- దగ్గరగా రానున్న గురు, శని గ్రహాలు
- రెండు గంటలపాటు కనువిందు
- అద్భుతాన్ని వీక్షించేందుకు కోట్లాది మంది ఆసక్తి
ఆకాశంలో ఎప్పుడూ ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. కొన్నింటిని మనం భూమి మీద నుండి వీక్షించే అవకాశం ఉంటుంది. మరికొన్నింటిని ప్రయోగశాలల్లో మాత్రమే చూడగలం. తాజాగా ఓ అరుదైన సంఘటన ఇపుడు ఆకాశంలో కనువిందు చేయబోతోంది. ఈ రోజు రాత్రి గురు శని గ్రహాల కలయిక జరగనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి మీద నుంచి చూసినపుడు అవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇలాంటి కలయిక దాదాపు 4 వందల సంవత్సరాల తరువాత జరుగుతున్నట్లు నాసా తెలిపింది.
అరుదుగా మహా కలయిక
భూమి నుంచి చూసినపుడు రెండు గ్రహాలు ఆకాశంలో ఒకే చోటుకు వచ్చినట్లు కనిపిస్తే దాన్ని సంయోగంగా సైన్సు పరిభాషలో చెబుతుంటారు.సౌర కుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం రెండో అతిపెద్దదైన శని గ్రహం ఈ రోజు దగ్గరగా రానున్నాయి. సూర్యుని చుట్టూ తిరగడానికి గురు గ్రహానికి 12 ఏళ్లు, శని గ్రహానికి 30 ఏళ్లు పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే సమయంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఇవి దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తాయి. కాని ఒకే కక్ష్యలో అత్యంత దగ్గరగా ఉన్నట్లు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి నుంచి చూసినపుడు రెండు గ్రహాలు 0.1 డిగ్రీల దూరం మాత్రమే ఉంటుందని ఇలాంటి సంయోగాన్ని మహా సంయోగంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. 397 సంవత్సరాల క్రితం అంటే 1623 సంవత్సరంలో ఇలాంటి కలయిక జరిగింది. అప్పట్లో పగటి సమయంలో గురు, శని గ్రహాలు దగ్గరగా రావడంతో సూర్యుడి వెలుగులో చూడలేమని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ రోజు జరిగే గ్రహాల సంయోగం అప్పటి కంటే మరింత దగ్గరగా రావడం ఒక ప్రత్యేకత అయితే రాత్రి వేళ జరుగుతుండటం మరో ప్రత్యేకతగా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాయంత్ర ఆరు గంటల నుండి ఈ అద్బుతాన్ని ఆకాశంలో వీక్షించవచ్చు.
గురు, శని గ్రహాల కనువిందు
రెండు గంటలపాటు గురు, శని గ్రహాలు వీనుల విందు చేయనున్నాయి. మనదేశంలోని ప్రధాన నగరాలలో సూర్యాస్తమయం తరువాత ఈ గ్రహాల కలయికను వీక్షించవచ్చు. నైరుతి పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని గమనించవచ్చు. గురు గ్రహం పెద్ద నక్షత్రంలా దాని ఎడమ భాగంలో శని గ్రహం కనిపిస్తుంటాయి. మళ్లీ ఇలాంటి గ్రహాల కలయిక 2080 మార్చి 15న సంభవిస్తుందని నాసా ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మహాకలయికను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.