వోలేటి దివాకర్
బాలానాం రోదనం బలం అన్నారు… పెద్దవారు ఏడిస్తే అరిష్టం అంటారు. అయితే శ్రీ రామకృష్ణ పరమహంస మనసారా ఏడ్చి దైవ కృప పొందారని ఋషిపీఠం వ్యవస్థాపకులు, సమన్వయ సరస్వతి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వెల్లడించారు. శోకానికి ఎంతో బలం ఉంటుందని ఏడ్చి ఏదయినా సాధించవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పద్దతుల్లో పని చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 4 వ భక్త సమ్మేళనంలో భాగంగా శ్రీరామకృష్ణుల జీవిత వైశిష్ట్యం అనే అంశంపై శనివారం షణ్ముఖశర్మ ప్రసంగించారు. రామకృష్ణ సర్వధర్మ స్వరూపుడని దశావతారాల తరువాతి అవతారం రామకృష్ణుడన్నారు. పురాణ పురుషులు ప్రవరించిన సనాతన ధర్మాన్నే శ్రీరామకృష్ణ భావజాలమని, అది వివేకానంద ద్వారా విశ్వవ్యాప్తమైందన్నారు. ప్రజల్లో ఆత్మన్యూనత, దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో రామకృష్ణ పరమహంస జన్మించారని, అలాంటి క్లిష్ట సమయంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు కృషిచేశారన్నారు. రామకృష్ణుల వారి మాటలు, బోధనలే ఉపనిషత్తులని, ఆయన జీవితమే ఉపనిషత్తులకు భాష్యమని షణ్ముఖశర్మ అభివర్ణించారు.
వేద సిద్ధాంతాల్లోని సత్యాన్ని ఆయన రుజువు చేసిన మహాపురుషుడని కొనియాడారు. జన్మతః సిద్ధులైన రామకృష్ణుడు గురువులకే గురువన్నారు. ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే పరిపూర్ణ జ్ఞానం లభిస్తుందన్నారు. చికాగో మహాసభలో అన్ని మతాలకు తల్లిలాంటిది హిందూ మతమని రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద ప్రకటించారని సామవేదం షణ్ముఖశర్మ చెప్పారు. అయితే ఎవరి మతాన్ని వారు పాటిస్తూ, అన్ని మతాలను గౌరవించాలని, సమన్వయమే శాంతికి మార్గమని రామకృష్ణ చెప్పారన్నారు. భక్తి సేవకు ప్రత్యామ్నాయం కాదని, భక్తితో సేవ చేయాలన్నారు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పదన్నారు. పరమహంస ఉనికే జ్ఞానదీపమని అభివర్ణించారు. భగవద్ అనుగ్రహమే జీవితానికి సార్థకమన్నారు. భగవంతుని అనుగ్రహం కోసం ఆత్మశుద్ధి, శీల నిర్మాణం ప్రధానమన్నారు. శీల నిర్మాణాన్ని వృద్ధి చేసే విద్యావిధానం ఎంతో అవసరమని సామవేదం పిలుపునిచ్చారు.
గంగలో మునిగితే పాపాలు పోవట
గంగ .. గోదావరిలో మునిగితే పాపాలు పోవని , ఆ పాపాలు పుణ్యాత్ములకు బదిలీ అవుతాయన్నారు . అయితే హరినామ స్మరణ చేసే వారికి అవి అంటుకోవని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు వివరించారు. ఐహిక సుఖాలు వదిలించుకుని వైరాగ్యంలో ఉన్నపుడే మోక్షం లభిస్తుందని అన్నారు. వ్యాకులత, కష్టం, వ్యాధులు దేవుడి దగ్గరకు చేరుస్తాయన్నారు. కష్టాల్లోనే దేవుడ్ని వేడుకోవడమే ఇందుకు కారణమన్నారు.
శ్రీశారదాదేవి వచనామృతం అనే అంశంపై గరికపాటి ప్రవచనం చేశారు. మానవుడిలోని బలహీనలతలను కూడా హిందూమతం గుర్తించిందని గుర్తుచేశారు. శారదామాత చివరి రోజుల్లో కష్టాలను ఎంతో సహనంతో భరించారన్నారు. దినకృత్యాలను తపస్సుగా భావించారన్నారు. పదేళ్ల పాటు తోటకూరతో శారదమాత నెట్టుకొచ్చారన్నారు. భగవన్నామ స్మరణతో దినకృత్యాలు చేస్తే తపస్సు చేసినట్టేనన్నారు. భగవంతుడి అనుగ్రహం కోసం తపనతో కృషిచేస్తే ఆత్మజ్ఞానం పొందవచ్చన్నారు. అప్పుడు గురువులే వెదుక్కుంటూ వస్తారని నరసింహారావు తెలిపారు. శాస్త్రబలాల కన్నా దైవబలం ఎంతో గొప్పదన్నారు.
భక్త సమ్మేళనంలో వేళంగి వంటలు..
రామకృష్ణ-వివేకానంద భావప్రచార పరిషత్ భక్త సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన వేళంగి వంటగాళ్లతో వంటలు చేయిస్తూ. . ప్రతీరోజూ వేలాది మంది భక్తులకు రుచికరమైన వంటకాలు వడ్డిస్తున్నారు. భక్తులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాలు, టిఫిన్లు వడ్డిస్తున్నట్లు
భోజన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వేట్లపాలెం రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు కంటిపూడి సుబ్బారావు, కె శ్రీనివాసరావు వెల్లడించారు. భోజన, టిఫిన్ల తయారీలో సహకరించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్వచ్చందంగా మహిళా సేవకులు తరలివచ్చారని వారు తెలిపారు.