హైదరాబాద్ : పొరుగింటి ఆరేళ్ళ బాలికపైన అత్యాచారం చేసి, హత్య చేశాడనే ఆరోపణ ఎదుర్కొటున్న పాలకొండ రాజు అనే యువకుడి శవం గురువారం ఉదయం వరంగల్లు సమీపంలో రైలు పట్టాలపై కనిపించినట్టు పోలీసుల వెల్లఢించారు. హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘనపూర్ దగ్గర రాజారం సమీపంలో రైలు పట్టాలపైన ఉదయం గం. 8.30లకు కనిపించిన శవం రాజుదేనని తాము అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఆదివారంనాడు బాలిక మృతదేహం కనిపించినప్పటి నుంచి పరారీలో ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నదని పోలీసులు అన్నారు. ‘‘ఇది ఆత్మహత్యలాగా కనిపిస్తోంది,’’ అని నగర పోలీసుకమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.
శవాన్ని ఇంకా గుర్తించవలసి ఉన్నప్పటికీ పోలీసులు ఆ శవం ఫోటోను ట్విట్టర్ లో పెట్టారు. రాజు చేతిమీద ఉన్నట్టు శవం చేతిమీద కూడా పొడుపుచుక్కలు ఉన్నాయని, జుట్టు కూడా రాజు జుట్టులాగానే ఉన్నదనీ, శవం ఎత్తుకూడా రాజు ఎత్తే ఉన్నదనీ పోలీసులు అన్నారు. వేలిముద్రల ప్రవీణులు నివేదిక ఇవ్వవలసి ఉన్నదని చెప్పారు. ‘‘నిందితుడిని పట్టుకొని ఎన్ కౌంటర్ చేసి చంపుతాం,’’ అని తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్న తర్వాత రెండు రోజులకు ఈ విధంగా శవం కనిపించడం చర్చనీయాంశమైంది.
అంతకు ముందు రాజుకోసం పది పోలీసు టీంలు అన్వేషిస్తున్నాయనీ, మొత్తం రెండు వందల మంది పోలీసులు వెతుకుతున్నారనీ, రాజు అరెస్టుకు దోహదం చేసే సమాచారం అందించినవారికి రూ. 10 లక్షలు బహుమానం ఇస్తామనీ పోలీసులు ప్రకటించారు. వారం రోజుల కింద బాలిక రాజు ఇంటిలో శవమై కనిపించింది. సైదాబాద్ లోని సింగరేణి కాలరీస్ లో ఇంటి నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి కనిపించడం లేదు. అదే రోజు బెడ్ షీట్ లో చుట్టిన బాలిక శవం పొరుగింటి రాజు ఇంటిలో కనిపించింది.
రాజు అరెస్టయినట్టు ఒక రోజు వార్త వచ్చింది. అది నిజం కాదని తెలిసినప్పుడు రాజు ఇంటికి ఎదురుగా పెద్ద ప్రదర్శన జరిగింది. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రదర్శకులు నినాదం చేశారు. అరెస్టు అయినట్టు పెట్టిన ట్వీట్ ను మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వాపసు తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు సాధ్యమైనంత త్వరాలో పట్టుకొని న్యాయవ్యవస్థకు అప్పగిస్తారని ఆశిద్దాం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి మంగళవారం నుంచి బాధితురాలి ఇంటి సమీపంలో నిరవధిక నిరాహాదీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నిందితుడిని అరెస్టు చేసే వరకూ నిరాహారదీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఆమె తల్లి, వైఎస్ ఆర్ సతీమణి విజయమ్మ కూడా బాదితులను పరామర్శించారు. చిన్నారిపై హత్యాచారం జరగడం పట్ల ప్రదర్శకులు ఆగ్రహం ప్రకటించారు.