ఎన్నో ఏళ్ళ నుంచి కోట్లాదిమంది భక్తులు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం శరవేగంగా నిర్మాణమవుతోంది. 2023 డిసెంబర్ కల్లా దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి నిర్మాణానికి 2025 దాకా సమయం పట్టినా, 2023కే దర్శనానికి సిద్ధమవ్వడం కీలకమైన పరిణామం. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024 మే లో నిర్వహించాల్సివుంది. ఈలోపే రామమందిరం ఆకృతిదాల్చడం బిజెపికి ఎంతోకొంత కలిసొచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు నమ్ముతున్నారు. బిజెపి ఎదుగుదలకు – అయోధ్య రామమందిర అంశానికి ఉన్న అవినాభావ సంబంధం చరిత్ర విదితం.
Also read: మోదీపై సై అంటున్న దీదీ
అయోధ్య రథయాత్ర వ్యూహం
కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ఏకఛత్రాధిపథ్యం వహిస్తున్న వేళ, అడ్వాని ప్రభృతులు రచించిన ‘అయోధ్య రథయాత్ర’ వ్యూహం ఎంతగా ఫలించిందో, బిజెపి విజయప్రస్థానాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఆ పార్టీని అధికారంలోకి తేవడంలో అయోధ్య పాత్ర వెలకట్టలేనిది. మిగిలిన పార్టీల ఊహలకు, వ్యూహాలకు అతీతంగా బిజెపి అధికారంలోకి రావడమే కాక, నేడు అత్యంత బలమైన పార్టీగా అగ్రస్థానంలో నిల్చొని వుంది. ఆ విజయప్రస్థానం వాజ్ పెయితో మొదలై నరేంద్రమోదీతో అందలమెక్కింది. భారతదేశంలో అధికసంఖ్యాకులైన హిందువులను బిజెపి వైపు ఏకం చేసిన బలమైన అంశాల్లో అయోధ్య రామమందిరాన్ని ఒకటిగా చెప్పుకుంటారు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు, అవినీతి ముద్రలు, అసమర్ధత వంటి చీకటి కోణాలు బిజెపి వెలిగిపోవడానికి అదనంగా కలిసొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బలహీనతలు నరేంద్రమోదీ కాలానికి బాగా అక్కరకు వచ్చాయి. అయోధ్య అంశంలో పీవీ నరసింహారావు దగ్గర పరిష్కారమార్గాలు ఉన్నప్పటికీ ,ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆ సలహాలను స్వీకరించే మానసిక స్థితిలో లేరు. పీవీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అయోధ్య రామమందిరం అంశంలో మొదటి నుంచీ చాలా చురుకుగా ఉన్న బిజెపి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. కాంగ్రెస్ కు లౌకిక పార్టీ అనే ముద్ర ఉన్నా, సోనియాగాంధీ సమయంలో ఆ భావానికి చిల్లులుపడడం ప్రారంభమయ్యాయి. విదేశీయురాలు అనే ముద్రకు తోడు హిందూత్వంపై ఆమెకు ఏ మేరకు గౌరవం ఉందనే సందేహాలు ప్రజల్లో నాటుకున్నాయి. బిజెపి ఎజెండాకు ఇది కూడా లాభాన్ని కలిగించింది. మన్ మోహన్ సింగ్ పదేళ్లపాలనలోని ద్వితీయార్ధం ఘోరంగా చెడ్డపేరు మూటకట్టుకుంది. పెత్తనమంతా సోనియాది -ప్రధాని కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే అనే ప్రచారం ఉవ్వెత్తున జరిగింది. అదే సమయంలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ అద్భుతాలు చేస్తున్నారనే ప్రచారం పెరిగింది. బిజెపి /మోదీ అధికారంలోకి వస్తే, అయోధ్య రామమందిరం అంశానికి అనుకూలమైన వాతావరణం వస్తుందనే మాటల గాలులు గట్టిగా వీచాయి. అందరూ భావించినట్లుగానే నరేంద్రమోదీ పాలనా కాలంలోనే రామమందిర నిర్మాణానికి ఏళ్ళ తరబడి ఎదురుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్మాణం కూడా ఆరంభమైంది. కరోనా సమయంలోనూ ఎటువంటి అవరోధాలు ఎదురుకాలేదు. శ్రీరామ జన్మస్థలంలో మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండేళ్లల్లో ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ వర్గాలు అంటున్నాయి. మందిర ప్రాంగణంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్, పరిశోధనా కేంద్రం కూడా రూపుదాల్చుకోనున్నాయి.
ఏడాది కిందట భూమిపూజ
గతేడాది ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేసిన తర్వాత పనులు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.ఆలయ నిర్మాణానికి విరాళాలు కూడా వెల్లువెత్తాయి.ఇప్పటికే మూడు వేలకోట్ల రూపాయల విరాళాలు పోగయినట్లు సమాచారం. మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ గెలవడం బిజెపికి అనివార్యం. ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుఓటములకు ఈ ఫలితాల ప్రభావం ప్రముఖంగా ఉంటుంది. దేశంలోనే అత్యధిక లోక్ సభా స్థానాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. దేశ రాజకీయ అధికారాన్ని శాసించగల శక్తి ఉత్తరప్రదేశ్ కు ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన సంతృప్తికరంగా లేదనే ప్రచారం ఎక్కువగానే ఉంది. అంతర్గతంగా పార్టీలోనూ , ఇటు ప్రజల్లోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందనే మాటలు గట్టిగా వినపడుతున్నాయి. అక్కడ బిజెపి మళ్ళీ అధికారంలోకి రావడం గతమంత సులువు కాదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగానూ ప్రజలు సుఖంగా లేరు. కరోనా తెచ్చిన కష్టాలకు మిగిలిన కష్టాలు కూడా జతకట్టాయి. ప్రజలు ఆరోగ్యపరంగానూ, ఆర్ధికంగానూ, సామాజికంగానూ నలిగిపోతున్నారు. నరేంద్రమోదీపై ప్రజలకు గతంలో ఉన్నంత ఆకర్షణ ఇప్పుడు లేదని, ఆ గ్రాఫ్ తగ్గుముఖం పట్టిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి, పాలన సర్వజనరంజకంగా మారకపోతే, ప్రతిపక్షాల బలం పెరుగుతుంది. ఇప్పటికే, పెగాసస్ అంశంలో విపక్షాల మధ్య ఐక్యత పెరుగుతోంది. అది మెల్లగా మిగిలినవాటికీ పాకే అవకాశాలు లేకపోలేదు.
Also read: రామప్ప ఆలయానికి విశ్వవిఖ్యాతి
దూకుడు పెంచిన రాహుల్
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో కూడా దూకుడు పెరుగుతోంది. వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. రాహుల్ ను, కాంగ్రెస్ ను వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. బిజెపిని/మోదీని గద్దెదింపడానికి ఎవరి వెంటైనా నడుస్తానని మమతా బెనర్జీ అంటున్నారు. సమీప కాలంలో వచ్చే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపి భవిష్యత్తును చాలావరకు నిర్ణయిస్తాయని అంచనా వేయవచ్చు. రామమందిర నిర్మాణం బిజెపికి కలిసివచ్చే అంశమే అయినప్పటికీ, పాలనలో, అభివృద్ధిలో, ప్రజల కష్టాల పరిష్కారంలో ప్రగతిని సాధించకపోతే కేవలం అదొక్కటే గెలుపుకు నిచ్చెనగా నిలబడదు. ఇప్పటికైనా, ఆత్మసమీక్ష చేసుకొని ముందుకు సాగితే, అధికారంలోకి రావడానికి ఆ అంశం అదనంగా ఉపకరిస్తుంది. సర్వతోముఖ అభివృద్ధి, సామాజిక శాంతి అసలైన ఆయుధాలని పాలకులు గుర్తించాలి. అయోధ్య రామమందిరం గొప్ప నిర్మాణంగా చరిత్రలో వాసికెక్కుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ చరిత్రకెక్కుతారు. అందులోనూ అనుమానం లేదు. చరిత్రలో ఆదర్శంగా చెప్పుకొనే ‘రామరాజ్యం’ ఆచరణలో ప్రతిఫలిస్తే, ఆ కీర్తి నేటి పాలకులకూ దీప్తిగా నిలుస్తుంది.
Also read: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో యువతకు ప్రాధాన్యం