Sunday, December 22, 2024

చరిత్రలో అఫ్ఘాన్లను ఓడించి నిలిచిన ఏకైక వీరుడు మహారాజా రంజిత్ సింగ్!

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి – 7

వేల సంవత్సరాలుగా అఫ్ఘానిస్తాన్ ను అణచివేయడం, వారిపైన ఆధిక్యం ప్రదర్శించడం గొప్పగొప్ప సామ్రాజ్యాల వల్ల కూడా కాలేదని చాలా మంది చాలా చోట్ల రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. నిజమే. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరి నుంచి  అమెరికా అధ్యక్షులు  జూనియర్ బుష్, ట్రంప్, జోబైడెన్ వరకూ ఎవ్వరు కూడా అఫ్ఘానిస్తాన్ లో నిలువలేకపోయారు. మొగల్ చక్రవర్తులు కూడా ప్రయత్నించి విరమించుకున్నారు. బ్రిటన్ మూడు విడదల దండయాత్ర చేసి మూడు సార్లూ విఫలమైంది. సోవియెట్ యూనియన్ పదేళ్ళు (24 డిసెంబర్ 1979 – 15 ఫిబ్రవరి 1989) ప్రయత్నించి పలాయనం చిత్తగించింది. అంతే కాకుండా అఫ్ఘాన్ పరిణామాలు సోవియెట్ యూనియన్ పతనానికీ, విచ్ఛిన్నానికీ దారి తీశాయి. అమెరికా సంగతి గత రెండు దశాబ్దాలుగా (2001-2021) చూశాం. ఇప్పుడు ఎట్లా నిష్క్రమించారో గమనించాం. వీరందరికీ భిన్నంగా ఒక భారతీయ చక్రవర్తి అఫ్గానిస్తాన్ పైన స్పష్టమైన విజయం నమోదు చేసుకోవడమే కాకుండా ఆ ప్రాంతాన్ని చాలాకాలం సమర్థంగా  పరిపాలించాడు. ఆ మహారాజు పేరు రంజిత్ సింగ్. ఆయనకు తోడుగా నిలిచి భారతీయ యుద్ధ విధానాలనూ, ప్రాపంచిక దృష్టినీ, పరిపాలనా ప్రతిభనూ ప్రపంచానికి చాటిన యోధుడు నాల్వానీ. ఇద్దరూ చరితార్థులు.

అఫ్ఘాన్ జోలికి వెళ్ళొద్దు: బ్రెజ్నేవ్ కి సలహా   

ఆఫ్ఘనిస్తాన్ జోలికి పోవద్దని సరిగ్గా 32 ఏళ్ళ కిందట నాటి సోవియెట్ యూనియన్ అధినేత లియోనిద్ బ్రెజ్నేవ్ కు జనరల్ నికొలాయ్ ఒగార్కోవ్ సలహా చెప్పాడు. అఫ్ఘానిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఏడేళ్ళ కిందట ఆయన సలహాదారులు సైతం హితబోధ చేశారు.  సైగాన్ వీడి వచ్చినట్టే కాబూల్ ని వీడి అమెరికా సైనికులు సాధ్యమైనంత త్వరగా రావలసి ఉంటుందని మరీ చెప్పారు.

పందొమ్మిదో శతాబ్దంలో పలు బ్రిటిష్ బలగాలు అఫ్ఘానిస్తాన్ లో హతులైన ఉదంతాన్ని ఒగార్కోవ్ బ్రెజ్నేవ్ మంత్రిమండలి సహచరులకు గుర్తు చేశాడు. ప్రధానంగా 1842లో 21 వేల మంది బ్రిటిష్ సైనికులను అఫ్ఘాన్ యోధులు హతమార్చారు. ఒక్క విలియమ్ బ్రైడెన్ అనే సైనికుడిని మాత్రం వదిలేసి అక్కడ జరిగిన నరమేథం గురించి విక్టోరియా మహారాణికి చెప్పమని పంపించారు.  

Hari Singh Nalva, the able commander of Ranjit Singh’s army

అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేస్తే ఇస్లామిక్ దేశాలన్నీ సోవియెట్ యూనియన్ కి దూరమౌతాయని ఒగార్కోవ్ హెచ్చరించాడు. ముజాహిద్ కు అప్పటికే అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, చైనా, తదితర దేశాలు ఆయుధాలూ, నిధులూ ఉదారంగా అందజేస్తున్నాయి. సోవియెట్  సేనలు అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకుంటే ముజాహిదీన్ లు పాకిస్తాన్ లో తలదాచుకొని అఫ్ఘాన్ లో సోవియెట్ సేనలపైన గెరిల్లా యుద్ధం చేస్తారని కూడా చెప్పాడు. పాకిస్తాన్ ను ఉపేక్షించడం సోవియెట్ యూనియన్ చేసిన తప్పిదం.

‘‘నాటో సైన్యాలు అఫ్ఘానిస్తాన్ లో పరాజయం చెందితే ఇస్లామ్ మతవాదులు ఉత్తరం వైపు చూపు సారిస్తారు. తజికిస్తాన్ వైపు నడుస్తారు. తర్వాత ఉజ్బెకిస్తాన్ సంగతి చూస్తారు. పదేళ్ళలోగా కజకిస్తాన్ లో మంచి ఆయుధాలు ధరించిన ఇస్లామిక్ యోధులతో నాటో సైనికులు పోరాడవలసి ఉంటుంది,’’ అని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)కు రష్యా రాయబారి డిమిట్రీ రొగోజిన్ హెచ్చరించారు.

మహారాజా రంజిత్ సింగ్ విజయవిహారం

అలాగని అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేసిన సైన్యాలన్నీ పరాజయం  చవిచూశాయని చెప్పజాలము. కనీసం ఒక యోధుడికి మినహాయింపు ఇవ్వాలి. 180 ఏళ్ళ కిందట భారత పాలకుడు మహారాజా రంజిత్ సింగ్, అతని అద్భుతమైన, ప్రతిభావంతుడైన సేనాని హరిసింగ్ ఖైబర్ కనుమలలో అఫ్ఘాన్ జాతులకు చెందినవారిని ఓడించారు. భారతకు వాయవ్య సరిహద్దు నుంచి ప్రమాదం లేకుండా కాపాడుకున్నారు. రంజిత్ సింగ్ లేకపోతే ఈ రోజు పాకిస్తాన్ లో (లోగడ అవిభక్త భారత్ లో)ఉన్న పెషావర్ ఎప్పుడో అఫ్ఘానిస్తాన్ లో భాగమైపోయేది.

ఆ మాటకొస్తే అఫ్ఘానిస్తాన్ మొదటి నుంచీ భారత్ లో భాగమే. దాన్ని గాంధార దేశం అనేవారు. గాంధార శిల్పానికీ, సాహిత్యానికీ, శాస్త్రసాంకేతిక ప్రగతికీ అది కాణాచి. ఇప్పటి కర్కశ తాలిబాన్ సంస్కృతికి పూర్తి భిన్నం. 1735 వరకూ కాందహార్ భారత్ దేశంలోని రాష్ట్రాలలో ఒకటి. దిల్లీలో బలమైన సైన్యం కానీ రాజు కానీ లేకపోవడాన్ని గమనించిన నాదిర్ షా మధ్య  ఆసియా నుంచి బయలుదేరి మధ్య ప్రాంతాలను జయిస్తూ దిల్లీకి వచ్చిచేరాడు. దాదాపు 25 శతాబ్దాలుగా ఇరాన్, ఇండియా తమ సరిహద్దులను గౌరవిస్తూ వచ్చిన నేపథ్యంలో నాదిర్ షా దండయాత్ర అత్యంత భయంకరమైది. ఇరాన్, భారత్ రాజులు ఎన్నడూ ఈ సరిహద్దును అతిక్రమించలేదు. నాదిర్ షా అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్నాడు. ఇండియాకు శాశ్వతంగా దూరం చేశాడు.  రంజిత్ సింగ్ సాహసం చేశాడు. నాదిర్ షా వారసుడు అహ్మద్ షా అబ్డానీ పంజాబ్ పైనా, దిల్లీ పైన మాటిమాటికీ దాడులు చేసేవాడు. అబ్డానీని అరికట్టేందుకు రంజిత్ సింగ్ ఆధునిక సైన్యాన్ని నిర్మించాడు. అందులో ఫ్రెంచివారినీ, ఇటాలియన్లనూ, గ్రీకులనూ, రష్యన్లనూ, జర్మన్లనూ, ఆస్ట్రియా యోధులనూ సైన్యాధికారులుగా నియమించాడు. మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరిన ఇద్దరు యూరోపియన్ అధికారులు వెంట్యురా, అల్లార్డ్ నెపోలియన్ బొనపార్ట్ దగ్గర పని చేసిన అనుభవం ఉన్నవారు. సైన్యాన్ని ఆధునికీకరించేందుకు రంజిత్ సింగ్ ఇటువంటి అనుభవజ్ఞులైన అధికారులను నియమించాడనీ, కానీ వారికి పెత్తనం మాత్రం అప్పగించలేదు. వారి అనుభవాన్ని, వ్యూహచాతుర్యాన్నీ తెలివిగా వినియోగించుకున్నాడు.

Ranjit Singh on a horse back

మహరాజా రంజిత్ సింగ్ 1818లో ముల్టాన్, పంజాబ్ లను గెలుచుకున్నాడు. 1819లో కశ్మీర్ ను కైవసం చేసుకున్నాడు. లోయలూ, పర్వతాలూ దాటి అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలైన డేరా ఘాజీ ఖాన్ ను 1820లోనూ, డేరా ఇస్మాయిల్ ఖాన్ ను 1821లోనూ స్వాధీనం చేసుకున్నాడు. రంజిత్ సింగ్ సేనలను ప్రతిఘటించేందుకు కాబూల్ పాలకుడు ఆజ్మీఖాన్ బుర్కాజీ నాయకత్వంలో జిహాద్ (మతయుద్ధం)కి పిలుపునిచ్చారు. కాబూల్ నది ఒడ్డుమీద పెద్ద అఫ్ఘాన్ సైన్యం మోహరించింది. దానిని 1823లో రంజిత్ సింగ్ నాయకత్వంలోని సైన్యం చిత్తుగా ఓడించింది. 1834లో పెషావర్ ను జయించాడు రంజిత్ సింగ్.

పఠాన్ల ఆధిక్య భావన

హిందువులకంటే తాము అధికులమని పఠాన్లు భావించేవారు. భారత దేశంలో నివసిస్తున్న ముస్లింలను సైతం ‘హింద్కో’ అని సంబోధిస్తూ కించబరిచేవారు. ఇస్లామేతరుల చేతిలో ఓడిపోవడం వల్ల అఫ్ఘాన్ ఆధిక్య భావనకు భంగం కలిగింది కనుక పఠాన్లు కావాలని ఆధిక్య భావన ప్రదర్శించేవారని చరిత్రకారుడు కిర్పాల్ సింగ్ వ్యాఖ్యానించాడు. కొండలలో నివసించే కొండజాతులనూ, ఎవరికీ భయపడనివారినీ, ఎవ్వరినీ ఖాతరు చేయని అఫ్ఘాన్ లను మహారాజా రంజిత్ సేనలు ఎట్లా జయించాయి? ముందు దాడులు చేసి గాయపరిచేవారు. తర్వాత భారతీయులకు సహజగుణమైన దయ,కరుణ ప్రదర్శించేవారు. హరిసింగ్ నాల్వా నాయకత్వంలోని  సైన్యం 20 వేల మంది హజారాలను మట్టుబెట్టింది. హరిసింగ్  సైన్యం అంటే అఫ్ఘాన్లకు కంపరం. కేవలం ఏడు వేల మంది సైనికులతో తెలివైన, టక్కరి, సాహసోపేతమైన హజారాలను ఓడించడం సామాన్యమైన విషయం కాదు.

సంగ్రామ చరిత్రలో హరిసింగ్ ప్రసిద్ధ నామం. గతంలో భారతీయులను అఫ్ఘాన్లు ఎట్లా చూశారో, అదే విధంగా హజారాలను చూడాలని హరిసింగ్ నిర్ణయించాడు. పెషావర్ లోయలో పటిష్టమైన పాలనాయంత్రాంగాన్ని నెలకొల్పాడు. యూసఫ్ జాయీస్ చాలా హింసాత్మకమైన జాతి. ప్రతి యూసఫ్ జాయీ ఇంటిమీదా పన్ను విధించాడు. నగదులో కానీ వస్తు రూపంలో కానీ ఈ పన్ను వసూలు చేయాలి. పన్ను కట్టనివారి ఆస్తులను ప్రభుత్వం హస్తగతం చేసుకోవచ్చు. తిరుగుబాటుదారులు  గ్రామాలను తగులపెట్టారు. పెషావర్ నగరంలో కొంతభాగం తగులపడిపోయింది. కాబూల్ సమీపంలో గవర్నర్ నివాసాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు. అఫ్ఘాన్ ప్రజలలో గుండెల్లో హరిసింగ్ నాల్వా నిద్రపోయాడు. తల్లులు పిల్లల్ని భయపెట్టడానికి హరిసింగ్  పహిల్వాన్ ని పిలుస్తామంటూ బెదిరించేవారు.

అఫ్ఘానిస్తాన్ ఆధిపత్యానికి గండి కొట్టినప్పటికీ ఇస్లామిక్ తెగలవారు ఆవేశపూరితంగా వ్యవహరించే ఈ ప్రాంతంపైన పట్టు సాధించాలంటే పెద్ద సైన్యాన్ని అక్కడే ఎప్పటికీ ఉంచాలి. ముస్లింల తిరుగుబాట్లను అణచివేస్తూ శిస్తు వసూలు చేసేందుకు హరిసింగ్ నాయకత్వంలో 12 వేల మంది సైనికులను అక్కడే నిలిపారు. ఇండియాకు అఫ్ఘానిస్తాన్ వల్ల ముప్పు లేకుండా మహారాజా రంజిత్ సింగ్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. స్వాత్, ఖైబర్ కనుమలలో ధిక్కార స్వభావం ఉన్న కొండజాతివారిని కూడా అదుపులో పెట్టారు.

ధర్మయుద్ధాని ప్రాధాన్యం

భారతీయులు పూర్వకాలం నుంచి ధర్మయుద్ధమే చేసేవారు. యుద్ధ నిబంధలను తు.చ. తప్పకుండా పాటించేవారు. సాధారణ పౌరులకు హాని జరిగేది కాదు. ప్రార్థనాస్థలాల జోలికి వెళ్ళేవారు కాదు. చెట్లు నరకడం, పంటలను తగులపెట్టడం వంటి దురాగతాలు ఉండేవి కాదు.  2500 సంవత్సరాల కిందట గ్రీకులు ఇటువంటి నియమాలు పాటించేవారు. ఈ నియమాలు పాటించాడు కనుకనే అఫ్ఘాన్ తో యుద్ధంలో రంజిత్ సింగ్  స్పష్టమైన విజయం సాధించాడు.

రంజిత్ సింగ్ పాలనలో లౌకికవాదం తిరుగులేని విధానంగా ఉండేది. రాజ్యానికి మతం రంగు ఉండేది కాదు. మతసహనం అందరూ పాటించిన విశ్వాసం. అమెరికా, నాటో సేనలు యుద్ద ధర్మాన్ని పాటించకుండా, లౌకిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. అమెరికా నుంచి వచ్చిన విమానాల నుంచి బైబిల్ చేతపట్టుకొని దిగేవారు. స్థానికులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి యత్నించేవాళ్ళు. దీంతో స్థానిక ప్రజలలో వ్యతిరేకత పెరిగేది.  ఇందుకు భిన్నంగా విజయం సాధించిన రంజిత్ సింగ్ సైన్యం పెషావర్ వీధులలో కవాతు చేసినప్పుడు మహిళలనూ, మసీదులనూ, పంటలనూ ముట్టుకోరాదని మహారాజా రంజిత్ సింగ్ గట్టి ఆదేశాలు జారీ చేశాడు.

మొన్నటి దాకా అఫ్ఘానిస్తాన్ లో నాటో దళాలు వివిధ దేశాలకు చెందిన మిశ్రమ దళాలుగా ఉన్నట్టు రంజిత్ సింగ్ సైన్యం కూడా నానా మతాల, జాతులకు చెందిన యోధుల మిశ్రమంగా ఉండేది. ప్రధానంగా సిక్కులూ, హిందువులూ ఉండేవారు. కాల్బలగంలో ముస్లింలు ఉండేవారు. యూరోపియన్ దేశాలకు చెందిన యోధులు రంజిత్ సింగ్ సేనలో కీలకంగా ఉండేవారు.

రంజిత్ సింగ్ సేనకూ, అమెరికా, నాటో దళాలకూ మధ్య తేడా

రంజిత్ సింగ్ సైనికులు సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇరవై నాలుగు గంటలూ పని చేసేవారు. మొన్నటి వరకూ అప్ఘానిస్తాన్ లో తాలిబాన్ ను ఎదిరించి పోరాడటానికి బ్రిటిష్ సైనికులు సిద్ధంగా లేరు. పూర్తి భారం మోయడానికి అమెరికా సైనికులు తయారుగా లేరు. తాలిబాన్ చేతుల్లో పడి తమ సైనికులు చనిపోకుండా లంచాలు ఇచ్చి కాపాడుకునేవారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడానికి కానీ అక్కడ నాటో పేరుమీద చేరిన ఉక్రేనియన్స్, పోల్స్, ఆస్ట్రేలియన్లు, న్యూజీలాండర్లూ, చెక్ దేశస్థులూ మానసికంగా సిద్ధమై లేరు. అటువంటివారిని అఫ్ఘాన్లు లెక్కబెడతారా? సోవియెట్ యూనియన్ సైనికులు నిజమైన యోధుల్లగా పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళంటే ముజాహిదీన్ కు గౌరవం ఉండేది. శౌర్యం, ఔదార్యం, దయాగుణం, నియంత్రణ కలిస్తే ఎట్లా తిరుగుబాటుదారులను అదుపులో ఉంచవచ్చునో, ప్రజల హృదయాలను  ఏ విధంగా గెలుచుకోవచ్చునో రంజిత్ సింగ్, హరిసింగ్ లు లోకానికి చాటి చెప్పారు. ప్రజలను ఏ విధంగా దూరం చేసుకోవచ్చునో, ఎట్లా బాధించవచ్చునో, పుండు మీదకారం చల్లడం ఎట్లాగో అమెరికా, నాటో సేనలు అఫ్ఘానిస్తాన్ లో చూపించాయి. అందుకే విదేశీ సేనలతో విసిగిపోయిన ప్రజలు తాలిబాన్ స్వభావం తెలిసి ఉన్నప్పటికీ తమ దేశాన్ని ఆక్రమించి, తమపైన పెత్తనం చేస్తున్న విదేశీ సేనల కంటే తాలిబాన్ నయమని భావించి వారికి స్వాగతం చెప్పారు.  

(మిగతా తర్వాత)

Related Articles

2 COMMENTS

  1. Very good lesson of MahaRaja Ranjithsingh and Genaral Harising !it is understood He never disrespected people and their religious sentiments.our politicians read this who are dreaming to establish a religious government,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles