Saturday, November 23, 2024

తెగి మొలచిన రావణు శిరస్సులు

రామాయణమ్ 211

అదుగదిగో వచ్చుచున్నది రాక్షససార్వభౌముని భీకరము శత్రుభయంకరము అయిన మహారధము.

 అది రధమా లేక గంధర్వనగరమా?

చిత్రచిత్రవర్ణాలు విచిత్రమైన చాందినీలు, ధ్వజములు, గోపురములు, తోరణములు రకరకముల పతాకలు మాలలతో రధము అత్యద్భుతముగా అలరారుచున్నది.

Also read: రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి

ఆకాశమును ఆక్రమించినాడా? భూమిని బ్రద్దలుకొట్టుచున్నాడా అనునట్లుగా ఆ రధముపై రావణుడు ప్రయాణించుచుండెను.

భూనభోంతరాళములను, దిక్కులను పగులగొట్టునట్లుగా, ఆకాశమునుండి వర్షధారలు కురియునట్లుగా బాణములు కురిపించుచూ భూమిని కప్పివేస్తూ దిక్దిగంతములు చీకటిచేయుచూ మహావేగముతో ఆ తేరు  తరంగ వేగముతో వచ్చుచున్నది.

రాముడు ఆ రధమును చూసి ఉప్పొంగిన ఉత్సాహముతో, దేవేంద్రసారధిని చూసి మాతలీ, రావణ రధమునకు కుడిప్రక్కగా మన రధమును పోనిమ్ము  అనుచూ అతనిని ఉత్సాహపరచి బాలచంద్రుని వలె వంగియున్న ఇంద్రుడు పంపిన ధనుస్సును ఎత్తి పట్టుకొని అడుగు ముందుకు వేసి సమరోత్సాహియై దేవసారధికి సూచనలు  చేయుచూ ….

Also read: రామ-రావణ భీకర సమరం

మాతలీ, రావణుడు చావవలెననే సమరోద్ధతితో మనపైకి వచ్చుచున్నాడు. పరాకు లేకుండ జాగరూకతతో రావణ రధమును సమీపింపుము. ఝంఝామారుతము మేఘములను చెల్లాచెదురు చేయునట్లు  వాని రధమును చీల్చి వేసెదము. నీవు తొట్రుపాటు పడవలదు. అధైర్యపడవలదు. నీ మనస్సు, దృష్టి ఏకాగ్రముగా ఉండవలెను. సావధానుడవై పగ్గములు పట్టుకొనుము. అయినా ఇంద్రుని సారధివి నీకు చెప్పవలెనా? కేవలము సూచన చేయుచున్నాను. అని పలికిన రాముని పలుకులకు ఉత్సాహముగా చిత్రవిచిత్రగతులలో భూమిని తాకీ తాకనట్లుగా అతివేగముగా కదులుతూ దుమ్మురేపుతూ దేవరధము, రామరధము ముందుకు సాగెను.

గుర్రపు గిట్టలవలన రేగిన ధూళి మేఘములవలె మారి రావణ రధమును నింపివేసెను. రావణుని దృష్టికి ఏమీ కనపడకుండా దుమ్ముపొరలుపొరలుగా తెరలుగట్టెను.

చీకాకు పడిన రావణుడు రాముడు లక్ష్యముగా శరసంధానముగావించి గుప్పుగుప్పున బాణములు లెక్కలేనన్ని విడిచిపెట్టెను

Also read: మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ

శ్రీరామజయము, రావణ వినాశము కోరుచూ దేవ ఋషి సంఘాలు తరలివచ్చి ఆకాసమున నిలుచుండి యుద్ధమును వీక్షించుచుండిరి.

ఉత్పాతములు ఎన్నో బయలు దేరినవి. పర్జన్యుడు రావణుని రధముపై రక్తవర్షము కురిపించెను. తీవ్రమైన సుడిగాలులు రావణ రధమునకు ప్రదక్షిణముగా వీచినవి. గ్రద్దలు మండలాకారములో రావణరధముపైన సంచరించినవి. ఉల్కాపాతములు సంభవించినవి. ఈ దుశ్శకునములు రాక్షసుల మనస్సులో తీవ్రమైన విషాదము కలిగించినవి.

వందల కొలది గోరువంకలు దారుణంగా అరుస్తూ వాటిలో అవి కొట్టుకుంటూ రాక్షసరాజు రధమున్నవైపుగా ఎగిరినవి.

ఆ శకునములు చూసి రావణనాశము తథ్యమని ఎరింగి రాముడు ఉత్సాహముతో శరసంధానము చేసెను.

ఆ సమయములో నాకు జయము నిశ్చయము అని రాముడు, మరణము అనివార్యము అని రావణుడు ఎరింగి తమబలములను క్రోడీకరించుకొని యుద్ధము సాగించిరి.

Also read: రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు

మొదట రామరధము యొక్క ధ్వజము రావణుని బాణములకు విరిగి నేలకొరిగినది.

కోపించిన రాముడు ప్రయోగించిన  సర్పముఖాస్త్రము రావణుని ధ్వజమును పడగొట్టెను. అవకాశమే ఇవ్వకుండా రావణుడు గదలు, పరిఘలు, చక్రములు, ముసలములు, పర్వత శిఖరములు వరుసబెట్టి రామునిపై విసిరి వేసి రోషముతో మీసము మెలితిప్పి నిలుచుండెను.

ఒకరినొకరు నొప్పించుకొనుచూ ఎవరికెవరూ తీసిపోకుండా అవిచ్ఛిన్నముగా బాణములు వదులుచూ మహాయయద్ధము సేయుచుండిరి. వనములు, పర్వతములు, అరణ్యములతో కూడిన  సమస్తభూమండలమూ కంపించిపోసాగినది.

ఆకాశమునకు దేనితోపోలిక?

సంద్రమునకు ఏది సరిసాటి?

రామరావణ యుద్ధమునకు సరితూగునది ఇలలోన ఏది?

 రామరావణయుద్ధమే! ….

అనుకొనుచూ పంటిబిగువున వారివురి వింటివిన్యాసములు మింటనుండి దేవతలు వీక్షించిరి.

అంతలో రాముడు ఒక ఘోరవిషసర్పము వంటిబాణమును వింటతొడిగి గురిచూసి రావణుని శిరస్సేలక్ష్యముగా ప్రయోగించెను .అది ఏమాత్రము గురితప్పక వైరివీరుడి శిరస్సును ఎగురగొట్టినది .

నేలరాలిన రావణుని శిరస్సును ముల్లోకములు వీక్షించినవి ….ఆశ్చర్యము, పరమాశ్చర్యము అచ్చముగా అటువంటి శిరస్సే మరల రావణునికి మొలచెను. దానిని కూడా రాముడు ఛేదించెను ….కానీ….

Also read: రావణుడు రణరంగ ప్రవేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles