Thursday, November 7, 2024

లంకను చుట్టుముట్టిన రామసైన్యం

రామాయణమ్ 183

‘‘సుగ్రీవా, నాతో ఆలోచించకుండా ఏమిటి ఈ సాహసము? ప్రభువులు ఇటువంటి సాహసములు చేయవచ్చునా? ఈ కాసేపు నేను లక్ష్మణుడు విభీషణుడు ఎంత ఆందోళన చెందితిమో గదా! నీకేమగునో అని సందేహము! నీకేమయినా అయినచో సీతమ్మతో నాకు ఏమి పని? భరతలక్ష్మణశత్రుఘ్నులు నాకు ఎందుకు? అసలు నీవు లేని నాడు నాకు ఈ శరీరమే అక్కరలేదు.

Also read: రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం

‘‘సుగ్రీవా, నీవు వచ్చుటకు ముందు నేను ఒకటి నిశ్చయించుకున్నాను. నీ పరాక్రమము నేను ఎరుగుదును. మహేంద్రసముడవని తెలుసు. కానీ ప్రేమ భయమునే శంకించుచుండును కదా! ఒక వేళ నీవు మరలి రాని పక్షములో ఆ రావణుని సపుత్రబాంధవముగా యమునికి అతిథిగా పంపి విభీషణుని పట్టాభిషిక్తుని చేసి, అయోధ్యలో భరతుని నిలిపి నా ఈ శరీరమును పరిత్యజించవలెననుకొంటిని……’’

రాముడీవిధముగా మాడ్లాడుట చూసి సుగ్రీవుడు ‘‘రామా, నీ భార్యను అపహరించిన ఆ దుష్టుడు కట్టెదుట కనపడగానే ఆవేశము ఆపుకొన లేకపోయితిని. మన్నింపుము. నీకు ఉపయోగపడని ఈ శరీరమేల రాఘవా!’’ అని పలికెను.

Also read: రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం

…..

(ఇదీ రాముడి స్నేహము! అక్కడ నిషాదరాజు గుహుడు ఆత్మసమసఖుడు. ఇక్కడ వానరరాజు సుగ్రీవునికి రవ్వంత హాని జరిగినా, లేక ఆ ఊహ కలిగినా తట్టుకొనలేనని చెపుతున్నాడు …

ఇంత స్నేహశీలి శ్రీరామచంద్రుడు)

…..

అది సాయం సంధ్య. సూర్యుడి కాంతి రక్తచందనపు వర్ణములో ఆకాశమంతా అలముకొన్నది. విహంగతతులు సూర్యమండలము వైపుగా కదలుతున్నవి. ఆ పక్షులన్ని ఏదో దీనస్వరముతో అరచుచున్నట్లుగా ఉన్నది. మృగములు మోర ఎత్తి పడమటదిక్కుకు చూస్తూ వికృతస్వరముతో అరుస్తూ పరువులు పెట్టుచున్నవి ….

‘‘లక్ష్మణా, అన్నీ రాబోయే భయంకర విలయానికి, అనంతమైన ప్రాణ నష్టానికి సూచికలు …మన సైనికులందరినీ సమాయత్తపరుచుము. వారివారి యూధపతులకు చెప్పి వీరులందరికీ మధురఫలములు, స్వాదుజలములు అందచేయించుము, రణభేరి మోగించుము’’ అని రామచంద్రుడు సోదరుని వైపు చూసి పలికెను.

Also read: సీతమ్మను రామునికి అప్పగించమని రావణుడికి తల్లి కైకసి హితబోధ

రాముని ఆజ్ఞపాటింపబడినది…,

ప్రాభాతవేళలో లంకకు ఎదురుగా ధనుస్సు ఎక్కుపెట్టి రామసింహము కదలెను.

ఆయన వెంట మదించిన ఏనుగుల వలే సకల సైన్యముబయలు దేరింది.

లంకా ప్రాకారమును చుట్టుముట్టి సైన్యమంతా మొహరించినది.

రామచంద్రుడు స్వయముగా ఉత్తరద్వారము వద్ద రావణుని ఎదుర్కొనుటకు సంసిద్ధుడై నిలచియుండెను.

తూర్పుద్వారము వద్ద నీల, మైంద, ద్విదులు తమతమ సైన్యములతో పోటెత్తిరి.

Also read: వానరవీరుల వివరాలు తెలుసుకున్న రావణుడు

అంగద, ఋషభ, గవాక్ష, గజ, గవయులు దక్షిణ ద్వారము వద్ద రణోత్సాహముతో గర్జించుచుంటిరి.

హనుమ తన వెంట ప్రమాధి, ప్రపుసులు రాగా పశ్చిమద్వారమును చుట్టుముట్టెను.

రామునకు పశ్చిమముగా అదనపు సైన్యముతో సుగ్రీవ, జాంబవంతాదులు భయంకరాకారులైన వానరులతో కూడి యుండిరి.

అన్ని వైపుల నుండి రామసైన్యసముద్రము ఉప్పెనవలే లంకా నగరమును చుట్టుముట్టెను.

సైన్యము అలా నిలచిన పిదప రామచంద్రుడు తన తదుపరి కర్తవ్యమును గూర్చి ఆలోచన చేసి తన వద్దకు అంగదుని పిలిపించుకొనెను.

Also read: కోలాహలంగా రామసేతు నిర్మాణం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles