అందమైన ఆటతీరును సొంతం చేసుకున్న అందగాడు, అత్యంత లాఘవంగా, పులిలాగా టెన్నిస్ కోర్టులో లంఘించి ఫోర్ హ్యాండ్ షాట్లు ‘లా జవాబ్’ గా కొట్టే మొనగాడు, ఇరవై నాలుగు సంవత్సరాలుగా టెన్నిస్ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలిన రోజర్ ఫెదరర్ అల్విదా చెప్పారు. ఫెదరర్ గ్రాండ్ స్లాం టెన్నిస్ కు, టోర్నీలకు ఫేర్ వెల్ చెప్పారు. వీడ్కోలు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా తన అభిమానుల హృదయాలకు తీయని, చేదైన సందేశంతో అనివార్యంగా చిన్నగాయం చేశాడు.
ప్రపంచ టెన్నిస్ లో ఒక శకం ముగిసింది. అది పెదరర్ శకం. టెన్నిస్ రాకెట్ ను పట్టుకునే తీరులో, బంతిని కొట్టే రీతిలో, ఆటను ఒక కళగా దిద్దితీర్చే పనిలో సాటిలేని మేటిగా నిరూపించుకున్న ఫెదరర్ ప్రపంచంలో కెల్లా అత్యంత మేటి ఆటగాడు కాదు కానీ ప్రపంచ మేటి ఆటగాళ్ళలో ఒకడు. మోకాలుకు గత రెండేళ్ళలో మూడు సార్లు శస్త్రచికిత్స జరిపించుకున్న ఫెదరర్ తనకు 41 ఏళ్ళ వయస్సు వచ్చిందనీ, గాయాలు బాధిస్తన్నాయనీ, ఇక పోటీ టెన్నిస్ లో పాల్గొనడం సాధ్యం కాదని తీర్మానించుకున్నాడు. నాలుగు పేజీల హృద్యమైన లేఖను విడుదల చేస్తూ అగ్రస్థాయి పోటీలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించాడు.
ఫెదరర్ కంటే ముందు బోర్గ్, ఎమర్సన్, సంప్రాస్ వంటి మేటి ఆటగాళ్ళూ, నాదల్, జకోవిచ్ వంటి వర్తమాన టెన్నిస్ వీరులూ అతడి కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్నారు. శక్తిమంతంగా, ధాటిగా, బంతిని బుల్లెట్ వేగంతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దినట్టు బంతిని బాదుతూ ప్రత్యర్థులందరినీ మట్టి కరిపించడంలో బోర్గ్ ప్రభృతులు నిశ్చయంగా ముందే ఉంటారు. కానీ ఎంత కష్టమైన షాట్ నైనా అలవోకగా, కన్నులవిందుగా ఆడటంలో వీరందరిలో కెల్లా ఫెదరర్ అగ్రగణ్యుడు. ఫోర్ హాండ్ షాట్లు కొట్టి ప్రత్యర్థులను అధిగమించడంలో ఫెదరర్ ను మించిన ఆటగాడు ఇంతవరకూ టెన్నిస్ చరిత్రలో మరొకడు లేడు. మునిగాళ్ళపైన నిలబడి బంతిని అందుకొని క్రాస్ కోర్టుషాట్ కొడితే దానికి సాధారణంగా సమాధానం ఉండదు. పాయింట్ ఫెదరర్ కు రావలసిందే. ఇది ఎన్నో సార్లు జరిగింది. మణికట్టు తిప్పుతూ, రాకెట్ కోణాన్ని అలవోకగా మార్చుతూ బంతిని రామబాణంలాగా పంపుతున్న ఫెదరర్ లో ఆవేశం కానీ, ఆగ్రహం కానీ, విసుగుదల కానీ, కసి కానీ కనిపించవు. ఆ లక్షణాలన్నీ తప్పని సరిగా ఉంటాయి. వాటన్నిటినీ లోపలే దాచుకొని చిర్నవ్వే మొహంలో వెలిగించి అలాగే ఆట పూర్తయ్యేవరకూ ఆసాంతం ఉండగలడు.
రెండు వందల కిలోమీటర్ల వేగంతో అతడు చేసే సర్వ్ ఒక బ్రహ్మాస్త్రం. తిరుగులేని సర్వ్. ప్రత్యర్థి నాదల్ కానీ జొకోవిచ్ కానీ అయితే అటువంటి బంతిని కూడా తిరిగి షాటుగా మార్చి కొట్టగలరు. మళ్ళీ ఇటునుంచి మరో షాట్ రూపంలో వెడుతుంది. తిరిగి అటునుంచి అదే వేగంతో వస్తుంది. ఈ విధంగా 2008 వింబుల్డన్ ఫైనల్ లో నాదల్, ఫెదరర్ మధ్య నాలుగు గంటల 48 నివిషాలు (దాదాపు అయిదు గంటలు) పోరు సాగింది. ప్రేక్షకులకు నేత్రపర్వం చేసింది. చివరికి నాదల్ గెలిచి 2004 నుంచి అప్పటి వరకూ ఏకఛద్రాధిపత్యం నెరపిన ఫెదరర్ కు బ్రేక్ వేశాడు. వీరిద్దరూ గొప్ప ఆటగాళ్ళు మాత్రమే కాదు గొప్ప స్నేహితులు. ఈ ఇద్దరూ వచ్చే వారం లండన్ లో జరిగే లేవర్ కప్ పోటీలలో డబుల్స్ జట్టుగా ఆడబోతున్నారు. ఆ తర్వాత స్విట్జంర్లండ్ లోని తను పుట్టిపెరిగిన, బాల్ అందించే కుర్రవాడిగా టెన్నిస్ తో ప్రేమాయణం ప్రారంభించిన బాసెల్ లో చివరి మ్యాచ్ ఆడతారు.
ప్రపంచ టెన్నిస్ లో ప్రప్రథముడుగా, నంబర్ ఒన్ గా, 237 వారాలు వరుసగా 02 ఫిబ్రవరి 2004 నుంచి 18 ఆగస్టు 2008వరకూ ఫెదరర్ కొనసాగాడు. తన 22వ ఏట నంబర్ ఒన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన 36వ ఏట మళ్ళీ టైటిల్ గెలుచుకొని ప్రపంచ చరిత్రలో అత్యంత వయోధికుడైన చాంపియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఫెదరర్ జీవితంలో మొదటి గ్రాండ్ స్లాం రోలాండ్ గారోస్ లో 2009లో సాధించాడు. నాదెల్ (22), జోకోవిక్ (21) కంటే ముందుగానే గ్రాండ్ స్లాం (20) రికార్డు సాధించిన ఆటగాడు ఫెదరర్. మొత్తం 30 సార్లు గ్రాండ్ స్లాం ఫైనల్స్ లో ఆడాడు. 43 సార్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు. 52 విడతల క్వార్టర్ ఫైనల్ దగ్గర ఆగిపోయాడు. వింబుల్డడ్, యూఎస్ ఓపెన్ లో నాలుగేళ్ళు వరుసగా (200407) గెలుపొందిన ఏకైక టెన్నిస్ ఆటగాడు ఫెదరర్. టూర్ ట్రావెల్స్ విజయాలను 1251 వరకూ నమోదు చేసుకున్నాడు. జిమ్మీకానర్స్ తర్వాత చరిత్రలో స్థానం ఫెదరర్ దే. విదేశాలలో పర్యటిస్తూ 103 సార్లు అగ్రస్థాయిలో నిలిచాడు. ఈ విషయంలో కూడా అతడి స్థానం 109 విజయాలు సాధించిన కానర్స్ తర్వాతదే. నలభై దేశాలలో టెన్నిస్ ఆడిన అనుభవజ్ఞుడు.
ప్రతి విజయుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. అదే విధంగా ఫెదరర్ విజయాల వెనుక అతడి భార్య మిర్కా ఎంతో అన్యోన్యంగా, సహాయకంగా, ప్రేరణాత్మకంగా నిలిచింది. ఆమె కూడా టెన్నిస్ ఆడేది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో వారిద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు. ఇష్టపడ్డారు. 2009లో పెళ్ళి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. మొదటి ఇద్దరు కూతుళ్ళూ దీవా, రోజ్ లు కవలలు. తర్వాత ఇద్దరు మగపిల్లలు – లియో, లెనీ.
రోజర్ ఫెదరర్ తన టెన్నీస్ కెరీర్ ని 1998లో ఆరంభించి 2022లో ముగించారు. ఇరవై నాలుగేళ్ళూ ఇరవై నాలుగు గంటల్లాగా గడిచిపోయినాయని వ్యాఖ్యానించాడు. టెన్నిస్ తనకు చాలాచాలా ఇచ్చిందనీ, ఆ ఆటకు తాను జన్మంతా రుణపడి ఉంటాననీ ఫెదరర్ అన్నాడు. నాదల్, జకోవిచ్ లు కూడా రంగం నుంచి కొద్ది సంవత్సరాలలో తప్పుకోవలసిన వారే. భవిష్యత్తు జ్వెరెక్ , అల్కరాస్, సిన్నర్, రూడ్ మొదలైన యువక్రీడాకారులదే. వారూ దూసుకువస్తున్నారు. ఎవరు రిటైరైనా, ఎవరు భవిష్యత్తులో కిరీటధారులైనా టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆటను అందంగా, హృద్యంగా, చూడముచ్చటగా ఆడిన మేటి ఆటగాడిగా అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
‘‘ఈ రోజు రాకేరాకూడదని అనుకున్నా. నా స్నేహితుడు, ప్రియసఖుడు, ప్రత్యర్థి ఫెదరర్ అంటే నాకు ఎంతో ఇష్టం. రోజర్, ఇన్నేళ్ళూ నీతో గడిపినందుకు ఆనందంగా ఉంది. గర్వంగా, గౌరవంగా కూడా ఉంది. ఇద్దరం కలిసి ఎన్నో మధురమైన క్షణాలు ఆస్వాదించాం. భవిష్యత్తులోనూ అటువంటి మధురానుభూతులను పంచుకుంటాం. నీ భార్య, పిల్లలతో సుఖంగా, ప్రశాంతంగా నీ జీవితం గడిచిపోవాలని ఆశిస్తున్నా. లండన్ లో కలుద్దాం’’ అంటూ నాదల్ అన్నాడు.
ఫెదరర్ రాకెట్ కు స్వస్తి చెప్పడు. టెన్నిస్ ఆడుతూనే ఉంటాడు. ప్రజాసేవ చేస్తూనే ఉంటాడు. ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సహాయం అందిస్తూ చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. సుమారు ఇరవై లక్షల మంది చిన్నారులకు సాయం చేశాడు. భూకంపాలూ, వరదలూ, సునామీలూ, కరువుకాటకాలు సంభవించినప్పుడు నేనున్నానంటూ ముందుకు రావడం, సాధ్యమైనంతమందిని ఆదుకోవడం ఫెదరర్ స్వభావం. నిధుల సమీకరణకోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ లో నిర్వహించడంలో ముందుంటాడు. 2004లో సునామీ కారణంగా తమిళనాడులో అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించి వెళ్ళాడు. ప్రపంచంలో ఎక్కడ ఆపద సంభవించినా అక్కడికి వెళ్ళి తాను చేయగలిగింది చేయడం తన విధిగా భావిస్తాడు. అందమైన ఆటతో పాటు మృదువైన మనసు, స్పందించే హృదయం ఉన్నాయి కనుకనే అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.