నిరసనకారుల అసంతృప్తి, నిరసన కొనసాగుతుందని ప్రకటన
కలిసి పని చేద్దాం, ప్రతిపక్షాలకు రణిల్ హామీ
శ్రీలంక నూతన అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘే బుధవారంనాడు ఎన్నికైనారు. 73 ఏళ్ళ రణిల్ ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయనను నాలుగు మాసాల కిందట ప్రధానిగా నాటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నియమించారు. నిరసనకారుల ఒత్తిడి మూలంగా గొటబాయ దేశం విడిచి మాల్దీవుల మీదుగా సింగపూరు వెళ్ళి ఆ దేశంలో తలదాచుకున్నారు. గొటబాయ సింగపూర్ నుంచి తన రాజీనామా లేఖను పంపించారు. దాంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడికోసం ఎన్నిక జరిగింది.
గురువారం నాడు అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం చేశారు. జులై 20న జరిగిన ఎన్నికలో రణిల్ కి 134 ఓట్లు వచ్చాయి. ఆయన శ్రీలంక తొమ్మదవ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. స్పీకర్ అనుమతితో పార్లమెంటు ఆవల ప్రమాణస్వీకారం చేశారు. అందరితెో కలిసి పని చేస్తానంటూ రణిల్ ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. శ్రీలంక మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. అధ్యక్షుడిగా రణిల్ ఎన్నిక కావడాన్ని నిరసనకారులు ఆమోదించడం లేదు. నిరసనోద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.
ఈ లోగా విక్రమసింఘె దేశంలో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించారు. పోలీసులూ, సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనకారులలో వామపక్ష తీవ్రవాదులూ, ఫాసిస్టులూ ఉన్నారనీ, వారిని అణచివేయవలసిన అవసరం ఉన్నదని రాజకీయ నాయకుల అభిప్రాయం. దీనికి అనుగుణంగా రణిల్ విక్రమసింఘే గట్టి చర్యలు తలపెట్టారు.
పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో అత్యధికులు రాజపక్సేసోదరులకు సన్నిహితులు. నిరసనకారుల ఉద్యమాన్ని నిరసిస్తున్నవారు. రణిల్ కు రాజపక్సే సోదరుల మద్దతు ఉన్నది కనుక అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు. విక్రమసింఘేకి ప్రధాన ప్రత్యర్థి అధికార ఎస్ఎల్ పీపీలోని అసమ్మతినేత, మాజీ విద్యామంత్రి డల్లస్ అహప్పెరుమా, మూడో అభ్యర్థి పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ కి చెందిన అనూరా దిస్సానాయకే అనే 53 సంవత్సరాల వ్యక్తి.
ఇప్పుడు రాజపక్సే సోదరుల భవిష్యత్తు రణిల్ విక్రమసింఘే సామర్థ్యం, సమయస్ఫూర్తిపైన ఆధారపడి ఉంటుంది. రణిల్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తేగలగితే, తిరిగి పర్యాటకం వృద్ధి చెందితే, ఆదాయం మెరుగుబడితే పరిస్థితుల బాగుపడతాయి. అప్పుడు రాజపక్సే సోదరులు తిరిగి స్వదేశంలో సంచరించవచ్చు. దాని తర్వాత చైనా, భారత్ తో సంబంధాల విషయంపైన ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. రెండు దేశాలతో స్నేహం కుదరదు కనుక ఏదో ఒక దేశాన్ని ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. ఆ విషయం కూడా కీలకం కాబోతున్నది. చైనాతో సన్నిహితంగా ఉండటం వల్లనే ఆర్థిక స్థితి క్షీణించిందనే అభిప్రాయం ఉన్నది. చివరికి తేల్చుకోవలసింది ఆ దేశ అధ్యక్షుడి హోదాలో ఉంటే రణిల్ విక్రమసింఘే. గొటబాయ అధ్యక్షుడిగా ఉన్న రోజులలో శ్రీలంక చైనాకు దగ్గరిగా జరిగింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. అందుకు చైనా నుంచి భారీగా రుణాలు తీసుకోవలసి వచ్చింది.
ఈ రోజుల శ్రీలంక అప్పుల మొత్తం 51 బిలియన్ డాలర్లు. శ్రీలంక నెలకు బిలియన్ డాలర్లు ఉంటే కానీ అవసరమైన నిత్యావసర వస్తువుల దిగుమతి చేసుకోగలదు. శ్రీలంక పాలకులు చైనా పరిష్వంగంలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత భారత్ మూడున్నర బిలియన్ డాలర్లు విలువ చేసే ఆర్థిక సహాయం చేసింది.