రామాయణమ్ – 39
గుహుడు తెప్పించిన మర్రిపాలు జుట్టుకు తను రాసుకొని తమ్ముడు లక్ష్మణునికి తానే స్వయంగా రాశాడు రాముడు. నార చీరలుకట్టి జటలు ధరించిన సోదరులిరువురూ ఋషులలాగా శోభిల్లారు
‘‘మిత్రమా గుహా! సైన్యమూ,ధనాగారము, దుర్గము.(Armed forces, Treasury, Defence systems) ఈ మూడిటి విషయములో ఏ మాత్రము ఏమరుపాటు లేకుండా ఉండు. రాజ్యము పరిపాలించుట చాల కష్టమని పెద్దలు చెపుతున్నారు’’ అని రాముడు పలికి గుహుని వీడి నావవద్దకు వెళ్లాడు.
Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు
లక్ష్మణుడు ముందుగా సీతమ్మను ఎక్కించి, తాను ఎక్కాడు ఆ తరువాత రాముడు నావ ఎక్కి కూర్చున్నపిదప గుహుడు నావను అవతలి ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించాడు.
రాముడు నావెక్కిన వెంటనే తన శ్రేయస్సును కోరుతూ నావెక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు.
నావ గంగానది మధ్యకు చేరింది!
Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు
అప్పుడు సీతమ్మ గంగమ్మను ప్రార్థిస్తూ ఆవిడకు మొక్కులు మొక్కుకుంది. ‘‘అమ్మా! వనవాసము నుండి మేము క్షేమముగా తిరిగి వచ్చిన పిదప నిన్నుకొలుస్తానమ్మా! నీ సంతోషం కోసం బ్రాహ్మణులకు లక్షల గోవులు, అన్నవస్త్రాలు ఇస్తాను. నేను నియమముతో నీకు వేయి కుండలతో కల్లు, మాంసాహారము, సమర్పించుకుంటానమ్మా! నీ ఒడ్డున ఉన్న సమస్తదేవతలను పూజించుకుంటాను.’’ ఇలా ఆవిడ మొక్కులు మొక్కుకుంటూ ఉండగనే నావ దక్షిణపు ఒడ్డును చేరుకుంది.
రాముడు నావ దిగాడు మెల్లగా సీతమ్మకు చేయి అందించి సుతారంగా పట్టుకొని దింపాడు. ఆతరువాత లక్ష్మణుడు కూడా దిగాడు.
అది నిర్జన ప్రదేశము. లక్ష్మణుడితో కూడి సీతారాములు నడక మొదలు పెట్టారు. ముందు లక్ష్మణుడు ఆ వెనుక సీతాదేవి వారిరువురినీ కాచుకుంటూ వెనుక రామచంద్రుడు. సీతమ్మ భద్రంగా రామలక్ష్మణుల మధ్యలో నడువసాగింది.
Also read: కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
నడుస్తూ మాట్లాడు కుంటున్నారు. వనవాసంలో కష్టాలేమిటో ఇక నుంచీ సీతకు బాగా అర్ధమవుతాయిలే (రావద్దంటే పట్టుబట్టి భర్తమీద అలిగి మరీ వచ్చిందిగా సీతమ్మ. ఇహ రామయ్యమొదలుపెట్టాడు ఆవిడకు కష్టాలగురించి చెప్పటం. ఇది దెప్పిపొడుపేనేమో)..ఏ పని అయినా మన చేయిదాటిపోతే దానిని సరి చేయటం చాలా కష్టం! ( నిజమే కదా).
ఈ వనంలో జనులుగానీ, పొలాలుగానీ, తోటలుగానీ ఉండవు. మిట్టపల్లాలు, లోతైన లోయలు ఉంటాయి. అట్లాంటి వనంలోకి సీత ఈనాడు ప్రవేశిస్తున్నది.
నడిచీ,నడిచీ బాగా ఆకలి వేస్తున్నది మువ్వురికీ. అప్పుడు లక్ష్మణుడు సేకరించి తెచ్చిన ఆహారాన్ని భుజించి రాత్రి విశ్రమించటానికి ఒక చక్కటి చెట్టు మొదలు చూసుకొని దాని క్రిందకు చేరారు.
ఆ రాత్రి కీకారణ్యములో మొదటిరాత్రి వారు మువ్వురికి.
Also read: తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత
సాధారణ మానవుడై జరిగిన విషయాలు తలచుకొని దుఃఖితుడయ్యాడు మరలా రామచంద్రమూర్తి. ‘‘లక్ష్మణా, నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఏ తల్లిబిడ్డలను విడదీసినదో కానీ ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది. అంతటి మహాధార్మికుడైన మనతండ్రికి ఈ వయస్సులో ధర్మము, అర్ధము కంటే కామమే ప్రధానమైనదికదా! ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాటమీద విడిచేవాడుంటాడా? ముదిమివయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు. భరతుడు రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుకుంటాడు. చూడబోతే ఈ కైక నన్ను అడవుల పాలు చేయడానికి, దశరథుడిని చంపడానికి, భరతుడిని రాజు చేయడానికే మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది. కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యముతో కన్నుమిన్నుగానక కౌసల్యా, సుమిత్రలను కష్టపెడుతుందేమో! లక్ష్మణా నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో! అనాధ అయిపోయిన నా తల్లిని రక్షించుము. ఇది అమ్మకు దగ్గర ఉండి సేవ చేయవలసిన సమయము. తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను. ఏ ఆడుదీ నా వంటి కొడుకును కనకుండుగాక. వ్యర్ధజన్ముడను నేను. లక్ష్మణా, నేను కోపిస్తే అయోధ్యనేమిటి, సమస్తభూమండలాన్నే స్వాధీనమొనర్చుకొనగలను. కానీ ఇది పరాక్రమము చూపే సందర్భముకాదు కదా!’’ ఇలా అంటూ కంటినిండా నీరునింపుకొని దైన్యముతో ఇంకా ఏమీ మాటాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు.
Also read: మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి
విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు. ‘‘అన్నా నీవే ఇలా దిగులుపడితే నేనూ, వొదినగారూ ఏం కావాలి? నీవు దగ్గరలేక పోతే నేను గానీ, సీతమ్మకానీ నీటినుండి బయటకు తీసిన మత్స్యములమై పోతామయ్యా! క్షణకాలము కూడా భూమిపై మనలేము. శత్రుసంహారకుడవైన ఓ రామా! నిన్ను విడిచి నా తల్లి సుమిత్రనుకానీ, శత్రుఘ్నుని కానీ, తండ్రినికానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను.’’ సర్వలోకాలను ఆనందింప చేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు(రామో రమయతాం శ్రేష్ఠః) తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగావించుకొనుటకు సంకల్పించుకొన్నాడు.
అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వతచరియలపై నిర్భయముగా సంచరించే రెండు సింహాలలాగ ప్రకాశించారు.
……..
NB
(ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఘట్టాలు దాదాపు గా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూనే ఉంటాయి. మనసు నీరవుతూనే ఉంటుంది. అయినా, ఎన్నుకున్న మార్గంలో ముందుకు నడిచే వాడే ధీరుడు…
……..
అనుకోలేదాయన అడవులకు వెళ్ళాల్సి వస్తుందని! కానీ పిడుగులాంటి ఆ నిర్ణయం తనకు తనే చేసుకున్నాడు. మార్పును ఆహ్వానించాడు. ఆ మార్పుకు అలవాటుపడే క్రమంలో రాముడి మనస్సుకు దర్పణమిది!
CHANGE MANAGEMENT!
Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు
వూటుకూరు జానకిరామారావు