Sunday, December 22, 2024

అబ్బుర‌ప‌రిచే క‌ళాకృతుల‌కు నిల‌యం సాలార్ జంగ్ మ్యూజియం

హైద్రాబాద్ మ‌హా న‌గ‌రం ఒక‌ప్పుడు నిజాం పాల‌కుల ఏలుబ‌డిలో ఉంది. ఆయా పాల‌కులు వారి వారి ప‌రిపాల‌నా కాలంలో ఈ మ‌హా న‌గ‌రంలో ఎన్నో చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను నిర్మించారు. అలాంటి క‌ట్ట‌డాల‌లో సాలార్ జంగ్ మ్యూజియం ఒక‌టి. ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే ప్ర‌దేశాల‌లో ఇది కూడా ఒక‌టి. అలాగే  దేశంలో ఉన్న మూడు ప్రఖ్యాత జాతీయ ప్ర‌ద‌ర్శ‌న శాల‌ల్లో (మ్యూజియం) సాలార్జంగ్‌ మ్యూజియం ఒకటి.  మూసినది ద‌క్షిణ తీరంలో ఉన్న ఈ మ్యూజియంలో దాదాపు 48 వేల చారిత్రక వస్తువులను భద్రపర‌చ‌డం విశేషం. ఆద్యంతం అబ్బుర‌ప‌రిచే క‌ళాకృతుల‌తో అందంగా, ఆహ్లాదంగా ఉండే ఈ మ్యూజియంలో నిజాం నవాబుల ప్రధాని మూడో సాలార్జంగ్‌ మీర్‌ యూసఫ్‌ అలీఖాన్‌ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సేకరించిన అరుదైన కళాఖండాలను ఇక్కడ చూడొచ్చు.

 అయితే 1949లో మూడో సాలార్జంగ్‌ మరణించారు. దీంతో  ఆయన సేక‌రించిన కళాసంపదను స్వాధీనం చేసుకోవాల‌ని ఆయ‌న బంధువులు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే   సాలార్జంగ్‌ ఎస్టేట్‌ కమిటీ ఆ సంపదను భద్రపరిచింది. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1951, డిసెంబరు 16న సాలార్జంగ్‌ నివాసమైన దివాన్‌దేవిడిలోని ఐనఖానాలో మొదటిసారిగా ఈ కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంత‌రం ప‌ద‌కొండేళ్ళ త‌రువాత అంటే 1962లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయడంతో సాలార్జంగ్‌ మ్యూజియంలోని కళాఖండాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. అనంతరం దీనిని నయాపూల్‌ సమీపంలోని దారుల్‌షిఫాలోని ఉన్న ప్రస్తుత భవనానికి  మ్యూజియంను  తరలించారు. ప్ర‌స్తుత భ‌వ‌నంలోని మ్యూజియంను  1968 సంవ‌త్స‌రం జులై 24న నాటి రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ ప్రారంభించారు.

పాతకాలం కత్తులు, పాలరాతి బొమ్మలు

అనేక కళాకృతులకు నిలయం

క‌ళాత్మ‌క వ‌స్తువ‌ల సేక‌ర‌ణ‌కు పెట్టింది పేరు ఈ మ్యూజియం.  ప్రపంచంలోని విభిన్న యూరోపియన్‌, ఆసియా తదితర దేశాల కళాత్మక వస్తువులను చూడాలంటే సాలార్జంగ్‌ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే.  ఎన్నో క‌ళా ఖండాల‌కు ఆల‌వాల‌మైన ఈ మ్యూజియంలో అనంత‌ర కాలంలో హైదరాబాద్ ప్రధాన మంత్రి ఏడో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్ సేక‌రించిన క‌ళాకృతుల‌ను  కూడా ఇక్కడ భ‌ద్ర ప‌రిచారు. . ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్‌ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధ సామగ్రీ, పర్షియా తివాచీలు ఈ మ్యూజియానికి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. వీటితో పాటు

 సాలార్జంగ్  వంశాల‌కు  చెందిన వస్తువులు,  కార్పెట్లు, ఫర్నిచర్, శిల్పాలు, చిత్రాలు, లిఖితప్రతులు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దం తాల కళాకృతులు,  లోహపు వస్తువులతోపాటు చైనా, నేపాల్, ఉత్తర అమెరికా, జపాన్ దేశాల నుంచి సేకరించిన కళాఖండాలను కూడా ఇక్క‌డ ద‌ర్శించుకోవ‌చ్చు. వీటితో పాటు అల‌నాటి  టిప్పుసుల్తాన్‌, ఆసిఫ్‌జాహీ, జహంగిర్, నూర్జహాన్, షాజహాన్‌లకు చెందిన వస్తువుల‌ను, క‌ళాకృతుల‌ను సైతం ఇక్క‌డ ద‌ర్శించుకోవ‌చ్చు.  ఈ మ్యూజియంలో ఉన్న 78 గ‌దుల‌లో వీటిని భ‌ద్ర‌ప‌రిచారు.

మేలిముసుగులో మహిళ, కొన్స్తి అరుదైర వస్తువులు

మీర్ యూసుఫ్ అలీ ఖాన్ కృషి

ఈ మ్యూజియంలోని  సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, వీటిలో  కొన్ని సేకరణలు యూస‌ఫ్ అలీఖాన్  తండ్రి మీర్ లయీఖ్ అలీ ఖాన్, మొద‌టి సాలార్ జంగ్  నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ ల‌కు చెందినవి. దాదాపు  40,000 వస్తువులు , క‌ళాకృతులను ఆయా 78 గ‌దుల‌లో పొందుప‌రిచారు.   పరదాలో యున్న “రెబెక్కా”, జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన “యాఖూతి ఉల్-మస్తామీష‌, ఖురాన్ ప్రతి, గడియారం ,  “స్త్రీ-పురుష శిల్పం” ప్రధానమైనవి. ఈ మ్యూజియంలో ఉన్న  వెల్డ్ రెబెక్కా పాలరాతి విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఒకే విగ్రహంలో స్త్రీ , పురుష రూపాల‌తో నిర్మించిన పాల‌రాతి విగ్రహం అప్పటి కళా నైపుణ్యాన్ని తేట‌తెల్లం చేస్తుంది.  మనిషి బొమ్మ వచ్చి గంటలు మోగించే మ్యూజికల్‌ క్లాక్‌, ‌జహంగీర్‌ చురకత్తి, 12వ శతాబ్దం నాటి యాఖాతి ఉల్‌-మస్తామీ ఖురాన్‌తో పాటు వివిధ రకాల తుపాకులు, గ్రంథాలు, ఖడ్గాలను ఇక్క‌డ ద‌ర్శించుకోవ‌చ్చు. సాలార్ జంగ్ మ్యూజియంను ప్ర‌తి రోజూ  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెర‌చి ఉంచుతారు.  ప్రతి శుక్రవారం మూసి ఉంచుతారు. పురాత‌న వ‌స్తువులు, క‌ళాఖండాలు, ఇత‌ర క‌ళాకృతుల‌ను సంద‌ర్శించాల‌నుకునే వారికి ఈ మ్యూజియం ఓ చ‌క్క‌టి అనుభూతినిస్తుంద‌నడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

(డిసెంబ‌ర్ 16 సాలార్ జంగ్ మ్యూజియం ఆవిర్భ‌వించిన రోజు)

దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

 మొబైల్ : 7794096169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles