్రాలు ధరించి ధగధగమెరిసిపోయే స్వర్ణాభరణాలు అలంకరించుకొని ధనుర్బాణాలతో నిలిచి ఉన్నాడు.
సీతాదేవి తో ఇలా అన్నాడు రావణుడు, “నీకు భర్తగా తగిన వాడను నేనే. ఆ రాముడినిక మరచిపో. నీకు ఇష్టముకాని పని నేను చేయను. నీ మనస్సు నా పై మరల్చుము.
Also read: సీతమ్మ కంటబడిన మాయలేడి
సీతాదేవితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడను సమీపించి, ఎడమ చేతితో జుట్టుపట్టుకొని కుడిచేయి నడుము క్రింద భాగములో వేసి గట్డిగా పట్టుకొని ఒక్కసారిగా ఎత్తి లేవదీసుకొని వచ్చి చాలా పరుషముగా మాట్లాడుతూ తన రధములో తన ఒడిలో కూర్చుండ బెట్టుకున్నాడు.
మెలికలు తిరుగుతున్న ఆడపాము వలె ఉన్న సీతాదేవిని ఒడిసిపట్టుకొని ఆకాశానికి ఎగిరాడు.
సీతాదేవి ఆక్రందనలు, రోదనలు మిన్నుముట్టాయి. మత్తెక్కినదాని వలే చిత్ర భ్రమ చెందిన రోగపీడితుడు ఏ విధంగా అరుస్తాడో ఆ విధంగా అరవసాగింది. ‘‘రామా రామా రామా రామా’’ అని అరుస్తూ ఏడవసాగింది.
Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు
వూటుకూరు జానకిరామారావు