రామాయణమ్ – 182
‘‘మనుష్య రూపాలతో నేనూ, లక్ష్మణుడు, విభీషణుడు అతని నలుగురు మంత్రులు మాత్రమే యుద్ధము చేయగలము. మీరు మనుష్యరూపములో యుద్ధము చేసినట్లయిన రాక్షసులు కూడా అదే రూపములతో యుద్ధము చేయగలరు. అప్పుడు ఎవరు ఎవరివారో తెలుసుకొనుట బహుకష్టము .మీరు మీ రూపములోనే యుద్ధము చేయండి.
రాక్షసులకు నరులన్న చిన్న చూపు. వానరులన్న మరీ చిన్నచూపు. వానరరూపము ధరించుట చాలా తక్కువగా వారు భావింతురు. కావున ఆ రూపము ధరించనే ధరించరు. అప్పుడు రాక్షస సంహారము సులువు అవుతుంది’’ అని చెప్పి రాముడు ఎదురుగా ఉన్న సువేల పర్వతము అధిరోహించ నిశ్చయించినాడు.
Also read: రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం
ఆయన వెంట ప్రముఖ వానర వీరులంతా నడచినారు. ధనుస్సు ఎక్కుపెట్టి నలుదిశలా పరికించి చూస్తూ అన్నకు రక్షణగా లక్ష్మణుడు వెంట నడచినాడు.
రాక్షస సైన్యంతో కిటకిట లాడుతున్న లంకను అంతా చూశారు. వారిని చూడగనే వానరులలో కోపావేశాలు పెరిగిపోయి గుర్రుగుర్రుమంటూ వివిధ ధ్వనులు చేశారు.
Also read: సీతమ్మను రామునికి అప్పగించమని రావణుడికి తల్లి కైకసి హితబోధ
అంతలో సూర్యాస్తమయమయ్యింది. చంద్రుడు మెల్లగా ఆకాశంలోకి వస్తూ కాంతులు వెదజల్లుతున్నాడు.
పూర్ణచంద్రుడి పండువెన్నెలలు దశదిశలా వ్యాపించాయి. సుగంధాలను మోసుకుంటూ వస్తున్న వాయుదేవుడు మెల్లగా చల్లగా అందరి శరీరాలను తాకుతూ హాయిగూరుస్తున్నాడు. ఆ వెన్నెలలో లంకాపురి శోభ చెప్పనలవిగాకుండా ఉన్నది. కొందరు వానరులు ఆ పట్టణాన్ని చూసివస్తామని సుగ్రీవుని వద్ద అనుమతి తీసుకొని బయలు దేరారు.
ఇంకొక రెండుయోజనాల దూరం ఎత్తుకు నడిచారు రామలక్ష్మణ సుగ్రీవులు తదితరులు. లంకా నగర నిర్మాణకౌశలాన్ని, అచట అమర్చిన మహాయంత్రకవాటాలను, ఉన్నత శిఖర సమాన ప్రాకారాలను చూసి ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు.
Also read: వానరవీరుల వివరాలు తెలుసుకున్న రావణుడు
అక్కడ దూరంగా ఉన్న ఒక అద్భుతభవన గోపుర శిఖరం మీద రక్తాంబరాలు ధరించి రక్తచందన లేపనాలు పూసుకొని రత్నమాలాలంకృతుడై నల్లని కారుమబ్బులాగ ఒక సమున్నత ఆసనం మీద కూర్చున్న రావణున్ని చూశాడు సుగ్రీవుడు.
ఆయనలో పట్టరాని ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతే! రయ్యిన ఆకాశంలోకి ఎగిరాడు….
గాలిలోకి లేచినవాడు లేచినట్లే వెళ్లిన సుగ్రీవుడు రావణుడు కూర్చున్న సౌధోపరిభాగమున వ్రాలాడు.
వెళ్లటం వెళ్ళటమే రావణుడి మీదకు దూకి అతని కిరీటము పడగొట్టి ఎదురుగా తొడగొట్టినిలచినాడు. సుగ్రీవుని ఈ అనుకోని రాకకు తత్తరపడి ఆ తదుపరి తేరుకొని, ‘‘రా, సుగ్రీవా ఈ రోజుతో నీవు హీనగ్రీవుడవు అవ్వటం ఖాయం రా! నాతొ యుద్ధం చెయ్యి’’ అంటూ మీద కలబడ్డాడు రావణుడు.
Also read: కోలాహలంగా రామసేతు నిర్మాణం
పరస్పరము పిడిగుద్దులు గుద్దుకుంటూ గోళ్ళతో రక్కుకుంటూ ఒకరికొకరు తీసిపోని విధముగా ద్వంద్వ యుద్ధము చేయసాగారు.
ఒంటినుండి కారే రుధిరధారలతో ఆ మహాకాయులిరువురూ పూచిన మోదుగ చెట్లవలె శోభిల్లారు.
చెమట, రక్తముకలిసి వారిదేహాలనుడి కాలువలై ప్రవహిస్తున్నాయి. మోచేతులతో పొడుచుకున్నారు. అరచేతులతో చరచుకున్నారు. గోళ్ళతో రక్కుకున్నారు. కాళ్లతో కుమ్ముకున్నారు. పరస్పరతాడనాలతో, పీడనాలతో ఒకరి శరీరాన్ని మరొకరు ఎత్తివేసుకుంటూ, ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టుకుంటూ, క్రిందపడి దొర్లుతూ అలసట లేకుండా చాలాసేపు యుధ్ధము చేస్తూ ఒకరినొకరు ఆక్రమించుకుంటూ రకాల మల్లయుధ్ధ రీతులు ప్రదర్శిస్తూ పోరాడసాగారు. ఇంతలో రావణుడు మాయా యుధ్ధము ఆరంభించినాడు, అది గమనించి తటాలున లేచి చటుక్కున ఎగిరి చిటికెలో మరల రాముని సముక్షములో నిలచినాడు సుగ్రీవుడు …
తన ముందు నిలచిన మిత్రుని చూసి చిరుకోపముతో రామచంద్రుడు ఇలా అన్నాడు …
Also read: రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం
వూటుకూరు జానకిరామారావు