Sunday, December 22, 2024

రణ్ వీర్ సింగ్ హల్ చల్

రణ్ వీర్ సింగ్ ఈ మధ్య వార్తలలో వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రఖ్యాత బాలీవుడ్ నటి దీపికా పడ్కోన్ ని పెళ్ళి చేసుకోవడంతో వార్తలలోకి ప్రధానంగా ఎక్కాడు. వారి హనీమూన్, వివాహజీవత ప్రణాళిక, సంసారం గురించి ఆలోచనలపై రకరకాల ఊహాగానాలూ, వార్తలూ, వ్యాఖ్యలూ పత్రికలలో, టీవీలలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్  పెళ్ళి జరిగే వరకూ రణ్ వీర్ సింగ్, దీపికానే మీడియాను డామినేట్ చేశారు. మధ్యలో కత్రీనా కైఫ్ విక్కీ కౌశల్ ప్రణయం కొన్ని రోజులు వార్తలలో ఉంది. రణబీర్ కపూర్, ఆలియా వివాహమహోత్సవానికి సంబంధించిన వార్తలూ, ఫోటోలూ చెలరేగిపోయే సరికి రణ్ వీర్ సింగ్, దీపికలు కనుమరుగైనారు. అంతలోనే, అకస్మాత్తుగా, అనూహ్యంగా రణబీర్ సింగ్ నగ్నచిత్రాలు మీడియాలో దర్శనమిచ్చాయి. న్యూయర్క్ లోని ఒక మేగజైన్ కోసం దిగిన నగ్న చిత్రాలను రణబీర్ సోషల్ మీడియాకు విడుదల చేయడంతో వివాదాస్పదకమైన ట్వీట్లూ, వాటికి సమాధానంగా మరిన్ని ట్వీట్లూ, సమాజంలోని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలూ, అభ్యంతరాలను ఖండిస్తూ మద్దతు ప్రకటనలు అంతా గందరగోళం జరుగుతోంది. ఇదే పత్రిక 2014లో కిమ్ కర్దాషియాన్ నగ్నఫోటోలు ప్రచురించి విశేషమైన ప్రచారం పొందింది. పనిలోపనిగా ముంబయ్ పోలీసులు రణ్ బీర్ సింగ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారు? ఏ చట్టాలను రణ్ బీర్ ఉల్లంఘించాడు?

ఒకానొక న్యాయవాది, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మరొక వ్యక్తి కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. శ్యామ్ మంగారాం ఫౌడేషన్ ను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ లలిత్ టెక్చానందానీ వారిలో ఒకరు. తన సంస్థ భర్తలను కోల్పోయిన మహిళలకోసం, ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకోసం పని చేస్తున్నదని చెప్పాడు. తాను నటుడు రణ్ వీర్ సింగ్ ఫోటోను జూమ్ ఇన్ చేసి చూసినప్పుడు అతని మర్మాంగాలు కనిపించాయనీ, ఒక పత్రిక కోసం ఫోటో షూట్ చేశారనీ, అందుకోసం భారీగా ప్రతిఫలం ముట్టి ఉంటుందనీ, సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న యువతీయువకులపైన దాని ప్రభావం ఉంటుందనీ లలిత్ తన ఫిర్యాదులో అన్నాడు. అప్పుడు చెంబూరు పోలీసులు భారత శిక్షస్మృతి సెక్షన్లు 292, 293, 509 కింద ప్రాథమిక సమాచార నివేదిక (ఫస్ట ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఎఫ్ ఐ ఆర్)ను దాఖలు చేశారు. ఈ సెక్షన్లు మాత్రమే కాకుండా అబ్సీన్ పబ్లికేషన్స్ యాక్ట్ 1925నూ, అశ్లీల చిత్రాల విక్రయ నిషేధం చట్టం 292వ సెక్షన్ నూ, సమాచార సాంకేతిక విజ్ఞానం చట్టం 2000 లోని 67 ఏ సెక్షన్ ను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.  స్వర్గీయ బర్ట్ రేనాల్డ్ ఇటువంటి ఫోటో షూట్ నే 1972లో చేసి కాస్మాపాలిటన్ పత్రిక అచ్చువేసింది బహుళ ప్రాచుర్యం పొందింది. రేనాల్డ్ కు శ్రద్ధాంజలి ఘటించాలనే ఉద్దేశంతో రణబీర్ ఈ ఫోటో షూట్ కి అంగీకరించాడు.

ఇది జాతీయ సమస్య కాదు. కేసులు పెట్టాల్సిన విషయం కూడా కాదు. కానీ దీనిపైన సోషన్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ జరుగుతోంది కనుక మనం కూడా చర్చిస్తున్నాం. బాగోగుల గురించి మాట్లాడుకుంటున్నాం. అంతవరకే. ఫోటోలో మర్మాంగాలు కనిపించాయనడం అబద్ధం. ఒక మ్యాగజైన్ కోసం అండర్ వేర్ వేసుకొని నగ్న చిత్రాలు ఇచ్చే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఏ వ్యక్తికైనా ఉన్నాయి. అది మహిళల హక్కుల హననం కిందికి రాదు. అట్లాగైతే నగ్నచిత్రాలు షూట్ చేస్తున్న మహిళల మాటేమిటి? వారు పురుషుల హక్కులను కాలరాస్తున్నట్టా?

తాను అర్ధనగ్నంగా కనిపిస్తే గుర్రుగుర్రుమంటూ తనకేసి చూసిన దీపికా పడుకోన్ తన భార్త నగ్న చిత్రాలను ఎట్లా సహిస్తుందంటూ సినిమా నటి షర్లీన్ చోప్డా వ్యాఖ్యానించింది. ‘మత్ బోలియే కీ ఏ తో చల్తా హై. మగర్ ఏ దోగ్లాపన్ క్యోం? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?’ అంటూ షర్లీన్ ప్రశ్నించింది.

ప్రముఖ రచయిత్రి శోభాడే ఇది ఏ మాత్రం అభ్యంతరం కాదనీ, మహిళలను వేధించే సమస్య కానేకాదనీ, మన పురాణేతిహాసాలలో శృంగారం పుష్కలంగా ఉన్నదనీ, రణబీర్ ఇష్టానుసారం వ్యవహరించే స్వేచ్ఛ అతనికి ఉన్నదని అన్నారు. ‘‘అంతా ఆలోచించే ఈ పని చేసి ఉంటాడు. ఎఫ్ఐఆర్ దాఖలైనా, పోలీసులు కేసులు పెట్టినా, కోర్టుకు లాగినా పోరాడేందుకు అవసరమైన ధనబలం, మందీమార్బలం, న్యాయవాదుల అండదండలు అతనికి అందుబాటులో ఉన్న విషయం గుర్తించాలి. ఇదివరకు సినిమాలలో అనీల్ కపూర్, ఆమీర్ ఖాన్ కూడా అర్ధనగ్నంగా కనిపించారు. ఇదేమంత చర్చించాల్సిన విషయం కాదు. పట్టించుకోలసిన అంశం అసలే కాదు’’ అని శోభాడే వ్యాఖ్యానించారు.

ఇది వరకు టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్, నల్లని ప్రేమికురాలు బార్బారా ఫెల్టస్ అర్ధనగ్న చిత్రాలు జర్మన్ మేగజైన్ స్టెర్నార్డ్ లో ప్రచురించారు. వాటిని ఇండియాలో స్పోర్ట్స్ వరల్డ్ మేగజైన్ లోనూ, ఆనంద్ బజార్ పత్రికలోనూ తిరిగి ప్రచురించారు. ఆ చిత్రాలు ప్రచురించడంలో  ఉద్దేశం ఏమంటే రంగు నలుపా, తెలుపా అన్నది ముఖ్యం కాదు, ప్రేమే ప్రధానం అన్న సందేశం ప్రచారం చేయడం అంటూ న్యాయస్థానం నిర్ధారించింది. బెకర్ పై కేసు కొట్టివేసింది. రంజిత్ ఉదేశీ అనే ముంబయ్  పుస్తకాల విక్రేతపైన  ‘డీహెచ్ లారెన్స్ లేడీ చాటర్లీస్ లవర్’ అనే పుస్తకాన్ని అమ్మినందుకు పోలీసులు కేసు పెట్టారు. అప్పుడు కూడా భారత శిక్షాస్మృతి 292 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది.  గోవా బీచ్ లో అర్ధనగ్నంగా పరుగెత్తుతున్న తన చిత్రాన్ని అప్ లోడ్ చేసినందుకు పోలీసులు నటుడూ, మోడల్ అయిన మిలింద్ సొమన్ పైన కేసు పెట్టారు. 1995లో ఇదే మిలింద్ తన అప్పటి ప్రియురాలు మధుసప్రేతో అర్దనగ్న చిత్రాలు తీయించుకున్నందుకు కూడా పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులన్నిటినీ కోర్టులు 2009 నాటికి కొట్టివేశాయి.

ఒక రచన లేదా ఒక ఫోటో అశ్లీలమో కాదో అని తేల్చడానికి ‘హిక్లిన్ టెస్ట్’ అని ఒక పరీక్ష ఉన్నది.  ఇంగ్లండ్ లో రెజీనా వర్సెస్ హెక్లిన్ కేసు 1868లో విచారణకు వచ్చింది. రచన లేదా ఫోటో ఎవరినైనా తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయా, ఎవరినైనా నిస్పృహకు లోను చేసేవిగా ఉన్నాయా అన్నది చూడాలి. ఇదే హెక్లిన్ టెస్ట్ గా ప్రాచుర్యం పొందింది. ఇది 2014 వరకూ అమలులో ఉంది.  ఒక  వేళ ఈ నేరానికి శిక్ష పడితే అది మొదటిసారి అయితే మూడేళ్ళ కారాగారం, రెండువేల రూపాయల జరిమానా. అదే నేరం రెండో సారి చేస్తే శిక్ష ఏడేళ్ళు జైలు, అయిదు వేల రూపాలయ జరిమానా.

రణ్ బీర్ సింగ్ కి వచ్చిన ప్రచారం చూసి అతని బాటలోనే నడవాలని నటుడు విష్ణు విశాల్ కూడా నగ్నం గా ఫోటోలు దిగాడు. ఫొటోగ్రాఫర్ ఎవరనుకుంటున్నారు? విష్ణు భార్య, బాడ్మింటన్ చాంపియన్ జ్వాలా గుట్ట. ‘వెల్. జాయినింగ్ ద ట్రెండ్’ అని హెడింగ్ పెట్టాడు. బెడ్ షీట్ చుట్టుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టాడు విశాల్.

రణ్ వీర్ అర్ధనగ్న ఫోటోలకు విపరీతమైన స్పందన వచ్చింది. అందులో ఎక్కువ భాగం పొగడ్తలే. ప్రియాంకా చోప్డా, జోయా అఖ్తర్,అనుష్క డండేకర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులు రణ్ బీర్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మసాబా అంటే ఎవరో తెలుసా? ఆమె సెలబ్రిటీలకు పుట్టిన సెలబ్రిటీ. 33 ఏళ్ళ కింద సినీ నటి నీనా గుప్తాకూ, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రేమఫలం. ఆమె కూడా ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నారు. 

కనుక రణ్ బీర్ వ్యవహారాన్ని లైట్ తీసుకోవాలన్నది సారాంశం. అతను కోరుకున్న ప్రచారం కంటే ఎక్కువే అతడికి లభించింది. తాను అనుకున్నట్టు బర్ట్ రేనాల్డ్ కు వందనాలు సమర్పించినట్టూ అయింది. ఇదీ ఒక సినిమా వంటి వ్యవహారం. మన జోక్యం కానీ, వ్యాఖ్యానం కానీ అవసరమా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles