• కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ
• పార్టీనేతలతో జగన్ అత్యవసర భేటీ
• ఎన్నికల నిర్వహణపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఎన్నికల సంఘం, ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఎన్నికలకు సహకరించేది లేదని ఉద్యోగసంఘాలు భీష్మించడంతో ఎస్ఈసీ కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ రాశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలిదశ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తంకాకపోవడంతో ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే
సీఎం జగన్ అత్యవసర సమీక్ష:
పంచాయతీ ఎన్నికలకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కోర్టు తీర్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సిబ్బందిని కేటాయించాలంటూ నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై కూడా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలా వద్దా అన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలపై తొలగని సందిగ్ధత