Sunday, December 22, 2024

రంగనాథ్ : అసాధారణ జర్నలిస్టు, యాక్టివిస్టు

దాదాపు అయిదు దశాబ్దాల పాత్రికేయ ప్రయాణంలో నేను వందలాదిమంది పాత్రికేయులతో కలసి పని చేశాను. కార్యాలయంలో పని చేసేవారూ, క్షేత్రంలో పని చేసే రిపోర్టర్లూ నాతో ఎప్పుడూ సంపర్కంలో ఉండేవాళ్ళు. రోజుకు వంద విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ విధంగా నాకు తారసపడిన జర్నలిస్టులలో అతి విశిష్టమైన వ్యక్తి నిమ్మకాయల శ్రీరంగనాథ్. అద్భుతమైన ప్రతిభ కలిగిన జర్నలిస్టూ, మంచి మనిషీ. ఎనభై ఏళ్ళ రంగనాథ్ సోమవారం (7 ఫిబ్రవరి 2022)నాడు ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. నేనూ, ఆయనా ఉదయం, వార్త పత్రికలలో కలసి పని చేశాం.

కోనసీమ రాడికల్

రంగనాథ్ మొదటి నుంచీ వామపక్షవాది. సమతావాది. యువకుడుగా ఉన్నప్పుడే రాడికల్ సిద్ధాంతాలలో నమ్మకం కుదిరిన వ్యక్తి. పుస్తకాలు చదివే అలవాటు చిన్నతనంలోనే అలవడింది. తరమిల నాగిరెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేసి విప్లవరాజకీయాలలోకి దూకినప్పుడు రంగనాథ్ ఆయనతోనే ఉన్నారు. అది మార్చి 1969. మార్క్సిస్టు పార్టీ వైఖరితో విసిగిపోయి నాగిరెడ్డి పార్టీతో తెగతెంపులు చేసుకొని అసెంబ్లీ నుంచి కూడా రాజీనామా చేసి దేవులపల్లి వెంకటేశ్శరరావు తో కలసి పని చేయడానికి విప్లవ రాజకీయాలలోకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూషనరీస్ (ఏపీసీసీసీఆర్)ను నెలకొల్పారు. ఈ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 11) నాగిరెడ్డి 105వ జయంతి. నాగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు రాసిన గొప్ప పుస్తకం ‘ఇండియా మార్టగేజ్డ్’ను రంగనాథ్ తెలుగులోకి ‘తాకట్టులో భారతదేశం’ అనే శీర్షికతో అనువదించారు. కార్మికోద్యమంలో  రంగనాథ్ చురుకుగా పాల్గొన్నారు. మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు సిద్ధాంత ప్రచారకుడిగా, ఆ సిద్దాంతాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయం చేసి విడమర్చి చెప్పే మేధావిగా గురుతరమైన పాత్ర పోషించారు.

నాగిరెడ్డికి ఆత్మీయుడు

నాగిరెడ్డి ఆత్యయిక పరిస్థితిలో 1976 మార్చిలో వెంకటరామయ్య అనే మారు పేరుతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటూ చనిపోయారు. ఆయన భౌతికకాయాన్ని తరిమెల తీసుకువెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు తిరుగుబాటు చేశారు. అప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం కానిచ్చి భౌతిక కాయాన్ని వెళ్ళనిచ్చారు. నాగిరెడ్డి మరణానంతరం రంగనాథ్ జర్నలిస్టుగా కుదురుకున్నారు. నాగిరెడ్డితో కలసి పని చేయడం, కార్మికోద్యమంతో మమేకం కావడం, గ్రంథపఠనం ద్వారా అబ్బిన పరిజ్ఞానం రంగనాథ్ కు జర్నలిస్టు జీవితంలో  ఉపకరించిన అంశాలు. ఇతర జర్నలిస్టుల కంటే భిన్నంగా ఆలోచన, కార్యాచరణ ఉండేవి. ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. జర్నలిస్టుగా రంగనాథ్ రాజీపడని యోధుడు. పరిశోథనాత్మక జర్నలిజంలో దిట్ట. ముఖ్యంగా నీటిపారుదల రంగాన్ని కాచివడబోశారు. నేను ఆయనను 1984 డిసెంబర్ లో మొదటిసారి కలుసుకున్నా. ఉదయం విజయవాడ ఎడిషన్ కు బాధ్యుడిగా నన్ను సంపాదకుడు ఏబీకే ప్రసాద్ నియమించేవారు. ప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ వాసుదేవరావు, న్యూస్ఎడిటర్ పతంజలి హైదరాబాద్ లో ఉండేవారు. నేనూ, తాడి ప్రకాష్ (మోహన్ సోదరుడు), సత్యనారాయణ, రామారావు విజయవాడలో ఉండేవాళ్ళం. తర్వాత వసంతలక్ష్మి వచ్చి చేరారు. కొద్దోగొప్పో అనుభవం ఉన్నవాళ్ళం మేమే. తక్కినవారంతా పెద్దగా అనుభవం లేనివాళ్ళు. ప్రతిభ దండిగా ఉన్నవాళ్ళు. రంగనాథ్ మాకు కాకినాడ విలేఖరి. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించిన రంగనాథ్ కు అన్ని ప్రాంతాలూ తెలుసు. ఉభయగోదావరి జిల్లాలూ కొట్టిన పిండి.

పరిశోథనాత్మక జర్నలిజానికి స్వర్ణయుగం

ఉదయంలో పరిశోధనాత్మక జర్నలిజానికి పెద్దపీట. రోవింగ్ కరెస్పాండెట్ల (సంచార విలేఖరులు) వ్యవస్థ ఉండేది. తెలంగాణలో ఇద్దరూ, సీమాంధ్రలో నలుగురూ సీనియర్ జర్నలిస్టులు పరిశోథనాత్మక కథనాలకోసం తిరుగుతూ ఉండేవారు. వారు కాకుండా జిల్లా రిపోర్టర్లు కూడా మంచి కథనాలను తవ్వితీసేవారు. ధవళేశ్వరం ఆనకట్ట పనులలోనో, ఏలేశ్వరం ప్రాజెక్టులోనో అవకతవకలు విరివిగా జరిగేవి. అవి జరగడం కొత్తకాదు. వింత కాదు. వాటిని వెలికితీసి పత్రికలకు ఎక్కించడం విశేషం. అది ఉదయంతో మొదలయింది. రంగనాథ్ మంచి పరిశోథనాత్మక కథనం దొరికిన ప్రతిసారీ వార్తావ్యాసం రాసుకొని స్వయంగా విజయవాడ వచ్చేవారు. నాకు వార్త ఇచ్చి దాని నేపథ్యం వివరించేవారు. అందులోని సమాచారాన్ని ఎట్లా సేకరించారో చెప్పేవారు. తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లూ, వారి ఫోన్ నంబర్లూ ఒక కాగితం మీద రాసి నాకు ఇచ్చి ‘మీరు అవసరం అనుకుటే వారితో మాట్లాడి వాస్తవాల్ని ధ్రువీకరించుకోవచ్చు,’ అని చెప్పేవారు. నేను ఎన్నడూ ఎవ్వరికీ ఫోన్ చేయలేదు. రంగనాథ్ వ్యక్తిత్వంపట్ల, నిజాయతీపట్ల, సత్యనిష్ఠపట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నాయి. ఇంజనీర్లూ, రాజకీయ నాయకులూ ఫోన్ చేసేవారు. విజయవాడ వచ్చి కలుసుకునేవారు. రంగనాథ్ కథనాలను ఆపు చేయాలని కోరేవారు. ఒత్తిడి తెచ్చేవారు. అటువంటి ఒత్తిళ్ళకు లొంగే అవకాశమే లేదు. ఎందుకంటే కథనం ఇచ్చినప్పుడే దాని నేపథ్యం నాకు చెప్పేవారు కనుక నాకు సందేహాలు ఏమీ ఉండేవి కావు. ఎవరో ఒత్తిడి తెచ్చారని వృత్తిపట్ల విశేషమైన నిబద్ధత కలిగిన రిపోర్టర్ దాఖలు చేసిన పరిశోధనాత్మకవార్తను బుట్టదాఖలు చేసే ప్రసక్తే లేదు. నా దగ్గరికి వచ్చినా లాభం లేదని నిర్ణయించుకున్న కొందరు రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లూ, ఇంజనీర్లూ దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళేవారు. ‘నాకు వార్తలతో సంబంధం లేదు. మూర్తిగారే చూసుకుంటారు. ఆయనదే ఖరారు నిర్ణయం. నా దగ్గరికి వచ్చి ప్రయోజనం లేదు,’ అని దాసరి స్పష్టం చేసేవారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే అద్భుతాలు చేయగలిగాం. ముఖ్యంగా దాసరి ఆధ్వర్యంలో నడిచిన నాలుగున్నర సంవత్సరాలూ ‘ఉదయం’ దగద్ధగాయమానంగా నిలిచి వెలిగింది. ఆ విధంగా వెలిగించిన యువకులలో చాలామంది ఉదయం మూసివేసిన తర్వాత సైతం జర్నలిజంలో సారథులై వెలిగారు. ఇప్పటికీ వెలుగుతున్నారు.

వార్తలే ఎఫ్ఐఆర్ లు

అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావు ఉండేవారు. ‘ఉదయం’ ప్రచురించిన వార్తలను ప్రథమ సమాచార నివేదికలుగా (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్) గా పరిగణించాలనీ, వార్తాకథనాలపైన ప్రభుత్వాదికారులు దర్యాప్తు చేయాలని, అవసరమైన సందర్భాలలో చర్యలు తీసుకోవాలనీ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘ఉదయం’ ప్రచురించిన పరిశోథనాత్మక వార్తలలో అత్యధికశాతం నిజమేనని తేలాయి. లంచగొండి అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రంగనాథ్ వార్తల కారణంగా ధవళేశ్వరం, ఎలేరు ప్రాజెక్టులలో పని చేసిన ఇంజనీర్లు కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. అంతకంటే ముఖ్యమైన అంశం ఏమంటే, ఉదయం పరిశోథనాత్మక కథనాల కారణంగా కొన్ని వందలకోట్ల ప్రభుత్వ ధనం వృధా కాకుండా అరికట్టగలిగారు. నేను ‘ఉదయం’లో ఉద్యోగం మానేసి దిల్లీ వెళ్ళిన తర్వాత రంగనాథ్ ను తూర్పుగోదావరి నుంచి బదిలీ చేయించడంలో రాజకీయ నాయకులు విజయం సాధించారు. బదిలీ గురించి తెలియగానే రంగనాథ్ రాజీనామా సమర్పించారు. ‘వార్తాకిరణం’ అనే స్థానిక పత్రిక ప్రారంభించి కొంతకాలం నడిపారు. బాగానే నష్టబోయారు. అయినప్పటికీ, ‘వార్తాకిరణం’లో ప్రచురించిన సంపాదకీయాలను తోటి జర్నలిస్టు మిత్రులూ, రాజకీయ నాయకులూ మెచ్చుకుంటే ఆనందించేవారు.

‘ఉదయం’ మూసివేత

ఉదయం పత్రికను సమ్మె కారణంగా 25 మే 1995న మూసివేశారు. నేను, మరికొంత మంది సహచరులతో కలిసి కొంతకాలం ‘పద్మాలయా టెలివిజన్’ లో పని చేశాం. ఏబీకే ప్రసాద్ ‘వార్త‘ దినపత్రికను నెలకొల్పి యాజమాన్యంతో విభేదాలు వచ్చి రాజీనామా చేశారు. ‘వార్త’ యజమాని గిరీష్ సంఘీ మిత్రుడు కెఆర్ పి రెడ్డి ద్వారా కబురు పెడితే వెళ్ళి ‘వార్త’ సంపాదకుడిగా 1998 ఏప్రిల్ లో చేరాను. కొన్ని మాసాల తర్వాత రంగనాథ్ ను తీసుకున్నాం. ఆయనకు దేశ రాజధానిలో కొంతకాలం పనిచేయాలనే కోరిక బలంగా ఉండేది. జాతీయ రాజకీయాలు ఆయనకు కరతలామలకం. దిల్లీ ఉన్నది కొద్ది మాసాలే అయినా ఆయన నితీష్ కుమార్ తో, లాలూప్రసాద్ యాదవ్ తో, ములాయంసింగ్ తో, యశ్వంత్ సిన్హాతో, జస్వంత్ సింగ్ తో, సీపీఎం, సీపీఐ నాయకులతో,ఇతర ఉత్తరాది నేతలతో నిత్యం సంపర్కంలో ఉండేవారు. జాతీయ స్థాయి వార్తావిశ్లేషణలు రాసేవారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అక్కడ మొదలైన ‘ఏపీ టైమ్స్’ బ్యూరో చీఫ్ గా చేరారు. నేనూ ఆ పత్రికలో వారానికి ఒక రోజు కాలం రాసేవాడిని. నా మిత్రుడు వజీరుద్దీన్ అక్కడ అసోసియేట్ ఎడిటర్ గా పని చేస్తూ ఉండేవారు. ఎడిటర్ గా శ్యామ్ రాజప్ప ఉండేవారు. ఆయన నా బోటి వాళ్ళతో మాట్లాడే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చర్చించేవారు. ఆ విధంగా ఆయన దక్షిణాది రాజకీయ పరిణామలపైన ఆధిపత్యం సంపాదించారు. ఆయన చిన్నతనంలో కేరళలో రాజన్ అనే యువకుడు అదృశ్యం కావడానికి సంబంధించిన ఉదంతంపైన పరిశోధన చేశారు. స్వయంగా జైలుకి వెళ్ళి అక్కడే ఖైదీగా ఉంటూ జైలులోనే ఉన్న రాజన్ సహచరుడిని కలుసుకొని కూపీలాగి రాజన్ ను పోలీసులు చంపివేశారని నిర్ధారించుకొని ప్రపంచానికి వెల్లడించారు. భారత జర్నలిస్టులలో ఇంగ్లీషు శుద్ధంగా రాసే మేటిగా (మాస్టర్ ఆఫ్ క్వీన్స్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ జర్నలిజం) గొప్ప పేరు తెచ్చుకున్నారు.

‘ఆంధ్రప్రభ’ కొనుగోలు

‘ఏపీ టైమ్స్’ మూతబడిన తర్వాత తెలుగులో ఒక వార్తా సంస్థని నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు. కాకినాడ ఎంఎల్ఏగా పని చేసిన ముత్తా గోపాలకృష్ణకు ఒక శాటిలైట్ చానల్ ఉండేది. దానికి పని చేయవలసిందిగా రంగనాథ్ ని గోపాలకృష్ణ ఆహ్వానించారు. రంగనాథ్ ఆయన చేత ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ‘ఆంధ్రప్రభ’ను కొనిపించారు. చరిత్ర ఉన్న పత్రిక. మనోజ్ సంతాలియాతో బేరం జరిగిన రోజున గోపాలకృష్ణ చెన్నై నుంచి హైదరాబాద్ లో ఉన్న నాకు ఫోన్ చేసి ఆంధ్రప్రభ తీసుకుంటున్నాననీ, దానికి నేనే సంపాదకులుగా ఉండాలనీ అన్నారు. గోపాలకృష్ణ అధీనంలోకి ‘ఆంధ్రప్రభ’ వచ్చిన తర్వాత దాంట్లో న్యూస్ నెట్ వర్క్ (వార్తాసేకరణ వ్యవస్థ) సంపాదకుడిగా రంగనాథ్ పని చేశారు. అదే ఆయన చేసిన చివరి ఉద్యోగం. అయితే, జర్నలిజంలో ఉద్యోగ విరమణ ఉండవచ్చును కానీ ఉద్యమ విరమణ ఉండదనీ, జర్నలిజం అనేది కేవలం వృత్తికాదనీ అది ఉద్యమమనీ ఆయన  చెబుతూ ఉండేవారు. నా అభిప్రాయం కూడా అచ్చంగా అదే. నేను హెచ్ఎంటీవీలో, సాక్షిలో పని చేస్తున్న రోజుల్లో పరిశోధనాత్మక వార్తావ్యాసాలు నాకు పంపేవారు. ప్రచురించేవాణ్ణి. నేను ఎక్కడ పని చేసినా ఏదైనా వ్యాసం కానీ సంపాదకీయం కానీ రాస్తున్న సమయంలో సందేహం వస్తే వెంటనే రంగనాథ్ కి ఫోన్ చేసేవాడిని. సందేహ నివృత్తికీ, సమాచార నిర్ధారణకూ ఆయన ఇచ్చే సమాధానం సరిపోయేది. తెలుగు రాజకీయాలూ, భారత రాజకీయాల తేదీలూ, సందర్భాలూ, ఘటనలూ, వ్యక్తులూ, ఇతర వివరాలూ ఆయనను నిద్రలేపి అడిగినా తడుముకోకుండా చెప్పగలిగేవారు. నూటికినూరుపాళ్ళూ జర్నలిస్టు కావడం మూలంగా నిత్యఅధ్యయనశీలం చివరి వరకూ కొనసాగింది. ఆయన వేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీఐఎల్) తాలూకు కేసులు ఇప్పటికీ కోర్టులలో అపరిష్కృతంగా ఉన్నాయి.   

సుదీర్ఘమైన జర్నలిస్టు జీవితంలో అనేకమంది యువకులకు జర్నలిజం మెళకువలు నేర్పారు. సూత్రబద్ధంగా జీవించడం ఎట్లాగో, రాజీపకుండా రాయడం ఎట్లాగో చేసి చూపించారు. చాలామంది యువజర్నలిస్టులకు మెంటర్ గా ఉండేవారు. ఆదర్శంగా నిలిచేవారు.

జాతీయ దృక్పథం

ఇతర వృత్తులలాగానే జర్నలిజం కూడా ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ. ఇతరులను చులకన చేసి మాట్లాడటం, ఎదుటివారికి ఏమీ తెలియదనీ, తనకే సర్వం తెలుసుననీ మాట్లాడే వాచాలత్వం తెలుగు జర్నలిస్టులలో కూడా కనిపిస్తుంది. కానీ రంగనాథ్ నా ఎదుట ఎన్నడూ మరో జర్నలిస్టుని తక్కువ చేసి మాట్లాడిన సందర్భం లేదు. చిన్నప్పటి నుంచీ వామపక్ష భావాలూ, జాతీయ దృష్టీ, కార్మికోద్యమ నేపథ్యం ఉండటం వల్ల కావచ్చు విశాల దృక్పథం ఉండేది. నేలబారు ఆలోచనలు కానీ సంకుచిత మనస్తత్వం కానీ ఉండేవి కాదు. సమాజాన్ని ఉద్ధరించాలని చిన్నతనంలోనే సంకల్పించినవారికి సహజంగానే కురచబుద్ధులు ఉండవు. రంగనాథ్ చివరి శ్వాసవరకూ నికార్సయిన జర్నలిస్టుగానే జీవించారు. అక్షరాలతో ఆడుకుంటూనే, అనాయాసంగానే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. రంగనాథ్ కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తి అమెరికాలో ఉంటున్నారు. గురువారంనాడు రంగనాథ్ అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి. కుమారుడు వంశీ శ్రీనివాస్ తండ్రి అడుగుజాడలలోనే జర్నలిస్టుగా చేరి మంచి  పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ గా పని చేస్తున్నాడు. నేనూ, రంగనాథ్ ఇద్దరం కలిసి చివరిసారిగా పని చేసింది ‘వార్త’లోనే. ఆ తర్వాత నేను ఎక్కడున్నా, ఆయన ఎక్కడున్నా మా మధ్య సంబంధాలు సజీవంగా కొనసాగాయి. వర్తమాన పరిణామాల మీద అభిప్రాయాలు పంచుకుంటూ ఉండేవాళ్ళం. రెండు మాసాల కిందటే విజయవాడ నుంచి ఫోన్ చేసి మనవరాలిని దగ్గరుండి చదివిస్తున్నాననీ, చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాననీ అన్నారు. ప్రేమాస్పదుడు. కుటుంబాన్ని ప్రేమించినవాడు. సమాజాన్ని విస్తృత కుటుంబంగా పరిగణించినవాడు. ఇంతలోనే వెళ్ళిపోతారని ఊహించలేదు. రంగనాథ్ లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.     

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles