రామాయణమ్ – 217
తాను రాజు కావలెనని తనకోసమే ఎదురు చూస్తూ తనంటే ప్రాణం పెడుతున్న విశాల జన హితము గురించి ఆలోచించాలా?
లేక తన ఆనందము తన సౌఖ్యము చూసుకొనే కాముకుడు రాముడు … పరులపంచన సంవత్సరము పడియున్న స్త్రీ అయినప్పటికీ కామాతురుడై భార్యకోసము వెంపర్లాడే స్వభావము కలిగినవాడు రాముడు! అని జనులన్నా పట్టించుకోకుండా రాజ్యముకన్నా రమణి ఆలింగనమే మిన్న అని ఊరకుండవలెనా?
తన సుఖమా? జనహితమా?
ఒక నిశ్చయానికి వచ్చాడు రాఘవుడు!
అంతలో ఏదో కలకలం వినిపించింది తల ఎత్తి చూశాడు! వానరులను సీతాదేవి ఉన్న పల్లకి వద్దకు పోకుండా చింతబరికెలతో తరుముతున్నారు. వానరులవేమీ పట్టించుకోకుండా పరదాలమాటున ఉన్న పడతి సీతను చూడటానికై ఎగపడుతున్నారు.
ఆ దృశ్యము చూడగనే రామునకు అమితమైన క్రోధము కలిగింది! విభీషణా నా మాటలు తిరస్కరించి ఎందులకావిధముగా స్వజనమును బాధించుచున్నారు!
స్త్రీకి శీలమే మేలిముసుగు!
వేరే ఏ ముసుగులు అవసరములేదు!
‘‘పరదాలు తొలగించు’’ అని ఆజ్ఞాపించినాడు.
అంతలో మెల్లగా పల్లకీ రాముని సమక్షములో ఆగింది!
జనులందరూ చేరి ఉన్న సభలో సిగ్గుతో ఆ తల్లి అవయవములు ముడుచుకొని వస్త్రముతో కప్పుకొని భర్తను చేరి ….‘‘ఆర్యపుత్రా!’’ అని మాత్రము పలికి కంటనీరుపెట్టింది
రాముని ముఖమును చూచినది సీతమ్మ. అప్పటివరకు ఆయనను మరల తిరిగి చూడగలనో లేదో అని సందేహముతో జీవించినది!
ఆ నీలమేఘశ్యాముని కనులారా కాంచినది. గుండెలనిండా ప్రేమపొంగినది! ….
రామచంద్రుని హృదయములో ఎన్నిభావనలో అంతరంగంలో ఎన్ని సుడిగుండాలో!
తన ప్రేయసి! తన ప్రాణము! తన సర్వస్వము!
ఊహూ ఏమీకాదు తానే ఆమె!
ఆమేతాను!
ఎవరికోసమై పరితపించి పిచ్చివాడుగా మారినాడో …ఆమె!
ఎవరికోసమై అనితరసాధ్యమైన సేతువు సముద్రముపై నిర్మించినాడో… ఆమె!
ఎవరికోసమై ఇంద్రాదులను సైతము గజగజవణకించిన రావణుని హతమార్చినాడో ..ఆమె!…
నేడు తనముందు మరల నిలుచున్నది. హృదయము వశము తప్పుచున్నది!!
కానీ కర్తవ్యము!!!
తాను భర్తమాత్రమే కాదు రాజు కాబోయే భర్త
వెన్నవంటి మనస్సు సీతారామునిది.
పూవు వంటి హృదయము జానకిరామునిది.
కానీ, ఆయన రాజారాముడు కూడా!!
శిలాసదృశమైన మనస్సుతో, వజ్రము వంటి కఠినమైన హృదయంతో రాజారాముడు తన తీర్పుచెప్పబోతున్నాడు.
వెన్నెలకురిసే నగుమోము నేడు గంభీరమై ఎవరికీ తేరిపార చూడరానిదయినది.
రాజుకు ప్రమాణము అతని మనస్సుకాదు…
ప్రజాభిప్రాయమే ప్రమాణము. ప్రజలలో తనగురించి అనుమానము, శంక కలుగకుండా పరిపాలనము చేయువాడే అసలుసిసలైన రాజు!
తన మనస్సుకు తెలుసు ఏ దోషములేని తన పడతిని తాను భర్తగా స్వీకరించవచ్చునని.
కానీ ఒక రాజుగా తనకు ప్రజాసమ్మతి దొరకగలదా?
దొరకదు గాక దొరకదు ..
ఒక సంవత్సరము పరుని ఇంట వసించిన స్త్రీని తమ రాణిగా వారు ఒప్పుకొనరు. …
ఆయన ముఖకవళికలు మారిపోయినవి ….‘‘సీతా !నిన్ను అపహరించి నన్ను అవమానించిన రావణుని సబాంధవముగా తుడిచిపెట్టితిని. పౌరుషముగల పురుషుడు చేయదగ్గ పని చేసితిని.
‘‘సీతా, నీకొరకు కాదు నేను ఇంత శ్రమపడినది (ఈ మాటలు అంటునప్పుడు ఆయన ప్రక్కచూపులు చూస్తూ మాటలు కొనసాగించాడు. సూటిగా చూడలేకపోయాడు) నాకు అపకీర్తి రాకూడదని ఇన్ని కష్టనష్టములకోర్చి నాకు కలిగిన అవమానమునకు బదులు తీర్చుకొంటిని…..
‘‘అసలు నిన్ను చూస్తుంటేనే నా మనస్సు బాధకు లోనవుతున్నది. కంటి జబ్బు కలిగినవాడికి దీపమును చూస్తే ఎంతబాధకలుగునో నిన్ను చూసినప్పుడు నాకు అంత బాధ కలుగుతున్నది .నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును. నీకు నచ్చినట్లుగా నీవుండుము.
‘‘ఎవరి ఆశ్రయమైనా నీవు స్వీకరించవచ్చును. నిన్ను పరిగ్రహించుటకు నా మనస్సు అంగీకరించుటలేదు …’’
రాముని నోట ఎప్పుడూ ప్రియ వచనములే వినుటకు అలవాటు పడిన సీతమ్మకు ఈ మాటలు పిడుగులవలె తాకినవి.
పెనుతుఫానుగాలికి ఊగిపోవు మొక్కలవలే, రెపరెపలాడు గడ్డిపరకలవలే ఆమె శరీరము వణికి పోసాగినది .
అసలు ఇటువంటి మాటలు మాటలాడినది రామచంద్రుడేనా? రాముడు కూడా ఈ విధముగా మాటలాడునా???
వూటుకూరు జానకిరామారావు