- కాకతీయుల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం
- శతాబ్దాల కిందటి కట్టడానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తింపు
కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించడం సముచితం, సంతోషభరితం. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా, మన దేశం నుంచి, అందునా మన తెలుగునాడు నుంచి 2020 సంవత్సరానికి రామప్ప ఆలయానికి మాత్రమే ఈ విఖ్యాతి దక్కడం సమున్నతం. భారతదేశం సకల కళలకు నెలవైన సౌందర్య ఆరామం. అందునా అరువది నాలుగు కళలకు ఆలవాలం ఆంధ్రదేశం. ఆంధ్రనగరిగా కాకతీయులచే పిలవబడిన కొలవబడిన ఓరుగల్లుకు నాలుగు ఆమడల ( ఆమడ = 8/10 మైళ్ళు) దూరంలో నెలకొన్న రామప్ప ఆలయం రసరమ్యకళానిలయం. అది రామలింగేశ్వర దేవాలయమే అయినా,ఆ శిల్పి రామప్ప పేరుతోనే రామప్పగుడులుగా విఖ్యాతి చెందడమే విశేషం.
ఎనిమిది శతాబ్దాల కిందటి ముచ్చట
ఈ ఆలయ నిర్మాణం జరిగి (క్రీ.శ 1213) ఇప్పటికి ఎనిమిది శతాబ్దాలు దాటిపోయింది. దండయాత్రలకు,దాడులకు, దోపిడీలకు,దురాగతాలకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడి చెక్కుచెదరని ఖ్యాతిని నిలబెట్టుకుంది. నేడు యునెస్కో గుర్తింపుతో ఆ విఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యింది. ఇది భారతీయ కళలకు,సాంస్కృతిక వైభవానికి, తెలుగు కళాకారులకు,పూర్వ ఏలికలకు దక్కిన ఘన గౌరవం. వందల ఏళ్ళనాడే మన నిర్మాణ చాతుర్యం ఎంత గొప్పదో, మన కళాప్రాభవం ఎంతటి ప్రతిభా సమున్నతమో, మన పాలకుల కళారాధన ఎంతటి ఆదర్శశోభితమో అద్దం పట్టే, తట్టి చూపే అనేక నిర్మాణాలు అడుగడుగునా మన దగ్గర కనిపిస్తాయి. అడుగడుగున గుడి వుంది.. అన్నట్లుగా ఈ భరతభూమిపై అడుగడుగునా గుడులు ఉన్నాయి. అందులో రామప్పగుడులు కాకతీయ కాలానికి ప్రతీకలు, గత మెంత ఘనకీర్తివంతమో చాటిచెప్పే ఘంటికలు. వందల ఏళ్ళ ప్రయాణంలో, పాలనలో విస్మృతికి, అనాదరణకు గురియైన నిర్మాణాలు ఎన్నో ఇంకా మన నేలపై ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించి కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. వాటిని పరిరక్షించుకోవడంలో బాధ్యతగా మెలగడం ప్రజలవంతు.దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, రాజప్రాసాదాలు వందలఏళ్ళనాటివైనా ఇప్పటికీ మనుగడలో ఉన్నాయంటే? అప్పటి నిర్మాణ విధానం ప్రధానమైంది.నల్ల డోలోమైట్, గ్రానైట్, శాండ్ స్టోన్ లు రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు.ఇప్పటి నిర్మాణాలు ఎక్కువకాలం నిలబడం లేదు.అంతటి కళాత్మకతను సంతరించుకోవడం లేదు. ఈ లోపాలను గుర్తించడం అత్యంత ముఖ్యం. ఏ నిర్మాణం చేపట్టినా కళాత్మకత + శాస్త్రీయత జోడించి పనిచేసే లక్షణం పూర్వుల నుంచి స్వీకరించాల్సిందే. ” There is art in science and there is science in art ” అని పెద్దలు చెబుతారు. కళ,శాస్త్రం రెండింటి సమన్వయంతో రూపొందుకొన్న ప్రతిదీ విలక్షణ శోభితం. దాన్ని అందిపుచ్చుకోవాలి.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
నేడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత అదనంగా కలిసివచ్చే అంశం. వీటన్నిటి మేళవింపుతో తాజా నిర్మాణాలు చేపడితే, అవి రామప్పగుడుల వలె వారసత్వ సంపదగా నిలుస్తాయి. ఆ రామప్ప గుడి పక్కనే రామప్ప చెరువు వుంది. అది ఎన్నో వందల ఎకరాల పంటకు ఆధారంగా నిలిచింది. ఆధ్యాత్మిక, కళా సౌందర్యంతో పాటు జీవన సౌందర్యం విలసిల్లడానికి ఇవన్నీ మూలాధారాలు. రాజులు, సంస్థానాధీశులు,జమీన్ దార్లు దేవాలయాలను నిర్మించడమే కాక, వందలాది ఎకరాల భూమిని వాటికి కేటాయించారు. మణులుమాణిక్యాలు సమర్పించారు. నృత్య, సంగీత కళలకు వేదికలుగా మలిచారు. అవన్నీ నేడు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిన దేవాలయాలు నేడు దీపారాధనకు కూడా నోచుకోక నిర్జీవమైపోయాయి. ప్రస్తుతం వెలుగుతూ ఉన్న దేవాలయాలను కాపాడుకోవడమే కాక, చీకటిలో మగ్గుతున్న వేలాది దేవాలయాలను పునరుద్ధరించాలి. ప్రాచీన కళలను వడిసిపట్టుకొనే విధంగా కళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయాలి. నేడు కొంతమేరకు అందుబాటులో ఉన్నా, అది సరిపోదు. ఆ విస్తృతి పెరగాలి. అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను కనిపెట్టి, మళ్ళీ ఆ దేవాలయాలకు కట్టబెట్టాలి. భారతీయ వారసత్వ సంపదను కాపాడుకోవడంలో, గత చరిత్ర ఘనతను తవ్వి తీయడంలో పురాతత్వ పర్యవేక్షక శాఖలకు ప్రభుత్వాల నుంచి దన్ను పెరగాలి. చిత్ర,శిల్ప,నృత్య కళా సమన్వితమైన రామప్పగుడుల వంటి పూర్వ మహా నిర్మాణాల స్ఫూర్తితో ప్రభుత్వాలు ముందుకు సాగాలి. మహాభారత రచన వల్ల రాజరాజనరేంద్రుడు, మనుమసిద్ధి చరిత్రలో ఎలా నిలిచారో, అష్టదిగ్గజకవుల వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఏ రీతిన చరితకెక్కాడో, రామప్ప గుడుల వల్ల కాకతీయ రాజులు,దానిని కట్టించిన రుద్రసేనాని (రేచర్ల రుద్రుడు) చరిత్రలో మిగిలిపోయారు. మంచి నిర్మాణం చేసి, మంచిపనులు చేస్తే, ఏ కాలంలోనైనా పాలకులు చరిత్రలో వెలిగిపోతారు. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. తప్పుడు చర్యలు చేపట్టి, తప్పు పాలన చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.ఈ శుభతరుణంలో మహాశిల్పి రామప్పకు ప్రణతులు సమర్పిద్దాం.